విశాఖలో బోణీ కూటమిదే!
ఈ సారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నంపై వైసీపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
By: Tupaki Desk | 24 May 2024 5:13 AM GMTఈ సారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నంపై వైసీపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అధికారంలోకి వస్తే జగన్ వైజాగ్ నుంచే పాలన కొనసాగించే అవకాశం ఉండటంతో ఈ నగరంపై పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇక్కడి అసెంబ్లీ స్థానాల్లో విజయాలు సాధించడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కానీ విశాఖలో వైసీపీని చావుదెబ్బ తీసేందుకు కూటమి సిద్ధమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ కూటమికే మెరుగైన ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. విశాఖలో మొదటగా విశాఖ సౌత్ నియోజకవర్గం ఫలితం వెలువడే అవకాశముంది. ఇక్కడ కూటమి అభ్యర్థిదే విజయమనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.
విశాఖలోని నాలుగు సెగ్మెంట్లలో తొలి ఫలితం వచ్చేది విశాఖ దక్షిణం నియోజకవర్గం అనే చెప్పాలి. ఇక్కడ ఓటర్ల సంఖ్య తక్కువ. సుమారు రెండు లక్షల ఓటర్లున్నారు. దీంతో ఇక్కడే మొదటగా ఫలితం రాబోతుంది. దీంతో బోణీ కొట్టేది కూటమి అనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ కూటమి వర్సెస్ వైసీపీగా టఫ్ ఫైట్ నడిచింది. ఇక్కడ గత రెండు ఎన్నికల్లోనూ తెలుగు దేశం పార్టీ తరపున వాసుపల్లి గణేష్ కుమార్ గెలిచారు. కానీ ఈ సారి ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలోకి జంప్ అయ్యారు. వైసీపీ నుంచి పోటీలో నిలబడ్డారు.
ఇక్కడ కూటమి తరపున జనసేన నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ తరపున గంగిరెడ్ల వీర వెంకట హారిక పోటీ చేశారు. కానీ ఇక్కడ ప్రధానంగా వంశీకృష్ణ, వాసుపల్లి మధ్యే పోటీ నెలకొంది. పోలింగ్ సరళిని బట్టి చూస్తే వంశీకృష్ణకే గెలిచే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు సార్లు టీడీపీ నుంచి గెలిచిన వాసుపల్లి పార్టీ మారడంతో ప్రజల్లో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వక్తమవుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఓట్లన్నీ కూటమి అభ్యర్థికే పడటంతో వంశీకృష్ణ గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు.