Begin typing your search above and press return to search.

స్టీల్ ప్లాంట్ ఇష్యూతో కూటమికి వైసీపీ షాక్...!

ఇక ఇపుడు చూస్తే నిన్నా మొన్నటి వరకూ వైసీపీ బీజేపీల మీదనే స్టీల్ ప్లాంట్ కార్మికులు నిప్పులు చెరుగుతూ వచ్చారు.

By:  Tupaki Desk   |   1 April 2024 4:39 AM GMT
స్టీల్ ప్లాంట్ ఇష్యూతో కూటమికి వైసీపీ షాక్...!
X

విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ మరోసారి ఎన్నికల్లో ఆయుధంగా మారబోతోంది. నిజానికి ఈ అంశం 2021లో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీకి ఉపయోగపడింది. స్టీల్ ప్లాంట్ పరిధిలోని వార్డులు అన్నింటిలోనూ పసుపు జెండాలు రెపరెపలాడాయి. దాంతో ముప్పైకి తగ్గకుండా కార్పోరేటర్లను గెలుచుకుని విశాఖ కార్పోరేషన్ లో టీడీపీ కీలకంగా మారింది.

ఇక ఇపుడు చూస్తే నిన్నా మొన్నటి వరకూ వైసీపీ బీజేపీల మీదనే స్టీల్ ప్లాంట్ కార్మికులు నిప్పులు చెరుగుతూ వచ్చారు. దానికి కారణం రెండు పార్టీలు అధికారంలో ఉన్నాయి. కేంద్రం ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే వైసీపీ ఆపడానికి ప్రయత్నం చేయడం లేదని కోపం అయితే బీజేపీ దూకుడుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తోంది అన్న మండిపాటు మరో కారణంగా ఉంది.

అయితే ఇపుడు సీన్ మారింది. ఏపీలో రాజకీయాలు మారడంతో ఉక్కు ఉద్యమకారులు తమ కోపాన్ని కూటమి మీద చూపిస్తున్నారు. కూటమిలో బీజేపీ చేరింది. అందులో జనసేన టీడీపీ ఉన్నాయి. దాంతో ఈ మూడు పార్టీల మీద నిప్పులు చెరుగుతున్నారు.

ఏపీ ప్రయోజనాల కోసమే పొత్తులు అని టీడీపీ జనసేన నేతలు చెప్పడాన్ని ఎద్దేవా చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయబోమని బీజేపీతో చెప్పించాలని ఉక్కు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అలా అయితే కూటమికి మద్దతు ఉంటుందని అంటున్నారు.

విశాఖ జిల్లా పరిధిలో గాజువాక పెందుర్తి, అనకాపల్లి, విశాఖ పశ్చిమ, నార్త్ సీట్లలో విశాఖ ఉక్కు ఉద్యమం ప్రభావం ఉంది. దాంతో ఈ సీట్లలో పట్టు కోసం ఇపుడు వైసీపీ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని వారి డిమాండ్లను తమకు అనుకూలంగా మలచుకుంటోంది. మంత్రి బొత్స సత్యనారాయణ మరో అడుగు ముందుకేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయబోమని బీజేపీ పెద్దలతో హామీ ఇచ్చిన మీదటనే కూటమి పెద్దలు విశాఖలో అడుగు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

లేకపోతే ఉత్తరాంధ్రాలో కూటమి ఓట్లు అడిగేందుకు అర్హత కోల్పోతుందని ఆయన హెచ్చరిస్తున్నారు. ఉత్తరాంధ్రకు తలమానికం అయిన స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడాన్ని వైసీపీ పూర్తి స్థాయిలో తప్పు పడుతుందని ఆయన అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలన్నది తమ పార్టీ విధానం అని ఆయన అంటున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ గతి ఏంటో బీజేపీతో పొత్తు కుదుర్చుకుంటున్న పార్టీలు తేల్చి చెప్పాలని ఆయన అంటున్నారు. మొత్తానికి చూస్తే ఇది చాలా కీలకమైన విషయమే కాదు, ఎమోషన్స్ తో కూడుకున్న అంశంగా చూస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవిని ఆనాడు రాజీనామా చేశారు.

ఇపుడు ఆయన భీమిలీ నుంచి కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. ఆనాడు చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ప్లాంట్ వద్ద భారీ సభను నిర్వహించారు. ఇక గాజువాక నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పల్లా శ్రీనివాసరావు ప్లాంట్ ప్రీవేటీకరణ ఇష్యూ మీద అమరణ దీక్ష చేపట్టారు. దాని ఫలితంగా లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీ బాగా లాభపడింది.

ఇపుడు ఆయన కూటమి తరఫున పోటీలో ఉన్నారు. బీజేపీ జెండాలతో ప్రచారం చేస్తున్నారు. దీంతో స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న ఉద్యమకారులు మండిపోతున్నారు. వారిలో పేరుకుపోతున్న కూటమి పట్ల ఆగ్రహాన్ని సొమ్ము చేసుకోవడానికి వైసీపీ వేగంగా పావులు కదుపుతోంది. మరి ఈ విషయంలో వైసీపీ ఎంతవరకూ సక్సెస్ అవుతుంది. కూటమి ఈ సమస్య నుంచి ఎలా తప్పించుకుంటుంది అన్నది వేచి చూడాల్సి ఉంది.