Begin typing your search above and press return to search.

బొత్స‌ ఎత్తు...చిత్తు: విజ‌య‌న‌గ‌రం ప్ర‌శాంతం!

ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీ నేత‌, మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ వేసిన ఎత్తు ఘోరంగా చిత్త‌యింది.

By:  Tupaki Desk   |   15 Nov 2024 3:30 PM GMT
బొత్స‌ ఎత్తు...చిత్తు:  విజ‌య‌న‌గ‌రం ప్ర‌శాంతం!
X

ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీ నేత‌, మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ వేసిన ఎత్తు ఘోరంగా చిత్త‌యింది. దీంతో విజ‌య‌న‌గ‌రంలో జ‌ర‌గాల్సిన ఎమ్మె ల్సీ ఎన్నిక‌లు ఆగిపోయాయి. వైసీపీ అధికారం కోల్పోయిన త‌ర్వాత‌.. ఆ పార్టీకే చెందిన విజయనగరం నేత‌, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజును ప‌ట్టుబ‌ట్టి.. వైసీపీ స‌స్పెండ్ చేయించింది. శాస‌న మండ‌లి చైర్మ‌న్‌గా ఉన్న మోషేన్ రాజు వైసీపీ నేత కావ‌డంతో రాత్రికి రాత్రి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

విజ‌య‌న‌గ‌రంలో ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ర‌ఘురాజు టీడీపీకి అనుకూలంగా ప‌నిచేశార‌న్న‌ది వైసీపీ చెబుతున్న ఆరోప‌ణ‌. మ‌రీ ముఖ్యంగా వైసీపీ సీనియ‌ర్ నేత‌.. బొత్స స‌త్య‌నారాయణ వ‌ర్గానికి అనుకూలంగా లేక పోవ‌డంతో ర‌ఘురాజుపై క‌క్ష పెంచుకున్న బొత్స.. ఆయ‌న‌పై లేనిపోని ఆరోప‌ణ‌ల‌తో శాస‌న మండ‌లి స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయించే ప‌న్నాగం ప‌న్నార‌న్న‌ది టీడీపీ నేత‌లు చెబుతున్న మాట‌. ఎన్నిక‌ల స‌మ‌యంలో ర‌ఘురాజు.. టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చారు.

అయితే.. ఆయ‌న వైసీపీ నుంచి బ‌య‌ట‌కు రాలేదు. వైసీపీ త‌ర‌ఫున శాస‌న మండ‌లిలో స‌భ్యుడిగా ఉన్నా రు. కానీ, ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయించారు. అనంత‌రం విజ‌యన‌గ‌రం మండ‌లి స‌భ్య‌త్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ ఇచ్చింది. అయితే.. త‌న‌ను అన్యాయంగా అన‌ర్హుడిని చేశారంటూ ర‌ఘురాజు హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిని విచారించిన హైకోర్టు రెండు రోజుల కింద‌ట ర‌ఘురాజును స‌స్పెండ్ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే నిర్ణ‌యం ప్ర‌క‌టించార‌ని పేర్కొంది.

ఈ నేప‌థ్యంలోనే ర‌ఘురాజు స‌భ్య‌త్వాన్ని పున‌రుద్ధ‌రించింది. దీంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం విజ‌య‌నగ‌రం మండ‌లి స‌భ్యుడి ఎన్నిక‌ల‌ను నిలిపివేసింది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన నామినేష‌న్లు.. క‌ట్టిన డిపాజిట్ల‌ను వెన‌క్కి ఇస్తారా? లేదా? అనేది చూడాలి. ఇక, ఇక్క‌డ నుంచి స్వ‌తంత్రులు స‌హా.. ప‌లువురు నాయ‌కులు పోటీ చేశారు. వీరంతా ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసిన ద‌శ‌లో హైకోర్టు తీర్పు.. త‌ద‌నంత‌రం కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణ‌యంతో మొత్తంగా ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. ఈ ప‌రిణామాలు.. బొత్స రాజ‌కీయాల‌పైనా ప్ర‌భావం చూపుతున్నాయి.