Begin typing your search above and press return to search.

విజయనగరం ఘోర రైలు ప్రమాదం.. లైవ్ అప్డేట్స్!

ఈ ఏడాది జూన్‌ లో జరిగిన ఒడిశాలోని బాలేశ్వర్‌ రైలు ప్రమాద సంఘటన తీవ్ర విషాదాలు నింపిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   30 Oct 2023 4:56 AM GMT
విజయనగరం ఘోర రైలు ప్రమాదం.. లైవ్ అప్డేట్స్!
X

ఈ ఏడాది జూన్‌ లో జరిగిన ఒడిశాలోని బాలేశ్వర్‌ రైలు ప్రమాద సంఘటన తీవ్ర విషాదాలు నింపిన సంగతి తెలిసిందే. ఇండియన్ రైల్వే హిస్టరీలోనే అది అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటని అన్నారు. ఈ క్రమంలో తాజాగా విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తవలస మండలం కంటకాపల్లి - అలమండ మధ్య ఆదివారం రాత్రి ట్రాక్‌ పై ఉన్న రైలును మరో రైలు వెనకనుంచి ఢీకొట్టడంతో ఈ పెనుప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మూడు బోగీలు నుజ్జయి 14 మంది దుర్మరణం చెందగా.. 100 మందికి గాయాలయ్యాయని తెలుస్తుంది.

అవును... ఆదివారం రాత్రి ఘోరం జరిగిపోయింది. విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే 14 మంది మృతి చెందగా.. 10 మృత దేహాలను వెలికితీశారని చెబుతున్నారు. మరో నాలుగు మృతదేహాలు బోగీల మధ్య చిక్కుకున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం సహాయకచర్యలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అసలు ఏం జరిగింది..?:

విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం - పలాస (08532) రైలును విశాఖపట్నం-రాయగడ (08504) రైలు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో రాయగడ రైలు ఇంజిన్ సహా ఐదు బోగీలు నుజ్జునుజ్జు కాగా, మరికొన్ని పట్టాలు తప్పాయి. ఈ సమయంలో అక్కడే మరో ట్రాక్‌ పైనున్న గూడ్సు రైలు బోగీలపైకి అవి దూసుకెళ్లాయి. దీంతో ఇక్కడ భీతావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారుచీకట్లు అలుముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

ప్రమాదం జరిగినప్పుడు రాయగడ రైలుకు చెందిన కొన్ని బోగీలు గూడ్సు రైలును ఢీకొట్టడంతో మొత్తం రెండు ప్యాసింజర్‌, గూడ్సు రైళ్లలో కలిపి ఏడు బోగీలు నుజ్జయ్యాయని చెబుతున్నారు. ట్యాంకర్‌ గూడ్సుపైకి పలాస రైలుకు చెందిన రెండు బోగీలు దూసుకెళ్లడంతో పట్టాలు పైకి లేవడం.. దానికింద రైలు తలకిందులుగా దూసుకెళ్లిన తీరు ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోందని అంటున్నారు.

భారీగా మృతులు, క్షతగాత్రుల సంఖ్య?"

పలాస, రాయగడ ప్యాసింజర్‌ రైళ్లలో సుమారు 1,400 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా ప్రాంతంలో సహాయ చర్యల్లో పాల్గొన్న సిబ్బంది అంచనా ప్రకారం మృతుల సంఖ్య 40-50 వరకు ఉంటుందని తెలుస్తుంది. అర్ధరాత్రి వరకు 10 మంది మృతదేహాలను వెలికితీశారు. అయితే అధికారికంగా మృతుల సంఖ్య 14 అని అధికారులు చెబుతున్నారు! ఇక క్షతగాత్రుల సంఖ్య 100కు పైగా ఉందని అంటున్నారు!

ప్రమాధంలో మృతి చెందినవారు వీరే!:

విజయనగరం రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారిలో కంచు బాకత్ రవి, చల్లా సతీష్, గిడిజాల లక్ష్మీ, కరణం అక్కల నాయుడు, నాగరాజు, టి. సుగుణమ్మ, లోకో పైలట్ ఎస్ ఎం రావులుగా అధికారులు గుర్తించారు. మృతులు అంతా ఉత్తరాంధ్రకు చెందిన వారేనని తెలుస్తోంది. గుర్తించిన అనంతరం మృతదేహలను పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాసేపట్లో ఘటనాస్థలికి సీఎం... మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు:

విజయనగరం రైలు ప్రమాద ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. మరికాసేపట్లో ఘటనాస్థలికి వెళ్లనున్నారు. రైలు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. అనంతరం అనంతరం చికిత్స పొందుతున్న క్షతగాత్రులనూ పరామర్శించనున్నారు!

ఇదే సమయంలో... బాధిత కుటుంబాల్ని సత్వరమే ఆదుకునేలా ఏపీ ప్రభుత్వం అన్ని రకాలచర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా... మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల సహాయాన్ని ఏపీ సర్కార్ ప్రకటించింది. ఇదే సమయంలో... మృతుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి రూ 50వేల చొప్పున సహాయం అందించనున్నారు!

రాజమండ్రి నుంచి రద్దైన రైళ్ల వివరాలు:

విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం నేపథ్యంలో సోమవారం పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా... (12718) విజయవాడ-విశాఖపట్నం రత్నాచల్‌ ఎక్స్‌ ప్రెస్‌, (12717) విశాఖపట్నం-విజయవాడ రత్నాచల్‌ ఎక్స్‌ ప్రెస్‌, 17267 కాకినాడ-విశాఖపట్నం మెమూ ఎక్స్‌ ప్రెస్‌, 17268 విశాఖపట్నం-కాకినాడ మెమూ ఎక్స్‌ ప్రెస్‌, 07466 విశాఖపట్నం-రాజమండ్రి మెమూ స్పెషల్‌, 07466 రాజమండ్రి-విశాఖపట్నం మెమూ స్పెషల్‌, 17243 గుంటూరు- రాయగడ ఎక్స్‌ ప్రెస్‌, 17244 రాయగడ-గుంటూరు ఎక్స్‌ ప్రెస్‌, 08546 విశాఖపట్నం- కోరాపుట్‌ స్పెషల్‌, 08545 కోరాపుట్‌-విశాఖపట్నం స్పెషల్‌, 17240 విశాఖపట్నం- గుంటూరు ఎక్స్‌ ప్రెస్‌!

విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ నెంబర్లు:

0891 2746330, 08912744619.. ఎయిర్టెల్ - 81060 53051, 8106053052.. బీ.ఎస్‌.ఎన్.ఎల్ - 8500041670, 8500041671

విజయనగరం కలెక్టరేట్‌: 94935 89157.. విశాఖ కలెక్టరేట్‌: 90302 26621, 70361 11169, 08912 590102.. కేజీహెచ్‌: 89125 58494, 83414 83151.. అత్యవసర విభాగం వైద్యుడు: 86883 21986.

రైల్వే ఆధ్వర్యంలోని ఫోన్ నెంబర్లు:

వాల్తేరు టెస్ట్‌ రూం: 89780 80805

వాల్తేరు డివిజన్‌: 08942286245, 08942286213

సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ : 89780 80815

విజయనగరం: 08922221206, 08922221202, 89780 80006

అలమండ, కంటకాపల్లి: 89780 81960

శ్రీకాకుళం రోడ్డు: 08942286213, 08922286245

సామర్లకోట: 08842327010

తుని: 08854252172

ఏలూరు: 08812232267

రాజమండ్రి: 08832420541