కీలక నేత మృతికి పుతిన్ కారణం కాకపోవచ్చు: అమెరికా
రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 29 April 2024 9:05 AM GMTరష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా రష్యా అధినేత వాద్లిమిర్ పుతిన్ నియంతృత్వ విధానాలపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు.
ఈ నేపథ్యంలో అలెక్సీ నావల్నీ జైలుపాలు కావడం, వివిధ కేసుల్లో ఆయనకు 19 ఏళ్ల జైలుశిక్ష పడటం, అనుమానాస్పద స్థితిలో ఆయన మృతి చెందడం జరిగాయి. అంతేకాకుండా కొద్ది రోజులపాటు ఆయన భౌతిక కాయాన్ని రష్యన్ అధికారులు కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు. దీనిపై ఆ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో రష్యా ప్రభుత్వం చివరకు దిగిరాక తప్పలేదు. రష్యాలో పుతిన్ ను విమర్శించేవారంతా వరుసగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం వెనుక పుతిన్ హస్తముందనే విమర్శలు చెలరేగాయి.
ముఖ్యంగా అలెక్సీ నావల్నీ మృతి చెందినప్పుడు అమెరికాతోపాటు యూరప్ దేశాలు కూడా ఆయన మృతికి పుతిన్ కారణమని ఆరోపించాయి. ఇది రష్యా ప్రభుత్వం చేసిన హత్యేనని తీవ్ర ఆరోపణలు గుప్పించాయి. పుతిన్ పై దేశ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంతో తట్టుకోలేక ఆయనను హత్య చేశారని విమర్శించాయి.
ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. నావల్నీ మృతికి రష్యా అధినేత పుతినే కారణమని ఆరోపించడం కాకరేపింది. పుతిన్ క్రూరత్వానికి ఇది నిదర్శనమని మండిపడ్డారు.
ఈ క్రమంలో అమెరికా దాని మిత్ర దేశాల ఆరోపణలను రష్యా తీవ్రంగా ఖండించింది. అలెక్సీ నావల్నీని తాము చంపలేదని.. ఆయన సహజసిద్ధ కారణాలతోనే మరణించారని వెల్లచింది. అతడిపై ఎలాంటి విష ప్రయోగం జరగలేదని స్పష్టం చేసింది. అలాగే హత్యాయత్నాలు కూడా చోటు చేసుకోలేదని తేల్చిచెప్పింది.
అయితే ఇప్పుడు అమెరికా పుతిన్ పై తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని చంపాలని పుతిన్ ఆదేశాలు జారీ చేయలేదని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించినట్టు సమాచారం.