Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ లాంగ్ మిస్సైల్.. పుతిన్ అణు సంతకం.. ఇక మహా సమరమే?

‘‘మేం అందించే క్షిపణులను రష్యా గడ్డపైకి ప్రయోగించొద్దు’’ ఇదీ ఇంతకాలం ఉక్రెయిన్ కు అమెరికా విధించిన షరతు.

By:  Tupaki Desk   |   19 Nov 2024 12:10 PM GMT
ఉక్రెయిన్ లాంగ్ మిస్సైల్.. పుతిన్ అణు సంతకం.. ఇక మహా సమరమే?
X

‘‘మేం అందించే క్షిపణులను రష్యా గడ్డపైకి ప్రయోగించొద్దు’’ ఇదీ ఇంతకాలం ఉక్రెయిన్ కు అమెరికా విధించిన షరతు. కానీ, దీనిని కుర్చీ దిగుతున్న అధ్యక్షుడు జో బైడెన్ రద్దు చేశారు. ఇదే అదనుగా ఉక్రెయిన్ అనుకున్నంత పని చేసింది. మూడో ప్రపంచ యుద్ధం దిశగా రష్యాపై మొదటి మిస్సైల్ ను ప్రయోగించింది. అది అమెరికా అందించిన ‘ఆర్మీ టాక్టికల్‌ మిస్సైల్‌ సిస్టమ్‌ (ఏటీఏసీఎంఎస్) మిస్సైల్. ఇది ఉక్రెయిన్‌ పై రష్యా యుద్ధం మొదలుపెట్టిన వెయ్యి రోజులైన సందర్భంలో చోటుచేసుకోవడం గమనార్హం.

గేమ్ చేంజర్..

దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై దాడికి వినియోగించుకునేందుకు బైడెన్‌ ఉక్రెయిన్ కు పచ్చ జెండా ఊపడం రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ గతిని మార్చనుంది. దీనికితగ్గట్లే ‘‘అమెరికా తయారీ దీర్ఘ శ్రేణి క్షిపణులను మేం ప్రయోగిస్తే యుద్ధ భూమిలో చాలా మార్పులు వస్తాయి’’ అని ఉక్రెయిన్‌ మంత్రి ఆండ్రీ సైబిగా వ్యాఖ్యానించారు. బైడెన్‌ నిర్ణయం ‘‘గేమ్‌ ఛేంజర్‌’’ అని అభివర్ణించారు.

పుతిన్ తోక తొక్కినట్లే..

అనుమతి వచ్చిందే ఆలస్యం.. రష్యాపైకి ఉక్రెయిన్ అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణిని ప్రయోగించింది. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ తోక తొక్కిన తాచుపాములా మారారు. అణ్వాయుధాల వాడకానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే కీలక ఫైల్ పై సంతకం చేసి పారేశారు. దీనిప్రకారం.. అణ్వాయుధాలున్న దేశం సాయంతో ఏ దేశమైనా రష్యాపై దాడి చేస్తే.. దాన్ని వారిద్దరూ కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణిస్తారు. అంటే అణ్వాయుధాలు లేని ఉక్రెయిన్.. అణ్వాయుధ అమెరికాతో కలిసి దాడి చేయడంతో పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

రెండు నెలల కిందటే చెప్పారు..

మాపై దీర్ఘ శ్రేణి ఆయుధాల వినియోగానికి పాశ్చాత్య దేశాలు ఆమోదం తెలిపితే.. అది నాటో, అమెరికా, యూరప్ నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్లేనని పుతిన్‌ రెండు నెలల కిందటే హెచ్చరించారు. అదే జరిగితే నాటో సైనిక, సాయుధ సంపత్తిపై దాడులు చేస్తామని తేల్చి చెప్పారు. పైగా అణు విధానం భారీ మార్పులు చేశారు. డ్రోన్ దాడి చేసినా అణ్వాయుధాల ప్రయోగం చేపట్టవచ్చు అనే మాటను చేర్చారు. ఇప్పుడు దానిని మరింత సరళం చేసింది. ఆ ప్రకారం.. పాశ్చాత్య దేశాలు నేరుగా దాడి చేస్తే అణ్వాయుధాలు వాడడానికి వీలుగా నిబంధనలు సవరించింది.

ఇప్పడు ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ మిస్సైల్ దాడి.. పుతిన్ అణు సంతకం ఎక్కడకు దారితీస్తాయో చూడాలి.