ఏపీలో ఎంపీ అభ్యర్థిగా బరిలోకి మాజీ వాలంటీర్!
సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో అనూహ్య పరిణామాలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 25 April 2024 7:10 AM GMTసార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో అనూహ్య పరిణామాలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల్లో తలపడబోతోన్న అభ్యర్థుల మధ్య పోటీ గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఉదాహరణకు పిఠాపురంలో గీతా వర్సెస్ పవన్... విజయవాడ లోక్ సభ పరిధిలో కేశినేని బ్రదర్స్ మధ్య పోటీ.. కడప లోక్ సభ పరిధిలో వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ అవినాష్ వంటి కొన్ని ఆసక్తికరమైన పోటీలు ఉన్నాయి.
ఈ క్రమంలో ఏపీ వాలంటీర్ గా ఉంటూ, రాజీనామా చేసిన ఒక వ్యక్తి ఇప్పుడు ఎన్నికల బరిలోకి దిగుతుండటం ఆసక్తిగా మారింది. సాధారణంగా ఏపీలో వాలంటీర్లకు సంబంధించిన ఏ విషయమైనా తీవ్ర చర్చనీయాంశంగానే ఉంటుంది.. మీడియా ఫోకస్ కూడా ఎక్కువగా ఉంటుంది. గతంలో వీరిపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. వీరిని వైస్ జగన్ సైన్యంగా అభివర్ణించిన సంగతీ తెలిసిందే.
ఈ క్రమంలో.. వాలంటీర్ బాధ్యతలకు రాజీనామా చేసిన ఒక వ్యక్తి ఇప్పుడు వైసీపీ అభ్యర్థిపై పోటీకి నిలబడుతున్నాడు. అవును... బాపట్ల జిల్లా చీరాల మండలానికి చెందిన కట్టా ఆనంద్ బాబు అనే మాజీ వాలంటీర్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగా... స్థానిక ఎంపీ నందిగాం సురేష్ పై పోటీకి నిలబడుతున్నాడు. ఈ మేరకు బాపట్ల పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేసేశారు!
ఈ సందర్భంగా స్పందించిన ఆనంద్ బాబు.. సిట్టింగ్ ఎంపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగా... ఐదేళ్లలో ఎంపీ నందిగాం సురేష్ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని, ప్రజల్ని పట్టించుకోలేదని, అందుకే తాను పోటీకి దిగినట్లు తెలిపారు! ఇంతకాలం సామాన్య జీవితం గడిపిన సురేష్.. బాపట్ల ఎంపీ అయిన తర్వాత రూ.వందల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. దీంతో... ఈ వ్యవహారం స్థానికంగా ఆసక్తిగా మారింది.