వాలంటీర్లకు మళ్లీ ఎదురు చూపులేనా..?
ఇప్పటి వరకు దీని గురించి చంద్రబాబు ఎక్కడా పన్నెత్తు మాట కూడా మాట్లాడడం లేదు.
By: Tupaki Desk | 17 Oct 2024 9:30 PM GMTరాష్ట్రంలో వాలంటీర్ల వ్యవహారం దాదాపు తెరచాటుకు వెళ్లిపోయింది. వారి గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా.. కూటమి సర్కారు నాయకులు, మంత్రులు.. వచ్చే కేబినెట్ లో చర్చించి నిర్ణయం ప్రకటిస్తాం అని చెప్పుకొచ్చేవారు. ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలతో వలంటీర్లను పక్కన పెట్టారు. తర్వా త.. వారిని తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు దీని గురించి చంద్రబాబు ఎక్కడా పన్నెత్తు మాట కూడా మాట్లాడడం లేదు.
ఇక, ఇప్పటికే 4 కేబినెట్ సమావేశాలు ముగిశాయి. ప్రతిసారీ వలంటీర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం.. ప్రజాదర్బార్‌లలో వినతులు ఇవ్వడం.. తమను తీసుకోవాలని అభ్యర్థించడం కామన్‌గా మారిపోయింది. ఇక, ఇటు మంత్రులు కూడా వచ్చే కేబినెట్‌లో వీరిపై నిర్ణయం తీసుకుంటామని, ఉపాధికల్పిస్తామని చెబుతూ వచ్చారు. కానీ, ఇప్పటి వరకు ఏ కేబినెట్ భేటీ కూడా వలంటీర్ల గురించి చర్చించింది లేదు. తాజాగా కీలకమైన కేబినెట్ భేటీ జరిగింది.
మొత్తం 6 పాలసీలను ప్రకటించారు. వీటి ద్వారా రాష్ట్రాన్ని ఆర్థికంగా, ఉపాధి పరంగా, ఉద్యోగాల కల్పన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా నడిపిస్తామని స్వయంగా చంద్రబాబు చెప్పారు. ఈ సమయంలోనే వలంటీర్ల ప్రస్తావన తీసుకువస్తారని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా చంద్రబాబు అసలు ఈ విషయం తప్ప.. అన్ని విషయాలను ప్రస్తావించారు. దీనిని బట్టి.. చంద్రబాబు కేబినెట్‌లో ఈ విషయం చర్చించలేదన్నది సుస్పష్టం.
మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? అనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. ఇక, ఇంతే. వలంటీర్ల విషయంలో సర్కారు మరో మూడేళ్ల పాటు మౌనంగా ఉన్నా ఆశ్చర్యంలేదు. అయితే.. ఎన్నికలకు ముందు ప్రజల మూడ్‌ను పట్టుకుని వారు కనుక వలంటీర్లను కోరుకుంటున్నట్టు తెలిస్తే.. అప్పుడు చూచాయగా వలంటీర్ల ను తీసుకుని.. మిగిలిన వారిని టీడీపీ యూత్ వింగ్ నుంచి నింపేసి.. ప్రజల మీదకు వదిలే అవకాశం ఉంది. సో.. మొత్తానికి `వలంటీర్ కు ఇక, ఎదురు చూపులే!`.