Begin typing your search above and press return to search.

కొడాలి నానికి బిగ్‌ షాక్‌!

దీంతో కొడాలి నానిపై గుడివాడ వన్‌ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

By:  Tupaki Desk   |   21 Jun 2024 10:02 AM GMT
కొడాలి నానికి బిగ్‌ షాక్‌!
X

గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కొడాలి నానికి బిగ్‌ షాక్‌ తగిలింది. ఆయనపై మాజీ వలంటీర్లు ఫిర్యాదు చేశారు. తమను బెదిరించి బలవంతంగా రాజీనామాలు చేయించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కొడాలి నానిపై గుడివాడ వన్‌ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో వలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వైసీపీ నేతలు వలంటీర్ల సేవలను వాడుకోవడానికి.. వారితో రాజీనామాలు చేయించారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చాక తిరిగి తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. రాజీనామా చేయనివారిని బెదిరించారనే ఆరోపణలున్నాయి.

ఎన్నికల్లో రెండు నెలలపాటు వైసీపీ నేతల వెంట తిరిగినందుకు వలంటీర్లకు రెండు నెలల జీతం రూ.10 వేలతోపాటు మరికొంత ప్రోత్సాహకాలు అందించారు. అయితే వైసీపీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టలేకపోయింది. దీంతో రాజీనామా చేసిన వలంటీర్లు లబోదిబోమంటున్నారు. తమను తిరిగి తీసుకోవాలని టీడీపీ నాయకులను కోరుతున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ ఎమ్మెల్యేలను, మంత్రులను కలిసి రాజీనామా చేసిన వలంటీర్లు గోడు వెల్లబోసుకున్నారు.

ఈ నేపథ్యంలో రాజీనామాలు చేసిన వలంటీర్ల విషయంలో సీఎం చంద్రబాబు ఆదేశాలకనుగుణంగా నడుచుకుంటామని సచివాలయాలు, వలంటీర్ల శాఖను చూస్తున్న మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు.

ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ వలంటీర్లు మాజీ మంత్రి కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను వేధించి కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

వలంటీర్ల ఫిర్యాదు మేరకు కొడాలి నానిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు వైసీపీ నేతలపై 447,506,ఆర్‌/డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

రాజకీయ లబ్ది కోసం ఎన్నికలకు ముందు పలువురు వార్డు వలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామాలు చేయించగా ఇప్పుడిది వారి మెడకే చుట్టుకుంటోందని అంటున్నారు. వివిధ పథకాల లబ్ధిదారులను గుర్తించింది వలంటీర్లే. ఈ నేపథ్యంలో వలంటీర్లను ఉపయోగించుకుని ఆయా పథకాల లబ్ధిదారులను తమకు అనుకూలంగా ఓటేసేలా చేయాలని వైసీపీ నేతలు అనుకున్నారు.

అయితే వైసీపీ అధికారంలోకి రాలేదు. దీంతో ఆ పార్టీ నేతలు బాగానే ఉన్నా.. తాము రాజీనామా చేసి నష్టపోయామని వలంటీర్లు అంటున్నారు.

తమను వైసీపీ నేతలు బెదిరించడం వల్లే రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.