కాంగ్రెస్ కి 15 శాతం ఓటు బ్యాంక్ ... షర్మిల వచ్చినా...!?
ఇక మీదట కాంగ్రెస్ పెద్దలు వరస పర్యటనలు కూడా ఏపీలో చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు.
By: Tupaki Desk | 31 Dec 2023 4:30 PM GMTకాంగ్రెస్ పార్టీని ఏపీలో లేపడానికి ఆ పార్టీ జాతీయ నాయకత్వం విశ్వ ప్రయత్నం చేస్తోంది. 2014, 2019లలో కాంగ్రెస్ ఘోరాతి ఘోరంగా ఓటమి పాలు అయింది. ఈసారి మాత్రం అలా కాకుండా ఉనికి గట్టిగా చాటుకోవడానికి కాంగ్రెస్ పెద్దలు చూస్తున్నారు. ఇక మీదట కాంగ్రెస్ పెద్దలు వరస పర్యటనలు కూడా ఏపీలో చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే ఏపీ కాంగ్రెస్ ఓటు బ్యంక్ ని వెనక్కి తెచ్చుకోవడానికి ముల్లుని ముల్లుతోనే తీయాలన్న సూత్రం మేరకు అన్న జగన్ మీద చెల్లెలు షర్మిలను ప్రయోగిస్తున్నారు కొత్త ఏడాది రావడమేంటి జనవరి నెల మూడవ తేదీన షర్మిల కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు.
ఆ రోజున ఆమె ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ సోనియా గాంధీ సమక్షంలో తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆ పార్టీ తీర్ధం పుచ్చుకుంటారు. ఇక చూస్తే మార్చిలో ఖాళీ అయ్యే రాజ్యసభ సీట్లలో ఒక దాన్ని షర్మిలకు ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం అంగీకరించింది అని అంటున్నారు.
ఇక జనవరి 8న ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ ఏపీకి వస్తున్నారు అని తెలుస్తోంది. ఆయన ఏపీకి చెందిన కాంగ్రెస్ పాత కాపులను వెనక్కి తీసుకుని వచ్చేలా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారు అని అంటున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి షర్మిలతో కలసి నడుస్తాను అని చెప్పారు. అదే విధంగా మరి కొందరు నేతలు కూడా వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి రావడానికి రెడీగా ఉన్నారని ప్రచారం సాగుతోంది.
అలాగే బీజేపీలోకి వెళ్ళిన మరి కొందరు కాంగ్రెస్ నేతలను కూడా వెనక్కి రప్పించేలా కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగుతున్నారు. వారిలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది. మొత్తం మీద చూస్తే ఏపీలో కనీసంగా పది నుంచి పదిహేను శాతం ఓట్లు తెచ్చుకోవడానికి కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచనలు చేస్తోంది అని అంటున్నారు
ఇక వైఎస్ షర్మిల ఓకే చెబితే ఆమెను వచ్చే ఎన్నికల్లో కడప లోక్ సభ నుంచి పోటీ చేయించాలని కూడా చూస్తున్నారు అని తెలుస్తోంది. ఇంకో వైపు చూస్తే ఆమెకు పీసీసీ చీఫ్ బాధ్యతలు కూడా కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేశారని అంటున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల తాజా భోగట్టా ఏమిటి అంటే ఆరు నూరు అయినా ఎట్టి పరిస్థితులలోనూ వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్ధం స్వీకరించడం ఖాయం అని. మొత్తానికి వైఎస్ షర్మిల అన్న జగన్ కి ఎదురు నిలిచేందుకు పూర్తి స్థాయిలోనే సిద్ధపడుతున్నారు అని అంటున్నారు