Begin typing your search above and press return to search.

మళ్లీ ఓటాన్ అకౌంట్...ఉచితాలకు ఇప్పట్లో నో చాన్స్ ?

ఏపీలో బడ్జెట్ సమావేశాలు అని ప్రస్తుతం జరుగుతున్నాయి కానీ బడ్జెట్ ని అయితే ప్రవేశపెట్టడం లేదు.

By:  Tupaki Desk   |   26 July 2024 4:42 AM GMT
మళ్లీ ఓటాన్ అకౌంట్...ఉచితాలకు ఇప్పట్లో నో చాన్స్ ?
X

ఏపీలో బడ్జెట్ సమావేశాలు అని ప్రస్తుతం జరుగుతున్నాయి కానీ బడ్జెట్ ని అయితే ప్రవేశపెట్టడం లేదు. అయిదు రోజుల పాటు స్వల్పకాలికం గా నిర్వహిస్తున్న ఈ సమావేశాలలో గవర్నర్ ప్రసంగం మాత్రం ఉభయ సభలను ఉద్దేశించి బడ్జెట్ సెషన్ సంప్రదాయం ప్రకారం సాగింది.

నిజానికి ఈ సమావేశాలలోనే బడ్జెట్ ప్రవేశపెడతారు అని అనుకున్నారు. కేంద్ర బడ్జెట్ ని చూసిన తరువాత బడ్జెట్ ని ప్రవేశపెడతారు అని భావించారు. ఎందుకంటే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ఆర్ధిక భరోసా వస్తుందని ఆలోచించారో ఏమో తెలియదు. అయితే అమరావతి రాజధానికి మాత్రం 15 వేల కోట్ల రూపాయలు వివిధ ఏజెన్సీల ద్వారా సమకూరుస్తామని కేంద్రం చెప్పింది.

యధాప్రకారం పోలవరం పూర్తి చేసే బాధ్యత మాది అని కేంద్రం చెప్పింది. దాంతో పాటు వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ అని ప్రకటించారు. ఆ ప్యాకేజీ ఏమిటి ఎంత నిధులు అన్నది అయితే వెల్లడి కాలేదు. స్థూలంగా ఇదీ కేంద్ర బడ్జెట్ లో ఏపీకి దక్కినది.

దీంతో ఈ బడ్జెట్ ని చూసి ఏపీ బడ్జెట్ ని వాయిదా వేసుకున్నారో లేక ముందే అనుకున్నారో తెలియదు కానీ బడ్జెట్ మాత్రం ఈసారి అసెంబ్లీలో ప్రవేశ పెట్టడం లేదు. కేంద్రం నుంచి రానున్న రోజులలో ఆర్ధికంగా మరింతగా సపోర్ట్ అవసరం అని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో ఏపీకి వివిధ రకాలైన ప్రాజెక్టుల ద్వారా పధకాల ద్వారా పెద్ద మొత్తంలో నిధులు దక్కాలని కూడా ఏపీ ప్రభుత్వం ఆశిస్తోంది.

ఇక టీడీపీ ఎంపీలు కూడా ఏపీ ఆర్ధిక పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకుని వస్తున్నారు. విశాఖ ఎంపీ శ్రీభరత్ అయితే లోక్ సభలో మాట్లాడుతూ ఏపీలో ఆర్ధిక పరిస్థితి చాలా భయంకరంగా ఉందని పేర్కొన్నారు దాంతోనే బడ్జెట్ ని కూడా ఏపీ ప్రభుత్వం వాయిదా వేసుకుందని ఆయన కేంద్ర పెద్దలకు తెలిపారు. ఆ విధంగా చూస్తే కేంద్రం ఆదుకుంటుంది అన్న ఉద్దేశ్యం అయితే టీడీపీ కూటమిలో కనిపిస్తోంది.

ఈ నేపధ్యంలో దాంతో బడ్జెట్ ని మరో మూడు నెలలకు వాయిదా వేసుకుంది. ఈ నెల 26 తో ఏపీ బడ్జెట్ సెషన్ ముగుస్తుంది. అది కూడా బడ్జెట్ ప్రవేశపెట్టకుండానే. ఇది ఒక రకంగా రికార్డుగానే చెప్పాలి. బడ్జెట్ లేని బడ్జెట్ సెషన్ గా చరిత్రలో నిలవబోతోంది.

ఇక ఈ నెల 29న మరో మూడు నెలలకు సంబంధించిన ఓటాన్ అకౌంట్ అకౌంట్ ఆర్డినెన్స్ ని తీసుకుని రావాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అంటే అక్టోబర్ లో తిరిగి అసెంబ్లీ సమావేశం అయినపుడు ఓటాను అకౌంట్ ఆర్డినెన్స్ ని ఆమోదించడమే కాకుండా పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టవచ్చు అని అంటున్నారు. ఒకవేళ అప్పటికి కూడా ఆర్ధిక పరిస్థితిలో మార్పు లేకపోతే మరో ఆర్డినెన్స్ తెచ్చినా తేవచ్చు అని అంటున్నారు. మొత్తానికి ఏపీ బడ్జెట్ కనుక ప్రవేశపెడితే అందులో సంక్షేమ పధకాలకు భారీ కేటాయింపులు ఉండాల్సిందే.

అలాగే కూటమి ఇచ్చిన అనేక హామీలకు అందులో నిధుల వరద కనిపించాలి. లేకపోతే విపక్ష వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు వస్తాయి. జనాలలో కూడా దీని మీద చర్చ జరిగి ప్రభుత్వం పట్ల నెగిటివిటీ పెరుగుతుంది. దాంతో దీనిని విరుగుడు అన్నట్లుగా ఆర్డినెన్స్ రూట్ ని ఏపీ ప్రభుత్వం ఎంచుకుందని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో అనేక ఉచిత పధకాల అమలు ఈ ఆర్ధిక సంవత్సరంలో జరిగే అవకాశాలు లేకపోవచ్చు అనే మాట వినిపిస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.