Begin typing your search above and press return to search.

ఓటరు స్లిప్పు అందకుండా ఓటేయొచ్చు.. ఎలానంటే?

ఓటు వేసేందుకు ఎక్కడికి వెళ్లాలన్న విషయాన్ని ఇట్టే తెలియజేసే ఓటరు స్లిప్పు చాలా చోట్ల పంపిణీ కాలేదు.

By:  Tupaki Desk   |   29 Nov 2023 7:06 AM GMT
ఓటరు స్లిప్పు అందకుండా ఓటేయొచ్చు.. ఎలానంటే?
X

గడిచిన కొంతకాలంగా ఎదురుచూసిన టైం వచ్చేసింది. వారాల నుంచి రోజులకు.. రోజుల నుంచి గంటల్లోకి వచ్చేసింది ఎన్నికల పోలింగ్. ఇలాంటి వేళ.. ఓటేసేందుకు వీలుగా ఓటరు స్లిప్పు ఊతకర్రలా పని చేస్తుంది. ఓటు వేసేందుకు ఎక్కడికి వెళ్లాలన్న విషయాన్ని ఇట్టే తెలియజేసే ఓటరు స్లిప్పు చాలా చోట్ల పంపిణీ కాలేదు. దీంతో.. ఓటరు స్లిప్ లేకుండా ఓటు వేయటం ఇబ్బందికరమన్న భావన పలువురిలో ఉంటోంది.

కానీ.. అదేమీ సరికాదంటున్నారు. ఓటర్ స్లిప్ ఇంటికి రాకుండా ఓటు వేయటం చాలా తేలికైన విధానమని.. ఓటు ఎక్కడ.. ఏ బూత్ లో ఉందో తెలుసుకోవటం పెద్ద కష్టం కాదంటున్నారు. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ సాయంతో ఎవరికి వారు తమ ఓటు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. అందుకు ఈ పద్దతుల్ని ఫాలో అయితే సరి.

- ఓటరు గుర్తింపు కార్డు నంబరును 1950, 92117, 28082 నంబర్లకు పంపిస్తే పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వివరాలు మెసేజ్ రూపంలో ఫోన్ కు వచ్చేస్తాయి.

- ఒకవేళ 1950 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి ఓటరు గుర్తింపుకార్డు నంబరు సాయంతో పోలింగ్ కేంద్రం.. బూత్ నంబరు.. సీరియల్ నెంబర్లను తెలుసుకోవచ్చు. ఈ టోల్ ఫ్రీ నెంబరు 24 గంటలు పని చేస్తుంది.

- అలా కూడా కాదనుకుంటే.. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకొవటం ద్వారా.. ఎవరి ఓటు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.

- www.ceotelangana.nic.in ద్వారా పోలింగ్ కేంద్రాల అడ్రెస్ లు.. వాటి ఫోటోలతో పాటు గూగుల్ మ్యాప్ వివరాల్ని కూడా వెబ్ సైట్ ద్వారా పొందే వీలుంది. ఓటు వేయాలన్న సంకల్పం ఉండాలే కానీ.. అందుకు బోలెడన్ని మార్గాలు ఉన్నాయి. ఇవేమీ కాదనుకుంటే.. ఇంటికి దగ్గర (ఓటు ఆ నియోజకవర్గంలోనే ఉండి ఉంటే) ఏర్పాటు చేసే పార్టీల బూత్ లకు వెళ్లి చూపించినా.. వారు ఇట్టే సాయం చేస్తారు. ఓటు వేసే హక్కును పక్కాగా వినియోగించుకోవటం పౌరుడిగా ధర్మం. దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది.