సింఫుల్: ఓటరు గుర్తింపు కార్డు.. క్షణాల్లో డౌన్ లోడ్
ఈ విధానంలో మొబైల్ నంబరు నమోదుతో క్షణాల్లో ఓటరు గుర్తింపు కార్డును పొందే వీలుంది. డౌన్ లోడ్ చేసుకున్న గుర్తింపు కార్డుతో ఓటు వేసే వీలుంది.
By: Tupaki Desk | 17 Oct 2023 4:39 AM GMTఅసలే ఎన్నికల కాలం. మిగిలిన రోజుల సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఓటరు గుర్తింపు కార్డుతో పని పడే పరిస్థితి. పోలింగ్ వేళ.. ఓటరు గుర్తింపు కార్డు కోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఓటరు గుర్తింపు కార్డును డౌన్ లోడ్ చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటును కల్పించింది. దీనికి సంబంధించి తన వెబ్ సైట్ లో కీలక మార్పులు చేసింది. గుర్తింపు కార్డును డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలుగా కొత్త సదుపాయాల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ విధానంలో మొబైల్ నంబరు నమోదుతో క్షణాల్లో ఓటరు గుర్తింపు కార్డును పొందే వీలుంది. డౌన్ లోడ్ చేసుకున్న గుర్తింపు కార్డుతో ఓటు వేసే వీలుంది. ఇంతకూ దాని ప్రాసెస్ ఎలా అన్నది చూస్తే.. తొలుత.. ఓటరు జాబితాలో మార్పులు.. చేర్పుల కోసం రూపొందించిన ఫాం.8ను వాడాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ లో మొబైల్ నెంబరు నమోదుకు ప్రత్యేక కాలమ్ అందుబాటులో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి.. నమోదు చేసిన తర్వాత అప్లికేషన్ ను సబ్ మిట్ చేయాలి.
ఆ తర్వాత httpa//voters.eci.gov.in లో e-epic విభాగంలోకి వెళ్లాలి. నిర్ధారిత ప్రాంతంలో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేయాలి. అనంతరం ఏ మొబైల్ నంబరు మీద ఓటరు గుర్తింపు కార్డును నమోదు చేశామో.. ఆ ఫోన్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసినంతనే ఈ ఓటరు కార్డును డౌన్ లోడ్ అవుతుంది.
ఈ విధానంతో ఎన్నికల సంఘం పంపే ఓటరు గుర్తింపు కార్డు కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. నిజానికి ఈ విధానం గతంలోనూ అందుబాటులో ఉంది. కాకుంటే.. ఎక్కువ సమయం తీసుకునేది. ఇప్పుడు అందుకు భిన్నంగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు కార్డును డౌన్ లోడ్ చేసుకునే విధానాన్ని సరళతరం చేయటంతో.. సెకన్ల వ్యవధిలోనే గుర్తింపు కార్డును డౌన్ లోడ్ చేసుకునే వీలుంది.
సో.. సరిగ్గా పోలింగ్ రోజుకు ఒకట్రెండు రోజుల ముందు కంటే.. ఇప్పుడే ఆ పని పూర్తి చేస్తే.. విలువైన ఓటు వేసే అవకాశాన్ని మిస్ అయ్యే అవకాశమే ఉండదు. ఇంకెందుకు ఆలస్యం.. డౌన్ లోడ్ చేసుకోండి. ఈ సమాచారాన్ని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి.