ఎమ్మెల్యే ఇంటినే ముట్టడించిన ఓటర్లు
ఓటుకు నోటు ఎంత మజాగా ఉంటుందో తెలిసి వచ్చింది. అది కూడా ఈసారి ఎన్నికల్లోనే.
By: Tupaki Desk | 12 May 2024 4:33 PM GMTఓటుకు నోటు ఎంత మజాగా ఉంటుందో తెలిసి వచ్చింది. అది కూడా ఈసారి ఎన్నికల్లోనే. విశాఖలో ఒక నియోజకవర్గంలో ఓటుకు నోటు అక్షరాలా అయిదు వేల రూపాయలకు చేరుకుంది. అది కూడా కొన్ని స్లమ్ ఏరియాలకు పంచడం జరిగింది. దాంతో మిగిలిన ప్రాంతాలలో ఉన్న ఓటర్లు మండిపోయారు. మేమేమి పాపం చేశామని బాహాటంగానే ఆవేశం వెళ్ళగక్కారు. వారి వైపు కూడా వచ్చి నోట్ల కట్టలు పంచుతారని ఆశ పడ్డారు. కానీ అదిగో ఇదిగో అంటూ టైం అంతా తినేశారు కానీ ఓటుకు నోటు పడలేదు.
దాంతో ఇంక లాభం లేదని ఆ ఎమ్మెల్యే అభ్యర్ధి ఇంటికే వెళ్ళి డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఆ ఇంటి ముందే తిష్ట వేసి నిరసన తెలిపారు. మాకూ డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ అదేదో తమ హక్కు అన్నట్లుగా రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేశారు.
ఈ అనూహ్యమైన ఘటనతో సదరు ఎమెల్యే అభ్యర్ధి తన ఇంటికే తళం వేసుకున్నారు. వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పైగా ఎవరికి ఇచ్చారో ఎవరికి ఇవ్వలేదో తెలియదు. తీరా చూస్తే వారంతా తమ నియోజకవర్గం వారో తెలియదు. వీధులలోకి వచ్చి ఆందోళన చేయడంతో ఆ ఎమ్మెల్యే అభ్యర్ధి వణికిపోయారు అని అంటున్నారు.
ఓటర్లకు ప్రలోభాలు పెట్టడం అన్నది అలవాటు చేసినందుకు ఇది ప్రతిఫలం అని అంటున్నారు. ఓటు రేటుని అమాంతం అయిదు వేలకు పెంచడం కూడా మరో తప్పిదం అంటున్నారు. దాంతో గుట్టుగా సాగాల్సిన పంపిణీ రచ్చగా మారింది. ఒక చోటనే ఎక్కువ నగదు ఇచ్చి మిగిలిన చోట్ల పంచకపోవడంతో పుచ్చుకున్న వారి ఓటు ఏమో కానీ అంతకు మించి వ్యతిరేకత ఇవ్వని వారి నుంచి మూటగట్టుకున్నాడు అని అంటున్నారు.
ఇదే విశాఖలో మరో చోట చూస్తే ప్రధాన పార్టీల అభ్యర్ధులకు చెందిన వారు అంతా ఒక అవగాహనకు వచ్చి ఓటు రేటుని ఎక్కడా రెండు వేలకు మించి పోనీయలేదు. అంతా సజావుగా పంపిణీ చేసుకున్నారు. పోటా పోటీగా పోరు ఉన్న చోట అభ్యర్ధుల అతి ఉత్సాహం వల్ల ఇలా ఓటుకు నోటుని పెంచేసి అసలుకే చేటు తెచ్చుకున్నారు అని అంటున్నారు. ఇలా ధర్నాలు ఆందోళనలు జరిగి మీడియాకు మ్యాటర్ పొక్కినా నిఘా వ్వవస్థలకు ఈ విషయం తెలియకపోవడమే విశేషం.