ఓటర్ల జాబితా రీ వెరిఫికేషన్!
ఓటర్ల జాబితా రీ వెరిఫికేషన్ కు ఆదేశాలు ఇచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా చెప్పారు
By: Tupaki Desk | 24 Aug 2023 7:48 AM GMTఓటర్ల జాబితా రీ వెరిఫికేషన్ కు ఆదేశాలు ఇచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. 2022, జనవరి నుండి ఇప్పటివరకు తొలగించిన ఓట్లపై రీ వెరికేషన్ తప్పదన్నారు. ఓట్ల తొలగింపుపై పెద్ద ఎత్తున ఆరోపణు వస్తున్న విషయం తెలిసిందే. ప్రతి నియోజకవర్గంలోను ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యంగా తెలుగుదేశంపార్టీ ఓట్లను అధికారపార్టీ తొలగించినట్లు తమ్ముళ్ళు నానా గోలచేస్తున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు ఎన్నికల కమీషనర్ ను కలిసి ఫిర్యాదులు కూడా చేశారు.
ఇదే విషయమై ర్యాండమ్ గా పరిశీలించిన కమీషన్ అందుకు బాధ్యులుగా చెప్పి ముగ్గురు అధికారులను సస్పెండ్ కూడా చేసింది. ఇదే విషయమై ఫిర్యాదుచేసేందుకు చంద్రబాబునాయుడు ఈనెల 28వ తేదీ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. కేంద్ర ఎన్నికల కమీషనర్ అపాయిట్మెంట్ అడిగారు. ఓట్ల తొలగింపుతో పాటు చేర్చటంలో ఎన్నికల నియమావళిని అనుసరించారా లేదా అన్న విషయాన్ని యంత్రాంగం పరిశీలిస్తుంది.
రీవెరిఫికేషన్లో భాగంగా అధికార యంత్రాంగం ప్రతి ఓటరు ఇంటికి వెళ్ళి డైరెక్టుగా పరిశీలిస్తుందని మీనా చెప్పారు. దీంతో వైసీపీ నేతలపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత అన్నది తెలిసిపోతుంది. తమ్ముళ్ళ ఆరోపణల ప్రకారం ప్రతి నియోజకవర్గంలోను 10 వేల ఓట్లను తొలగించారు. ఓటర్లజాబితాలను ముందుపెట్టుకుని ఈ ఓట్లు తమకు పడవు అని అనుమానం వచ్చిన వాటన్నింటినీ లెక్కకట్టి కొందరు అధికారుల సాయం లేదా వాళ్ళపై ఒత్తిడి తెచ్చి తొలగించారని తమ్ముళ్ళు రాతమూలకంగా ఫిర్యాదులు చేశారు.
ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా రావటంతోనే కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా అప్రమత్తమైంది. అందుకనే ఒకటికి రెండుసార్లు ఓటర్లజాబితాలను చెక్ చేస్తోంది. రీ వెరిఫికేషన్ ప్రక్రియ ముగియటానికి కనీసం మరో రెండునెలలు పట్టే అవకాశముంది. అంటే అధికార వర్గాలు చెప్పేదాన్ని బట్టి సుమారు నవంబర్ లేదా డిసెంబర్ చివరలో ఫైనల్ ఓటర్లజాబితా ముసాయిదా తయారవుతుందని అనుకుంటున్నారు. ఆ తర్వాత దానిపై వచ్చే అభ్యంతరాల తర్వాత ఫైనల్ ఓటర్లజాబితాను ప్రిపేర్ చేస్తారు. ఈ రీ వెరిఫికేషన్ కు లోకల్ గా ఉండే రాజకీయ పార్టీల ప్రతినిధులను కూడా హాజరవ్వాలని కమీషన్ చెప్పింది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.