ఈసారి ఎమ్మెల్యేకు ఎంపీకి ఇద్దరూ డబ్బులు ఇవ్వాల్సిందే...!
రాజకీయాలు ధనస్వామ్యం అయిపోయాయి. ఎవరు కాదన్నా కూడా పైసా మే పరమాత్మ హై అన్నట్లుగానే ఉంది
By: Tupaki Desk | 27 Feb 2024 8:09 AM GMTరాజకీయాలు ధనస్వామ్యం అయిపోయాయి. ఎవరు కాదన్నా కూడా పైసా మే పరమాత్మ హై అన్నట్లుగానే ఉంది. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయమని తాను ఎపుడూ చెప్పలేదని ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం మీటింగులో చెప్పేశారు. డబ్బు ఉంటేనే రాజకీయాల్లో చేయమని కూడా ఆయన మరో మాట అన్నారు.
ఓట్లు కొనుక్కోమని చెప్పను అని పవన్ అంటూనే మీ ఇష్టం అన్నారు. ఇలా కొత్త రకం పాలిటిక్స్ చేస్తాను అని వచ్చిన పవన్ లాంటి వారే వర్తమాన రాజకీయాలతో విసిగిపోతున్నారు. ఆ రూట్ లోనే వెళ్ళ్లకపోతే రాజకీయం అనే ఆటను ఎవరూ ఆడలేరని అంటున్నారు.
ఈ క్రమంలో నుంచి చూస్తే ఓటర్ల సైడ్ కూడా ఒక నీతి కాని నీతి కనిపిస్తోంది. ఆ నీతి ఏంటి అంటే ఓటుకు నోటు తీసుకోకపోయినా తమను పట్టించుకునే వారు ఎవరూ లేరని అలాంటప్పుడు ఓటుకు నోటు తీసుకుని వేస్తే తప్పేంటి అన్నదే వారి మాట. ఇక రాజకీయ నాయకులు ఏమైనా తమ ఇంట్లోంచి తీసి ఖర్చు పెడుతున్నారా ఏమిటి అన్నది కూడా మరో ప్రశ్న.
తమ వద్ద నుంచే కదా వారు తీసుకునేది, ఇస్తే తప్పేంటి అన్నది లాజిక్ పాయింట్. ఇక వారికి డబ్బుంది ఇస్తున్నారు. మనకు లేదు తీసుకుంటున్నాం, ఇది కూడా లాజికే. ఓటు కోసం కష్టపడి పోలింగ్ బూత్ దాకా వెళ్ళి గంటల కొద్దీ నిలబడి మరీ ఓటు వేస్తున్నాం, ఆ మాత్రం డబ్బులు తీసుకోకపోతే ఎలా ఆ రోజు కూలి నాలి పని చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా. అవి పోతున్నాయి కాబట్టి ఇలా తీసుకుంటే తప్పు ఏమిటి. ఇది కూడా న్యాయమైన వాదనే.
మొత్తానికి ఓటుకు నోటు అన్నది మెల్లగా మొదలై ఇపుడు బాహాటమై ఇంకా గట్టిగా చెప్పాలంటే చట్టం కంటే ఎక్కువ అయిపోయింది. చట్ట సభలలో చేసిన చట్టాలు ఎంతవరకు నూరు శాతం పాటిస్తున్నారో తెలియదు కానీ ఇలా ఓటుకు నోటు లేకపోతే వాల్యూ లేదు అనుకుంటూ సాగే అనధికార చట్టం మాత్రం బ్రహ్మాండంగా సాగుతోంది.
దాంతో రాజకీయ పార్టీలు సామాన్యులకు టికెట్ ఇవ్వడం లేదు. యాభై కోట్లు ఉంటేనే ఎమ్మెల్యే టికెట్ వంద రెండు వందలు కోట్లు ఉంటేనే ఎంపీ టికెట్ లెక్క చూసి మరీ ఇస్తున్నాయని ప్రచారం అయితే సాగుతోంది. ఎన్నికల్లో ఖర్చు పెట్టే మొత్తంలో ఓటుకు నోటుకే ఎక్కువ ఖర్చు అవుతుందని కూడా చెబుతూంటారు.
ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు ఏపీలో కొత్త వాదన సరికొత్త బేరం ఓటుకు నోటు విషయంలో వినవస్తోందిట. అదేంటి అంటే ఒకేసారి ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి. ఎంపీ ఎమ్మెల్యే రెండు ఎన్నికలు ఒకేసారి జరుగుతాయన్న మాట. ఎమ్మెల్యేకు ఎంపీకీ రెండు బటన్లు నొక్కి ఈవీఎం ల ద్వారా ఓటు వేయాలి.
ఒకేసారి రెండు బటన్లు నొక్కడంలో శ్రమ ఉందా అంటే లేదు కానీ తమ రెండు ఓట్లు వల్ల ఇద్దరు రాజకీయ లబ్ది పొందుతున్నారు కాబట్టి కచ్చితంగా రెండు ఓట్లు రెండు నోట్లూ అన్న కొత్త నినాదం మొదలవుతోందిట. అది ఈ ఎన్నికల్లోనే అని అంటున్నారు.
దానికి కారణం ఇటీవల ముగిసిన తెలంగాణా ఎన్నికలు. అక్కడ ముందే అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దానికి జనాలకు డబ్బులు పంచారు అని టాక్ నడచింది. ఇపుడు ఎంపీ ఎన్నికలు అక్కడ కూడా జరుగుతాయి. ఎంపీ ఎన్నికల్లో మళ్లీ డబ్బు మూటలు దించుతారు, పంచుతారు. సో అలా చూసుకుంటే సగటున అయిదారు నెలలు తేడా లేకుండా ఒక్కో ఓటరుకు తెలంగాణాలో రెండు మొత్తాలు అందాయి.
మరి ఏపీలో జమిలి ఎన్నికలు కాబట్టి ఒక్క నోటుతో రెండు ఓట్లు ఎలా అన్నదే తెలివైన ఓటరు నుంచి వస్తున్న కీలక ప్రశ్న. అందువల్ల మేము రెండు ఓట్లు వేస్తున్నాం కాబట్టి రెండింటికీ కలిపి డబ్బులు ఇవ్వాల్సిందే అన్నది ఓటర్ల తెలివైన న్యాయమైన నీతి అయిన డిమాండ్ గా ముందుకు వస్తోందిట.
అంటే ఇదివరకు ఒక ఎంపీ సీటులో నిలిచిన అభ్యర్ధి తన పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల ఖర్చు కూడా భరిస్తూ ఒకే నోటుతో రెండు ఎలక్షన్లూ జరిగేలా చూసుకునేవారు. ఇపుడు అలా కుదరదు అని అంటున్నారు. ఎంపీ అభ్యర్ధులు ఎవరైనా నోటు ఇస్తే అది వారికి ఒక్కరికి మాత్రమే ఓటు వేస్తారుట. అలాగే ఎమ్మెల్యే అభ్యర్ధి కూడా తన సొంత జేబులో నుంచి తీసి నోటు ఇస్తేనే ఆయనకు ఈవీఎం మిషన్ బటన్ నొక్కుడు ఉంటుందట.
సింపుల్ గా ఇలా తేల్చేశారు అని టాక్ అయితే పెద్ద ఎత్తున నడుస్తోంది. దానికి తెలంగాణా ఓటర్లను చూపిస్తూ వారికి రెండు సార్లు డబ్బులు కాబట్టి మాకూ రెండు సార్లు ఇవ్వాల్సిందే అని కూడా అంటున్నారుట. సో ఈసారి ఎన్నికల్లో డబ్బులు తీసే వారు ఎవరైనా ఉంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త అనే అంటున్నారు. ఒకటికి రెండు సార్లు ఇవ్వాల్సిందే మరి. ఆ మీదట వారికి ఓటు పడుతుందా అంటే ఓటర్లలో ఇంకా నీతి ఉంది లెండి. డోంట్ వర్రీ.