Begin typing your search above and press return to search.

అమెరికాలో ఇప్పటికి ఓట్ల లెక్కింపు బ్యాలెట్ పేపర్లతోనేనా?

మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. అమెరికాలో ఓటింగ్ పద్దతి మొత్తం ఒకే పద్దతిలో జరగదు.

By:  Tupaki Desk   |   6 Nov 2024 4:14 AM GMT
అమెరికాలో ఇప్పటికి ఓట్ల లెక్కింపు బ్యాలెట్ పేపర్లతోనేనా?
X

అమెరికా అలాంటి ఇలాంటి దేశం కాదు. ప్రపంచానికే పెద్దన్న. అగ్రరాజ్యంగా పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించిన ఆ దేశంలో దేశ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను చూసినప్పుడు కాస్తంత ఆసక్తికరంగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం.. టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే అమెరికాలో.. అధ్యక్ష ఎన్నికలకు మాత్రం ఈవీఎంలను వినియోగించకుండా నేటికి బ్యాలెట్ పత్రాలతోనే పోలింగ్ జరగటం కనిపిస్తుంది.

మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. అమెరికాలో ఓటింగ్ పద్దతి మొత్తం ఒకే పద్దతిలో జరగదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర పద్దతి అన్నట్లుగా ఉంటుంది. మన దేశంలో దేశ వ్యాప్తంగా ఒకే విధానం అమలు కావటం తెలిసిందే. దేశ వ్యాప్తంగా అన్నిచోట్ల ఈవీఎం మెషిన్లలో పోలింగ్ జరుగుతుంది. కానీ.. అమెరికాలో మాత్రం ఓటింగ్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. మొత్తంగా 3 పద్దతుల్లో ఓటింగ్ సాగుతుంది. అందులో మొదటి విధానం పేపర్ పద్దతిలో ఓటింగ్. అందులో బ్యాలెట్ పేపర్ లోని అభ్యర్థుల్లో తమకు నచ్చిన వారికి ఎదురుగా టిక్ చేస్తారు. అమెరికాలోని మెజార్టీ రాష్ట్రాలు ఇదే విధానాన్ని అనుసరిస్తూ ఉంటాయి.

అమెరికా వ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది ఇదే విధానంలో ఓట్లు వేయటం కనిపిస్తూ ఉంటుంది. రెండో విధానంలో బ్యాలెట్ మార్కింగ్ డివైజ్ లతో నిర్వహించే విధానం. ఇందులో మార్కింగ్ డివైజ్ ల తో ఓటు వేస్తారు. ఇందులో బ్రెయిలీ లిపి.. ఆడియో సాయం లాంటి ఆప్షన్లు ఉంటాయి. టచ్ స్ట్రీన్ ద్వారా ఓటరు తాను ఎంపిక చేసుకున్న అభ్యర్థికి ఓటు పడుతుంది. ఓటు వేసినంతనే.. బ్యాలెట్ ప్రింట్ అవుతుంది. అది పేపర్ రూపంలో బయటకు వస్తుంది. దాన్ని బాక్స్ లో వేస్తారు. దివ్యాంగుల కోసం ఈ విధానాన్ని అమలు చేస్తుంటారు.

మూడో విధానంలో మన ఈవీఎంలకు దగ్గరగా ఉంటుంది. వీటిని డైరెక్టు రికార్డింగ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ గా పేర్కొంటారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. అమెరికాలో ఈ మెషిన్లు అన్నిచోట్ల ఒకేలా ఉండవు. ఒక్కోచోట ఒక్కోలా ఉంటాయి. కొన్నిచోట్ల వీవీ ప్యాట్లు ఉంటాయి. ఈసారి ఎన్నికల్లో లూసియానా రాష్ట్రంలోనే పూర్తిగా ఈ పద్దతిలో ఓటింగ్ జరుగుతోంది. ఇలా.. మన దేశంలో అనుసరించే విధానానికి భిన్నంగా మూడు రకాలుగా అమెరికాలో ఓటింగ్ జరుగుతుంది.