Begin typing your search above and press return to search.

అక్కడ ఓటేయకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

గత మూడు దశలలో నమోదయిన ఓటింగ్ శాతం ఎన్నికల కమీషన్ తో పాటు, రాజకీయ పార్టీలను కలవరపెడుతున్నది.

By:  Tupaki Desk   |   13 May 2024 5:34 AM GMT
అక్కడ  ఓటేయకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
X

దేశ భవిష్యత్ కోసం ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఎన్నికలు మనదేశంలో జరుగుతున్నాయి. ఏడు దశలలో జరుగుతున్న ఎన్నికలలో ఇప్పటి వరకు మూడు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటు పలు రాష్ట్రాలలో నాలుగో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. గత మూడు దశలలో నమోదయిన ఓటింగ్ శాతం ఎన్నికల కమీషన్ తో పాటు, రాజకీయ పార్టీలను కలవరపెడుతున్నది.

అత్యల్ప ఓటింగ్ జరగడం ఎన్నికల పట్ల పౌరుల నిరాసక్తతకు అద్దం పడుతున్నాయి. ఓటు హక్కు పట్ల మనలో సరైన చైతన్యం లేకపోవడమే దీనికి కారణం. అయితే ప్రపంచంలోని అనేక దేశాలలో ఓటుహక్కును వినియోగించుకోకుంటే జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా విధిస్తారు. ఏఏ దేశాలలో ఎలాంటి చట్టాలు ఉన్నాయో ఒక సారి తెలుసుకుందాం.

బెల్జియం దేశంలో వరసగా నాలుగు సార్లు ఓటు వేయకుంటే జైలుకు వెళ్లాల్సిందే. ఒకసారి ఓటు వేయకుంటే స్వల్ప జరిమానాతో సరిపెడతారు.

సింగపూర్ లో ఓటేయకుంటే వారి పేరును ఓటరు జాబితా నుండి తొలగించడమే కాకుండా వారు ఎన్నికలలో పోటీ చేసేందుకు హక్కు కోల్పోతారు. తిరిగి వివరణ ఇచ్చి ఫీజు కట్టి ధరఖాస్తు చేసుకుంటే ఓటర్ల జాబితాలో తిరిగి నమోదు చేస్తారు.

ఉత్తర కొరియాలో ఓటు వేయకుంటే అది దేశద్రోహంగా పరిగణించి శిక్ష విధిస్తారు. అసలే నియంత రాజ్యం ఆ మాత్రం ఉంటుంది మరి.

అర్జెంటీనాలో ఓటు వేయకుంటే ఖచ్చితంగా కారణం చెప్పాల్సిందే. దానికి సంతృప్తి కలగకుంటే జరిమానా చెల్లించాల్సిందే.

పెరూ దేశంలో ఓటు వేసిన వారికి ఒక కార్డు ఇస్తారు. అది చూపితేనే ప్రభుత్వం నుండి నిత్యావసర వస్తువులు అందుతాయి. ఓటు వేయని వారికి జరిమానా తప్పదు.

ఆస్ట్రేలియాలో ఓటర్లు కచ్చితంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లాలి. అక్కడికి వెళ్లాక ఓటు వేయడం, వేయకపోవడం మీ ఇష్టం. ఓటు వేయకుంటే వారం రోజులలో విచారించి జరిమానా విధిస్తారు.

గ్రీస్ లో ఓటు వేయకుంటే డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్టు రద్దు చేస్తారు.

బ్రెజిల్‌ లో 16 ఏళ్లకే ఓటు హక్కు వస్తుంది. 70 ఏళ్లు దాటిన వారు మినహా మిగతా అందరూ ఓటు వేయాల్సిందే. లేకుంటే జరిమానా తప్పదు.

అమెరికాలో ఓటు వేయడం మీద ఎలాంటి ఆంక్షలు లేవు. అయినా అక్కడ 70 శాతం పైగా ఓటింగ్ నమోదవుతుంది.