సాయం అందలేదని ప్రశ్నిస్తే.. చెంప పగలగొట్టిన బెజవాడ వీఆర్వో
ఒక మహిళా వీఆర్వో ఒక యువకుడి చెంప ఛెళ్లుమనిపించారు. దీనిపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది.
By: Tupaki Desk | 10 Sep 2024 4:51 AM GMTవరదలు వచ్చి విజయవాడలోని పలు ప్రాంతాలు జలమయం కావటం తెలిసిందే. వేలాది మంది నేటికీ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. క్యాలెండర్లో తేదీలు మారుతున్నా.. వారికి అందాల్సిన సాయం అవసరమైనంత వేగంగా ముందుకు సాగని పరిస్థితి. ఇలాంటి వేళలో.. ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం కావటం మామూలే. ప్రశ్నించే వారి పట్ల పరుషంగా వ్యవహరించే అధికారులకు తగ్గట్లే.. ఒక మహిళా వీఆర్వో ఒక యువకుడి చెంప ఛెళ్లుమనిపించారు. దీనిపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది.
వరద బాధితుల విషయంలో అధికారులు స్నేహపూర్వకంగా మెలగాలని.. వారి సమస్యల్ని అర్థం చేసుకొని పరిష్కారం కోసం ప్రయత్నించాలని.. వారితో మర్యాదపూర్వకంగా ఉండాలని చెప్పటం తెలిసిందే. అందుకు భిన్నంగా వ్యవహారశైలిని ప్రదర్శించిన మహిళా వీఆర్వో తీరుపై జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టారు.ఆమెకు షోకాజ్ జారీ చేసి.. వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇంతకూ ఈ ఘటన ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదూ? విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లో చోటు చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది.
విజయవాడలోని 58వ డివిజన్ షాదీఖానా వద్ద వరద బాధితులకు ఇంటి వద్దకే అధికారులు వచ్చి పోలీసుల సమక్షంలో నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేయటం తెలిసిందే. ఇదే తీరులో ఈ పంపిణీ కార్యక్రమాన్ని వీఆర్వో విజయలక్ష్మి పర్యవేక్షిస్తున్నారు. వరదలు వచ్చినప్పటి నుంచి తమ వీధిలో ఇప్పటివరకు ఆహారం.. మంచినీరు అందలేదంటూ వరద బాధితులు ప్రశ్నించారు.
దీంతో.. ఆమె ఆగ్రహానికి గురై.. నిగ్రహాన్ని కోల్పోయారు. వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఒక యువకుడు (యాసిన్) ఆమెను ప్రశ్నించగా.. ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అతడి చెంప ఛెళ్లుమనిపించారు. దీంతో.. అక్కడే ఉన్న పోలీసులు సైతం షాక్ తిన్న పరిస్థితి. నన్నే ప్రశ్నిస్తావా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆమె తీరుకు పోలీసులు సైతం అవాక్కై.. వెంటనే తేరుకొని ఆమెను అక్కడి నుంచి దూరంగా పంపేశారు.
వీఆర్వో తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన స్థానికులు ఆందోళన చేపట్టారు. దీంతో.. ఈ వ్యవహారం ఉన్నతాధికారులకు చేరింది. వెంటనే స్పందించిన కలెక్టర్ స్రజన సదరు వీఆర్వోకు షోకాజ్ నోటీసు జారీచేశారు. మరోవైపు బాధితుల ఆగ్రహాన్ని వీడియో తీసిన వీఆర్వో తీరును తప్పు పడుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యం.. బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిన వైనంపై వీఆర్వో విజయలక్ష్మిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కోరారు. విధి నిర్వహణలో ఉద్యోగులు తప్పుగా వ్యవహరిస్తే వెంటనే చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేశారు.