Begin typing your search above and press return to search.

రెండేళ్ళలో పవన్ సీఎం.. బాబుకు వెన్నుపోటు ?

అటు చంద్రబాబు ఇటు పవన్ ప్రశాంతంగా తమ పనిని తాము చేసుకుంటున్నారు కదా అని అంతా అనుకోవచ్చు.

By:  Tupaki Desk   |   8 Oct 2024 2:20 PM GMT
రెండేళ్ళలో పవన్ సీఎం.. బాబుకు వెన్నుపోటు  ?
X

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం హాయిగానే ఉంది కదా. అటు చంద్రబాబు ఇటు పవన్ ప్రశాంతంగా తమ పనిని తాము చేసుకుంటున్నారు కదా అని అంతా అనుకోవచ్చు. కానీ ఇదే కూటమిలో బీజేపీ ఉంది. అందుకే బీజేపీ ఏపీలో తన అధికారాన్ని విస్తరించుకునేందుకు పవన్ కళ్యాణ్ ద్వారా చురుకుగా పావులు కదుపుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు.

ఈ మేరకు రోడ్ మ్యాప్ ని సిద్ధం చేస్తున్నారు అని ఆయన అన్నారు. నెల్లూరు లో జరిగిన సీపీఎం మహా సభలలో ఆయన మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వాని అస్థిరపరచేందుకు కేంద్ర స్థాయిలోనే కుట్ర సాగుతోందని తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఈ విషయంలో బీజేపీ పవన్ కళ్యాణ్ ని పావుగా వాడుకుంటోందని అన్నారు.

పవన్ కళ్యాణ్ బీజేపీ ఆరెస్సెస్ ట్రాప్ లో పడ్డారు అని కూడా ఆయన విమర్శించారు. ఆయన వైఖరి ఏపీకి తీవ్ర నష్టం తెచ్చేలా ఉందని అన్నారు. ఇదిలా ఉండగా ఏపీలో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం ద్వారా తెర వెనక బీజేపీ ఆరెస్సెస్ కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు. రెండేళ్ల వ్యవధిలో చంద్రబాబుని గద్దె నుంచి దించేసి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేయాలన్నది బీజేపీ మాస్టర్ ప్లాన్ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకోసమే ఏపీలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు.

ఏపీలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల విషయంలో విద్వేషాలను చొప్పించడం వెనక ఉంది ఇదేనని ఆయన అన్నారు. మత విద్వేషాలు కనుక జరిగితే ఏపీ కూడా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మాదిరిగా అశాంతి తో రగిలిపోవాల్సిందే అని ఆయన హెచ్చరించారు.

మరో వైపు చూస్తే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని సీపీఎం నేత స్పష్టం చేశారు ధరలు మండిపోతున్నాయని నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, అలాగే ఏ రకమైన అభివృద్ధి లేదని ఆయన అన్నారు. దాంతో నాలుగు నెలలకే టీడీపీ ప్రభుత్వం తీరు పట్ల ఫైర్ అవుతున్నారని అన్నారు.

ఈ నేపధ్యంలో శ్రీవారి లడ్డూల ఇష్యూ తెచ్చి ఏపీలో తమ రాజకీయం పండించాలని బీజేపీ చూస్తోందని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే పవన్ ప్రాయశ్చిత్త దీక్ష మీద లెఫ్ట్ పార్టీలు మండిపడుతున్నాయి. అదే టైం లో ఏపీలో బీజేపీ మత రాజకీయానికి ఆస్కారం కల్పించే వాతావరణం ఏర్పడుతోందని కూడా ఆందోళన చెందుతున్నాయి.

ఇవన్నీ పక్కన పెడితే రాజకీయ చతురుడు, అపర చాణక్యుడు చంద్రబాబుని గద్దె దించడం సాధ్యమా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఎంత పవన్ కి బీజేపీ మద్దతు ఇచ్చినా ఆ రెండు పార్టీలు కలిస్తే ఉన్న నంబర్ 29 ఎమ్మెల్యేలు మాత్రమే. ఇక వైసీపీని కూడా కలుపుకున్నా 40 దగ్గర నంబర్ ఆగిపోతుంది. మరి మ్యాజిక్ ఫిగర్ 88ని చేరుకోవాలంటే టీడీపీ నుంచి కచ్చితంగా 48 మందిని చీల్చి బయటకు తేవాలి

అయితే కేంద్రంలో బీజేపీ కనుక తలచుకుంటే ఇవేమీ కష్టం కాబోవని కూడా అంటున్నారు నయానా భయనా నాయకులను తమ వైపు తిప్పుకోవడంలో కమలం పార్టీ దేశంలో కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి చోట్ల తన మార్క్ ని చాటుకుంది అని కూడా గుర్తు చేస్తున్నారు. దాంతో ఏపీలో ఏమైనా జరగవచ్చా అంటే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అన్నది కూడా ఉంది.

కేంద్రం ఏపీలోని ఎంపీల మీద ఆధారపడి ఉంది. కానీ ఏపీ కూడా ఆర్థిక అవసరాల కోసం కేంద్రం మీద ఆధారపడి ఉంది. దేశ రాజకీయాల్లో చంద్రబాబు కీలకంగా మారుతారు అని అనుకున్న నాడు కామ్రేడ్స్ చెప్పినట్లుగా ఆయనను మాజీ సీఎం గా చేయడానికి అయినా ఆపరేషన్ స్టార్ట్ చేసినా చేస్తారు అని అంటున్నారు. సో కామ్రేడ్ ఆరోపణలు మాత్రం ఆసక్తిని పెంచుతున్నాయనే చెప్పాల్సి ఉంది.