Begin typing your search above and press return to search.

ఎన్నారై వైద్యుడి విషయంలో ఇంత ట్విస్టు జరిగిందా?

ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఆయన టీడీపీ ఆఫీసులో ప్రత్యక్షమై కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   19 May 2024 11:38 AM GMT
ఎన్నారై వైద్యుడి విషయంలో ఇంత ట్విస్టు  జరిగిందా?
X

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ పర్యటన సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... గన్నవరం విమానాశ్రయంలో వైఎస్ జగన్‌ కు సమీపంగా వచ్చారంటూ డాక్టర్ ఉయ్యూరు లోకేష్ అనే ప్రవాస వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ ఘటన తీవ్ర వైరల్ గా మారింది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఆయన టీడీపీ ఆఫీసులో ప్రత్యక్షమై కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ఎన్నికల పోలింగ్ పూర్తవ్వడం, ఫలితాలకు ఇంకా సుమారు రెండు వారాల వ్యవధి ఉండటంతో కుటుంబంతో విదేశీపర్యటనకు బయలుదేరారు వైఎస్ జగన్. ఈ సమయంలో ఆయన గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఉండగా ఆయనకు సమీపంగా వచ్చారంటూ డాక్టర్ ఉయ్యూరు లోకేష్ ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను వదిలిపెట్టారు. ఈ సందర్భంగా స్పందించిన లోకేష్... వైఎస్ జగన్ అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే తనను కిడ్నాప్ చేశారంటూ ఆరోపించారు.

తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన డాక్టర్ లోకేష్... తనను కిడ్నాప్ చేసి దాడి చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం భద్రతా సిబ్బంది తనను అరెస్ట్ చేశారని.. ఛాతినొప్పి వస్తోందని చెప్పినప్పటికీ పట్టించుకోలేదని ఆరోపించారు. ఇదే సమయంలో... అమెరికన్ పౌరుడైన తనపట్ల అధికారులు దౌర్జన్యంగా వ్యవహరించారని.. దీనిపై న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు.

ఆయన ఆ సమయంలో ఎయిర్ పోర్ట్ కి వెళ్లడానికి గల కారణాలను ఆయన వివరించారు. ఇందులో భాగంగా... ఎయిరిండియా విమానంలో ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి అమెరికా వెళ్లేందుకు.. గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లినట్లు లోకేష్ తెలిపారు. ఈ సమయంలో... టికెట్ ప్రింటింగ్ కోసం ఎయిర్ పోర్టుకు వెళ్లానని.. అక్కడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. అనంతరం పలుచోట్ల తిప్పారని.. ఛాతీపై కొట్టారని లోకేష్ ఆరోపించారు.

ఇదే క్రమంలో... ఈ ఘటనపై అమెరికా రాయబార కార్యాలయంతో పాటు, భారత ప్రధాని కార్యాలయం, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్‌ కు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. అదేవిధంగా ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాకు కూడా ఫిర్యాదు చేస్తానని డాక్టర్ లోకేష్ తెలిపారు. కాగా... ఈయన వైసీపీ పాలనను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉంటారు!

పోలీసుల వెర్షన్ ఇది!:

ఈ ఘటనపై డాక్టర్ లోకేష్ వెర్షన్ అలా ఉంటే... దీనిపై పోలీసులు స్పందించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... సీఎం పర్యటన నేపథ్యంలో విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేస్తుండగా, లోకేష్ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నామని.. "ఎయిర్ పోర్ట్ లో సీఎం కాన్వాయ్ ని అడ్డుకునేందుకు వెళ్తున్నా.. మీరు కలిసి రావాలి" అంటూ వాట్సప్‌ గ్రూపుల్లో టీడీపీ కార్యకర్తలను ఆయన ప్రేరేపించినట్లు గుర్తించామని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయనపై ఐపీసీ సెక్షన్‌ 151 కింద కేసు నమోదు చేసిన పోలీసులు... అనంతరం 41 నోటీసు ఇచ్చి, ఇంటికి పంపినట్లు పేర్కొన్నారు.