Begin typing your search above and press return to search.

"వ్యూహం" సినిమాపై మరో ప్రయత్నం... టి.హైకోర్టు రియాక్షన్ ఇదే!

వ్యూహం" సినిమా రిలీజ్ పై స్టే ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో తాజాగా ఈ పిటీషన్ పై విచారణ జరిగింది.

By:  Tupaki Desk   |   26 Dec 2023 8:46 AM GMT
వ్యూహం సినిమాపై మరో ప్రయత్నం... టి.హైకోర్టు రియాక్షన్  ఇదే!
X

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన "వ్యూహం" సినిమా సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదన్నట్లుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇప్పటికే ఈ సినిమా విడుదలను అడ్డుకోవడానికి పలు ప్రయత్నాలు జరగడం.. వాటన్నింటినుంచీ వ్యూహాత్మకంగా ఈ సినిమా బయటకు రావడం.. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడ జరగడం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా విడుదలను అడ్డుకోవడానికి మరో ప్రయత్నం జరిగింది.

అవును... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, ఎదురైన ఇబ్బందులు మొదలైన విషయాలతో ఆర్జీవీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వ్యూహం... విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం రాత్రి కొంతమంది దుండగులు హైదరాబాద్ లోని ఆర్జీవీ డెన్ ముందు హల్ చల్ చేశారు. దీనిపై ఆర్జీవి ఆన్ లైన్ వేదికగా వైరల్ గా రియాక్ట్ అయ్యారు.

ఈ సమయంలో... ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. "వ్యూహం" సినిమా రిలీజ్ పై స్టే ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో తాజాగా ఈ పిటీషన్ పై విచారణ జరిగింది. అయితే... ఈ విషయంలో స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. అనంతరం విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

ఈ క్రమంలో హైకోర్టులో విచారణ ప్రారంభమైన తర్వాత టీడీపీ తరపున మురళీధర్ రావ్ వాదనలు వినిపించారు. ఇందులో భాగంగా... వ్యూహం సినిమాలో రాజకీయాలకు సంబంధించిన పాత్రలను పెట్టారని.. అదేవిధంగా... టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, లోకేష్ లను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయన్న విషయం తమకు సోషల్ మీడియా ద్వారా తెసిందని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో... ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు అనుకూలంగా... టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నాయకులను డీఫేం చేసేలా ఈ చిత్రాన్ని రూపొందించారని అన్నారు. సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, మాజీ సీఎం రోశయ్య పాత్రలను నెగిటివ్ గా చూపించినట్లు తెలుస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం... ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ను రద్దు చెయ్యాలని కోరారు.

ఇదే సమయంలో... ఇప్పటికే ఈ విషయంపై సెన్సార్ బోర్డుకి ఫిర్యాదు చేసినట్లు తెలిపిన లోకేష్ తరుపు న్యాయవాది... ఈ సినిమాకు ప్రొడ్యూసర్ అడ్రస్ కూడా వైసీపీ పార్టీకి చెందిన కార్యాలయంలోనే ఉందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా... ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై ఈ సినిమా తీవ్ర ప్రభావం పడుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇలా పిటిషనర్ తరపు వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను డిసెంబర్ 28కి వాయిదా వేసింది.