Begin typing your search above and press return to search.

ఫార్ములా ఈ రేసుపై హైకోర్టుకు రిప్లై అఫిడవిట్ లో కేటీఆర్ ఏం చెప్పారు?

By:  Tupaki Desk   |   28 Dec 2024 4:15 AM GMT
ఫార్ములా ఈ రేసుపై హైకోర్టుకు రిప్లై అఫిడవిట్ లో కేటీఆర్ ఏం చెప్పారు?
X

అధికారంలో ఉన్న వేళ.. ముచ్చట పడి చేసే కొన్ని పనులు ముచ్చమటెలు పుట్టిస్తాయి. అందుకు కారణం.. ముచ్చటలో భాగంగా చాలా విషయాల్ని మర్చిపోవటం.. అధికారంలో ఉన్న వారి ముచ్చట తీర్చేందుకు అధికారులు సైతం వెనుకా ముందు చూసుకోకుండా పనులు చేయటమే.

రూల్ బుక్ అన్నది ఒకటి ఉంటుందని.. దాన్ని కొంతమేర కాదనుకుంటే ఫర్లేదు కానీ.. మొత్తంగా దాన్ని పట్టించుకోకుంటే మొదటికే మోసం వస్తుందన్న విషయం ఇప్పటికే పలుమార్లు ఫ్రూవ్ అయ్యింది. కానీ.. అదేమీ పట్టని నేతలు.. అధికారుల కారణంగా ఇబ్బందులు తలెత్తూ ఉంటాయి. తాజాగా గులాబీ ముఖ్యనేతల్లో ఒకరైన కేటీఆర్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

ఫార్ములా ఈ రేస్ విషయంలో అరెస్టు ముప్పును కేటీఆర్ ఎదుర్కొంటున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తోడు ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తూ.. ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నాల్ని చేస్తోంది. ఈ క్రమంలో తనను అరెస్టు చేయకుండా కోర్టు ఆర్డర్ తెచ్చుకున్న కేటీఆర్.. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టి వేయాలన్న పిటిషన్ ను దాఖలు చేశారు. ఇందులో భాగంగా ఏసీబీ కౌంటర కు రిప్లై ఇచ్చారు. ఇంతకీ అందులో ఏముంది? కేటీఆర్ వాదన ఏమిటి? అన్నది చూస్తే..

- ఒప్పందాల అమలులో విధానపరమైన అంశాల్ని చూడాల్సింది సంబంధిత శాఖాధికారులే. మంత్రిగా అది నా బాధ్యత కాదు.

- విదేశీ సంస్థకు నిధుల తరలింపు సమయంలోనూ అనుమతుల వ్యవహారాలను సంబంధిత బ్యాంకు చూసుకోవాలి. ఆ పని చేయాల్సింది నేను కాదు.

- హెచ్ఎండీఏ చట్టబద్ధమైన సంస్థ. ఫార్ములా ఈ రేసుకు ప్రమోటర్ గా బాధ్యతలు తీసుకునే ముందు.. అలాగే చెల్లింపుల విషయంలో చట్ట ప్రకారం అన్ని అంశాల్ని అదే చూసుకోవాల్సి ఉంటుంది.

- రూ.10 కోట్లకు మించి చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని హెచ్ఎండీఏ నిబంధనల్లో ఎక్కడా లేదు. ఒకవేళ ఉన్నా.. దాన్ని సంబంధిత శాఖ చూసుకోవాలి. మంత్రిగా నాకు సంబంధం లేదు.

- హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి దర్యాప్తును అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా పేర్కొనటం సరికాదు. ఎఫ్ఐఆర్ లో ప్రాథమికంగా నేరారోపణ వెల్లడి కాలేదు. అందుకే క్వాష్ పిటిషన్ దాఖలు చేశా.

- ఆర్థికపరమైన ప్రభావాన్ని ఆలోచించకుండా ప్రభుత్వం ఫార్ములా ఈ రేసుకు స్పాన్సర్ పాత్రను స్వీకరించిందని చెప్పటం రికాదు. ప్రపంచ వ్యాప్తంగా పోటీలను 2023 జూన్ 20 నుంచి నిర్వహించటానికి షెడ్యూల్ ఖరారు చేశారు. దీంతో ఎఫ్ఈవోను ప్రభుత్వం సంప్రదించింది. 10వ సీజన్ పోటీలను నిర్వహించటానికి అంగీకరించింది. ఇందులో భాగంగా ప్రమోటర్ గా వ్యవహరించిన హెచ్ఎండీఏ ఫీజు మొత్తాన్ని మూడు వాయిదాల్లో చెల్లించటానికి అంగీకరించింది

- అప్పటి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్వి అర్వింద్ కుమార్ హెచ్ఎండీఏ కమిషనర్ హోదాలో పదో సీజన్ పోటీల నిర్వహణకు మొత్తం రూ.160 కోట్లు అవసరమని.. అందుకు అనుమతించాలని ఫైల్ పంపారు.

- పన్నుకు సంబంధించి పాత ఒప్పందంలోనే ఉంది. అందువల్ల అదనంగా భారం అనటం సరికాదు. 10వ సీజన్ తప్పిపోకుండా ఉండేందుకు వాయిదాల ప్రకారం చెల్లింపుల నిమిత్తమే ఒప్పందం కుదుర్చుకున్నట్లు. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోలేదన్న ఆరోపణలతో నాకు సంబంధం లేదు.

- నిబంధనలు అమల్లోకి వచ్చినప్పుడు మంత్రిగా విధులు నిర్వహించలేదు. అక్రమాలకు బాధ్యుడ్ని కాదు. సచివాలయం బిజినెస్ నిబంధనలు హెచ్ఎండీఏకు వర్తించవు. ఆర్వింద్ కుమార్ రాసిన లేఖ ప్రకారం అధికారులు ఫైలు సిద్ధం చేసి ఉత్తర్వుల కోసం సీఎంకు పంపా.

- ఒప్పందం ప్రకారం మిగిలిన 50 శాతం చెల్లించకపోవటంతో ప్రభుత్వ ఖజానకు రూ.55కోట్ల నష్టం.. ఇతర ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. వచ్చే మూడేళ్లకు రూ.600 కోట్లు అవసరమన్న వాదన సరికాదు. ఎలాంటి అంచనా లేకుండా ఖర్చును పెంచి చూపారు.

- రాజకీయ కక్షతోనే ఆరోపణలు చేశారు. విదేశీ నిధులు తరలించటానికి అవసరమైన అనుమతులను బ్యాంకే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన విధానాలను సంబంధిత అధికారులు చూసుకోవాల్సి ఉంది. నేను చూడాలని ఊహించలేదు.