వక్ఫ్‌ను అడ్డు పెట్టి వైసీపీ నాటకం.. టీడీపీ రియాక్షన్ ఇదే..!
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు-2024 పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 6 April 2025 4:44 PMఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు-2024 పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అటు లోక్‌సభలోనూ.. ఇటు రాజ్యసభలోనూ ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అంతేకాదు.. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా.. ఈ బిల్లు కు ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇది చట్టంగా మారిపోయింది. త్వరలోనే దీనిని అమలు చేసేందుకు కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వడమే తరువాయి అన్నట్టుగా పరిస్థితి మారింది.
అయితే.. కేంద్రం తెచ్చిన వక్ఫ్ బిల్లు వ్యవహారం.. కొన్ని రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది. మరీ ముఖ్యంగా ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య ఈ దుమారం మరీ ఎక్కువగా రేగింది. వైసీపీ లోక్‌సభలో ఈ బిల్లును వ్యతిరేకించిందని.. కానీ, రాజ్యసభలో మాత్రం లోపాయికారీగా మద్దతు తెలిపిందని.. టీడీపీ ఆరోపిస్తోంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా.. మైనారిటీల గొంతు కోశారంటూ.. కామెంట్లు కూడా చేసింది. అయితే.. వైసీపీ మాత్రం తమ ప్రమేయం లేదని.. పరిమళ్ నత్వానీ(రాజ్యసభ ఎంపీ) మాత్రమే ఎగువ సభలో ఆమోదం తెలిపారని చెప్పుకొచ్చారు.
అయినప్పటికీ.. వైసీపీ పై టీడీపీ విమర్శలు ఆపలేదు. దీనిని అడ్డు పెట్టుకున్న వైసీపీ.. ఇప్పుడు మరో వ్యూహానికి తెరదీసింది. టీడీపీకి చెందిన ఓ నేత రాజీనామా చేయడాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మైనారిటీ నేత... వాజిద్ ఖాన్, తాజాగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనిలో ఆయన ప్రాథమిక సభ్యత్వానికి సంబంధించిన నెంబరు ను కూడా ఉటంకించారు. టీడీపీ వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా వ్యవహరించినందుకే తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
కానీ, దీనివెనుక వైసీపీ చాలా తతంగం నడిపించిందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అసలు వాజిద్ ఖాన్ తమ వాడు కాదని.. ఉన్నా.. అసలు ఆయన ఎప్పుడూ.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని.. ఇదే పశ్చి మ నియోజకవర్గానికి చెందిన మైనారిటీ టీడీపీ నాయకుడు నాగుల్ మీరా ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. వాజిద్‌ను డబ్బులతో వైసీపీ లోబరుచుకుందని.. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారని అన్నారు. పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం లేనివారు.. వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. దీనిని టీడీపీ కూడా.. కొట్టిపారేసింది. కీలకమైన మైనారిటీ నాయకులు తమతోనే ఉన్నారని చెబుతుండడం గమనార్హం.