ఇజ్రాయెల్ పై దట్టమైన యుద్ధ మేఘం.. రంగంలోకి అమెరికా.. భారత్ అలర్ట్!
By: Tupaki Desk | 3 Aug 2024 7:30 AM GMTఓవైపు గాజాలోని హమాస్ తో 8 నెలలుగా యుద్ధం.. మరోవైపు లెబనాన్ లోని హెజ్బొల్లాలపై తీవ్ర దాడులు.. ఇంకోవైపు బద్ధ శత్రువు ఇరాన్ లో ఏకంగా హమాస్ చీఫ్ హత్య.. ప్రతీకార దాడులకు ఇరాన్ ఆదేశం.. మొత్తానికి ఇజ్రాయెల్ యుద్ధం ఏదో మలుపు తిరగనుంది. ఈ పరిణామాలు ఎక్కడికో వెళ్లనున్నాయి. మూడు రోజుల కిందట హమాస్ చీఫ్ హనియా హత్యతో ఇరాన్, దాని మిత్రదేశాలు ఇజ్రాయెల్ మీద మండిపడుతున్నాయి. ఇవన్నీ కలిసి ఏ క్షణమైనా దాడి చేసే ముప్పు పొంచి ఉంది. కానీ.. ఇజ్రాయెల్ ఏమైనా తక్కువ తిన్నదా..? వారి డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) హై అలర్ట్ అయింది. ఈ ఉదంతంలో కీలక మలుపు ఏమంటే.. అమెరికా రంగంలోకి దిగడం. వారికి మిడిల్ ఈస్ట్ (మనకు పశ్చిమాసియా) అయిన ఇజ్రాయెల్ కు యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లను పంపిస్తోంది.
తాడోపేడో..
వాస్తవానికి రెండు నెలల కిందట లెబనాన్ లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హత్యతోనే ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ వాటిని అడ్డుకుంది. కాగా.. అంతా సద్దుమణిగింది అనుకుంటుండగా ఇరాన్ లోనే హమాస్ చీఫ్ ను లేపేసింది ఇజ్రాయెల్. లెబనాన్ లో హెజ్‌బొల్లా సీనియర్ మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్ర్ నూ హతమార్చింది. హమాస్ సైనిక విభాగాధిపతి మహమ్మద్ డెయిఫ్ నూ చంపేసింది. ఓవైపు హెజ్బొల్లాపై దాడులు చేస్తూనే ఆ పని చేసింది. అంతే.. ఉద్రికత్తలు మరింత పెచ్చుమీరాయి. ఇజ్రాయెల్ భూభాగం దిశగా లెబనాన్ రాకెట్లను ప్రయోగించింది. దీంతో సిబ్బందితో పాటు ఇజ్రాయెల్ రక్షణ కోసం అమెరికా అదనపు యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లను పంపింది. బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం కలిగిన అదనపు క్రూజర్లు, డిస్ట్రాయర్లను కూడా అందజేసేందుకు సన్నాహాలు సాగిస్తోంది.
నలువైపులా చుట్టుముట్టేందుకు..
హనియా హత్యతో రగిలిపోతున్న ఇరాన్.. మిత్ర దేశాలతో కలిసి నలువైపుల నుంచి ఇజ్రాయెల్‌పై విరుచుకుపడాలని ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు భరోసా ఇచ్చారు. దాడులు జరిగితే తాము అండగా ఉంటామని చెప్పారు. కాగా, పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఎయిరిండియా సహా పలు విమానయాన సంస్థలు సర్వీసులను రద్దు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ లోని భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ రాయబార కార్యాలయం సూచించింది. దీనికిముందే ప్రయాణాలకు సంబంధించి లెబనాన్ లోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీచేయడం గమనార్హం.
తెలుగులోనూ అడ్వైజరీ..
కాగా, అనవసర ప్రయాణాలు చేయుద్దని.. సురక్షిత ప్రదేశాలకు దగ్గర్లో ఉండాలంటూ ఇజ్రాయెల్ లోని భారత రాయబార కార్యాలయం ఇంగ్లిష్, హిందీ, కన్నడంతో పాటు తెలుగులోనూ అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన నంబర్లను పోస్టు చేసింది.