ఎంతమంది ధనవంతులున్నా... ఈ సిసలైన ‘శ్రీమంతుడి’ లెక్క వేరు!
అవును... ప్రపంచంలో చాలా మంది ధనవంతులు, కుబేరులు ఉంటారు కానీ.. వారిలో కొంతమంది మాత్రమే మనసున్న "శ్రీమంతులు" ఉంటారని అంటారు.
By: Tupaki Desk | 27 Nov 2024 6:45 PM GMTచనిపోయే వరకూ సంపాదించాలి.. తరతరాలు కూర్చుని తినేవరకూ సంపాదించాలి.. అక్రమంగా అయినా సరే ఏదో విధంగా సంపాదించాలి.. అయితే, పిల్లికి కూడా బిక్షం పెట్టకూడదు, ఎంగిలి చెత్తో కాకిని తోలకూడదు అని చాలా మంది భావిస్తుంటారని అంటుంటారు. ఇదే సమయంలో దీనికి పూర్తి భిన్నంగా ఆలోచించేవారూ ఉంటారని చెబుతుంటారు.
సంపాదించాలి.. కష్టపడి సంపాదించాలి.. ఉన్నంతలో న్యాయంగా సంపాదించాలి.. మన చేతిలో ఉన్న నోటు వెనుక మరొకడి ఆకలి బాధ, కన్నీటి వ్యధ ఉండకుండా సంపాదించాలి.. సంపాదించిన దానిలో వీలైనంత ప్రజలకు పంచాలి.. ఈ ప్రపంచంలో మంచి జరగడానికి తమ వంతు సాయంగా పంచాలి అని మరికొంతమంది ఆలోచిస్తారని అంటుంటారు.
ఇందులో రెండో కోవకు చెందిన వారిలో చాలా మంది కుబేరులు ఉన్న సంగతి తెలిసిందే. వారందరిలోనూ కలియుగ దానకర్ణుడిగా చెప్పే వారెన్ బఫెట్ స్థానం చాలా ప్రత్యెకమని చెబుతుంటారు. దానికి కారణం.. దాతృత్వ కార్యక్రమాల కోసం ఆయన వెచ్చించే మొత్తంతో పాటు తన మరణానంతరం చేయాల్సిన కార్యక్రమాలపైనా అయనా కీలక నిర్ణయాలు తీసుకోవడంగా చెబుతారు.
అవును... ప్రపంచంలో చాలా మంది ధనవంతులు, కుబేరులు ఉంటారు కానీ.. వారిలో కొంతమంది మాత్రమే మనసున్న "శ్రీమంతులు" ఉంటారని అంటారు. ఈ విషయంలో ఎప్పుడూ ముందుండే వారెన్ బఫెట్ దాతృత్వ కార్యక్రమాల కోసం తాజాగా 1.10 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 9,300 కోట్ల రూపాయలు) విరాళంగా అందించారు.
బెర్క్ షైర్ హాథ్ ఎవే వాటాలను నాలుగు కుటుంబ ఫౌండేషన్లకు విరాళంగా అందించిన వారెన్ బఫెట్... థాంక్స్ గివింగ్ సంప్రదాయంలో భాగంగా ఈ మొత్తాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో... తన మరణానంతరం 147.4 బిలియన్ డాలర్ల సంపదను ఎలా పంపిణీ చేయాలో కూడా ఆయన వెల్లడించారు.
ఇందులో భాగంగా... తన మరణానంతరం 147.4 బిలియన్ డాలర్ల సంపదను తన ముగ్గురు సంతానం పదేళ్ల వ్యవధిలో వారసత్వంగా అందుకుంటారని తెలిపారు! ఒకవేళ ఆ మొత్తాన్ని అందుకునేలోపు తన సంతానంలో ఎవరైనా మరణిస్తే.. తదుపరి సంపద ఎవరికి చేరాలో నిర్ణయించారు. అదేమిటో తన సంతానానికి తెలుసని పేర్కొన్నారు.
ఈ మేరకు వాటాదార్లకు రాసిన లేఖలో వారెన్ బఫెట్ కీలక విషయాలు వెల్లడించారు. రాజరికం తరహా సంపద సృష్టి తన ధ్యేయం కాదని అన్నారు. ఈ సందర్భంగా... సంపన్నులైన తల్లితండ్రులు తమ పిల్లలకు సరిపడా సంపదను వారసత్వంగా ఇవ్వాలి.. అయితే, పిల్లలు ఏమీ చేయకుండా కూర్చుని తినేలా మాత్రం ఇవ్వకూడదని వివరించారు.