ఏఐను అణుబాంబుతో పోల్చిన వారెన్ బఫెట్!
వారెన్ బఫెట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
By: Tupaki Desk | 8 May 2024 4:20 AM GMTవారెన్ బఫెట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచ బిలియనీర్లలో ఒకరైన ఆయన.. తాజాగా తన సత్తా చాటుతున్న ఏఐ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో డీప్ ఫేక్ వీడియోలపై ఇప్పటికే రచ్చ మొదలైంది. ఏఐ సాయంతో దుర్మార్గాలు చేస్తున్న వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. రానున్న రోజుల్లో ఇది మరింత తీవ్ర రూపం దాల్చనుంది. ఏఐ సాంకేతికత అద్భుతమని కొందరు ఆకాశానికి ఎత్తేస్తుంటే.. మరికొందరు ప్రముఖులు మాత్రం దీనికి పగ్గాలు వేయకుంటే మొదటికే మోసం ఖాయమన్న మాటను బలంగా చెబుతున్నారు. ఏఐను అవసరాలకు కాకుండా.. సొంత లాభాల కోసం దుర్వినియోగం చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.
యావత్ టెక్నాలజీలను ప్రభావితం చేసే ఏఐ పని తీరు మీద ఇప్పటికే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం ఆందోళన వ్యక్తం చేయటం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో చేరారు వారెన్ బఫెట్. ఏఐను అణుబాంబుతో పోల్చిన ఆయన.. ఇటీవల తనకు ఎదురైన స్వీయ అనుభవాన్ని వెల్లడించారు. ఏఐ టెక్నాలజీ మీద తనకు తక్కువ అవగాహన ఉన్నప్పటికీ దాని ప్రభావం గురించి భయపడుతున్నట్లుగా పేర్కొన్నారు.
‘‘ఇటీవల ఓ వీడియోను చూశా. అంతలోనే తీవ్రమైన ఆశ్చర్యానికి గురయ్యా. నా ఫోటో.. నా వాయిస్ తో దాన్ని రూపొందించారు. నేనే కాదు నా భార్య.. కుమార్తెలు కూడా ఇందులో ఎలాంటి తేడాను గుర్తించలేకపోయారు. ఈ వీడియోను చూసి ఆందోళన చెందా’’ అంటూ తన షాకింగ్ అనుభవం గురించి వెల్లడించారు. ఏఐకు అపారమైన సామర్థ్యం ఉందన్న బఫెట్.. దాని కారణంగా మరింత హాని కలిగించే ప్రమాదం ఉందన్నారు.
‘‘అణ్వాయుధాలు తయారు చేసే సమయంలో ఒక జీనీని సీసాలో నుంచి బయటకు పంపుతాం. అది కొన్ని భయంకరమైన పనుల్ని చేస్తోంది. ఆ జీనీ శక్తి నన్ను భయపెడుతోంది. దాన్ని తిరిగి బాటిల్ లో తీసుకొచ్చేందుకు నాకే మార్గం తెలీదు’’ అంటూ నెబ్రాస్కాలో ఏర్పాటు చేసిన వార్షిక వాటాదారుల సమావేశంలో ఆయన ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఆందోళన చెందుతున్న ఈ టెక్నాలజీతో రానున్న రోజుల్లో మరిన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పక తప్పదు.