Begin typing your search above and press return to search.

అన్ని మూలల్లో ఘర్షణలు.. ఈ ప్రపంచానికి ఏదో అవుతోంది

ఒకప్పటి సోవియట్ రష్యాలోని భాగమైన ఉక్రెయిన్ పై 2022 ఫిబ్రవరి 24న విరుచుకుపడింది పుతిన్ సారథ్యంలోని రష్యా... దీనికి ప్రధాన కారణం ఉక్రెయిన్ పశ్చిమ దేశాలకు దగ్గర కావడమే.

By:  Tupaki Desk   |   19 Jan 2024 2:30 PM GMT
అన్ని మూలల్లో ఘర్షణలు.. ఈ ప్రపంచానికి ఏదో అవుతోంది
X

ఈ ప్రపంచాన్ని అన్ని సమస్యలు ఒకేసారి చుట్టుముట్టాయా..? ఏ మూలన చూసినా ఘర్షణలు.. ఉద్రిక్తతలు.. యుద్ధాలు.. ఒకప్పటి ఉమ్మడి దేశాల మధ్య.. ఒకే మతానికి చెందిన దేశాల నడుమ సైతం యుద్ధ మేఘాలు.. ఏ విపత్తు ఎప్పుడు ముంచుకొస్తుందో చెప్పలేనంత పరిస్థితి.. మూడో ప్రపంచ యుద్ధమూ వస్తుందనే భయాందోళనలు.. ఇంతకూ ఏం జరుగుతోంది..?

గాజాతో పుండులా మారిన పశ్చిమాసియా

పాలస్తీనా కేంద్రంగా 75 ఏళ్లుగా పశ్చిమాసియా ఒక ఉద్రిక్త ప్రాంతం.. ఇజ్రాయెల్ ఒకవైపు.. మిగతా అరబ్ దేశాలు ఒకవైపు.. ఇప్పటికే మూడు-నాలుగుసార్లు భీకర యుద్ధాల్లో తలపడ్డాయి. అంతకుమించి అనేకసార్లు ఘర్షణలకు దిగాయి. పాలస్తీనా అంశం ఇప్పటికీ ఒక కొలిక్కిరాలేదు. చర్చలు ఫలించినట్లే కనిపించి.. సంధి కుదిరినట్లే అనిపించి.. ఒక్కసారిగా దాడులతో ప్రశాంతత చెదిరిపోతోంది. ఇలాంటిచోట అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై సాగించిన దమనకాండ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆ వెంటనే ఇజ్రాయెల్ తన సహజ పద్ధతిలో గాజాపై వేట మొదలుపెట్టింది. ఇప్పటికే రెండున్నర నెలలయింది. దాడులు కాస్త యుద్ధంగా మారాయి. ఎంతకూ పరిష్కారం దొరకడం లేదు. చివరకు యుద్ధం దీర్ఘకాలంగా సాగేలా కనిపిస్తోంది.

రెండేళ్లయినా ఆరని మంట..

ఒకప్పటి సోవియట్ రష్యాలోని భాగమైన ఉక్రెయిన్ పై 2022 ఫిబ్రవరి 24న విరుచుకుపడింది పుతిన్ సారథ్యంలోని రష్యా... దీనికి ప్రధాన కారణం ఉక్రెయిన్ పశ్చిమ దేశాలకు దగ్గర కావడమే. వారి సైనిక కూటమిలో చేరాలనుకోవడమే. ఈ యుద్ధం ప్రారంభంలోనే సంధి ప్రయత్నాలు జరిగినా అవి విఫలమయ్యాయి. ఆ వెంటనే అణ దాడుల హెచ్చరికలూ చేసింది రష్యా. కానీ.. ఉక్రెయిన్ పట్టువీడడం లేదు. ఇలా రెండేళ్లుగా సమరం సాగుతూనే ఉంది. ఇది మరింత ముదిరితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందనే ఆందోళనను జర్మనీ వంటి దేశాలు వ్యక్తం చేస్తున్నాయి.

కొరకరాని కొరియా..

కొరియా ద్వీపకల్పంలో.. ఉత్తర కొరియా ఒక కొరకరాని పదార్థం. దక్షిణకొరియా పారిశ్రామికంగా దూసుకెళ్తుంటే.. ఉత్తరకొరియా మాత్రం కయ్యానికి కాలుదువ్వుతూ ఉంటుంది. ఈ దేశాన్ని ఏలుతున్న నియంత కిమ్.. యుద్ధోన్మాదంతో రగులుతూ ఉంటాడు. తాజాగా సముద్ర గర్భ డ్రోన్‌తో అణ్వాయుధ వ్యవస్థను పరీక్షించాడు. సముద్రగర్భ డ్రోన్‌ అణుదాడి సామర్థ్యాన్ని తెలుసుకొనేందుకు వీటిని చేపట్టారు. దక్షిణ కొరియా, అమెరికా, జపాన్‌ సంయుక్త నౌకాదళ విన్యాసాలకు ఇది ప్రతిచర్య. దీంతో కొరియా ద్వీపకల్పంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే పలుసార్లు అణుదాడి హెచ్చరికలు చేసిన ఘనుడు కిమ్. తరచూ అమెరికాను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు దిగుతుంటాడు. ఉత్తర కొరియా ‘హెయిల్‌-5-23’ పేరుతో నిరుడు మార్చి నుంచి అణ్వాయుధ సామర్థ్యం కలిగిన సముద్రగర్భ డ్రోన్‌లను పరీక్షిస్తోంది. ప్రత్యర్థుల నౌకలు, ఓడ రేవులే వీటి లక్ష్యం. వీటిని సముద్ర తీరం నుంచైనా ప్రయోగించవచ్చు. అయితే, అణు క్షిపణుల కంటే తక్కువ సామర్థ్యం కలిగినవేనని నిపుణులు పేర్కొంటున్నారు.

ఉరుములేని పిడుగులా ఇరాన్-పాక్

రెండు ముస్లిం దేశాలైన ఇరాన్-పాక్ మధ్య తాజాగా ఉద్రిక్తత నెలకొంది. 900 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దును పంచుకునే ఈ దేశాలు.. బెలూచిస్థాన్ ఉగ్రవాదుల అంశంపై పరస్పర దాడులు చేసుకున్నాయి. తీవ్ర స్థాయి హెచ్చరికలకూ దిగాయి. ఈ ఘర్షణ యుద్ధం స్థాయికి చేరకున్నా.. మున్ముందు ప్రమాదాలకు సంకేతమే. అందులోనూ ఇరాన్ అంటే అమెరికాకు మంట. పాకిస్థాన్ అంటే ప్రేమ. ఇరాన్ మద్దతుతోనో హౌతీలు ఎర్ర సముద్రంలో అమెరికా వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు. వారిని అణచివేసేందుకు అగ్ర రాజ్యం రంగంలోకి దిగింది. కాగా.. భారత్ తో సరిహద్దులో ఇటీవల కొన్ని ప్రాంతాలను మయన్మార్ సైనిక పాలకుల వ్యతిరేక దళాలు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు చైనా-తైవాన్ వివాదం ఎన్నాళ్లుగానో రగులుతోంది. వన్ చైనా అంటూ డ్రాగన్ దూకుడుగా వెళ్తోంది. అటు తైవాన్ లో చైనా వ్యతిరేక నాయకత్వం తాజాగా అధికారంలోకి వచ్చింది. తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలకు పాల్పడ్డా సహించబోమని ఇప్పటికే చైనా ఎన్నోసార్లు స్పష్టం చేసింది. కాగా.. ఏడాదిన్నర కిందట తైవాన్ లో అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన తీవ్ర ఉద్రికత్తకు దారితీసిన సంగతి.. ఆ తర్వాత తైవాన్ చుట్టూ ఉన్న జలాల్లో చైనా చేపట్టిన విన్యాసాలు సంచలనం రేపాయి. ఇలా.. ప్రపంచంలో ఎటుచూసినా ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తోంది. ఇవి మరింత ముదిరి యుద్ధాలకు దారితీయొద్దని అందరమూ కోరుకుందాం.