ప్రధానితో ఫోటో దిగిన దొంగ... ఫెర్మార్మెన్స్ తెలిస్తే షాకవుతారు!
అదే... ప్రధాన మంత్రితో మిలటరీ యూనిఫాంలో ఫోటో కూడా దిగాడు. ఫలితంగా తన ఐడెంటిటీపై ఎవరికీ సందేహం రాకుండా జాగ్రత్తపడ్డాడు.
By: Tupaki Desk | 2 Jan 2024 4:09 PM GMTసాధారణంగా దొంగలు అంటే... డబ్బులు, బంగారం, వాహనాలు దొంగిలించినట్లు వార్తలొస్తుంటాయి. ఇంకా కాస్త ప్రొఫెషనల్స్ అయితే... బ్యాంకుల లూటీలకు సైతం పాల్పడుతుంటారని, గోల్డ్ షాపుల గోడలు బద్దలు కొడతారని చెబుతారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దొంగ మామూలోడు కాదు. ఈ దొంగ చేసిన పనులు తెలిస్తే షాకవుతారు. కారణం... ఈ దొంగ సైన్యంలో చేరాడు!
అవును... సైన్యంలో చేరిన ఒక దొంగ తాజాగా పట్టుబడ్డాడు. సైన్యంలో చేరి అక్కడున్న తుపాకులూ, మందుగుండు సామాగ్రిని ఇతడు దొంగిలించడం మొదలుపెట్టాడు. ఇదే సమయంలో ఎవ్వరూ ఊహించని పనికి కూడా పూనుకున్నాడు. అదే... ప్రధాన మంత్రితో మిలటరీ యూనిఫాంలో ఫోటో కూడా దిగాడు. ఫలితంగా తన ఐడెంటిటీపై ఎవరికీ సందేహం రాకుండా జాగ్రత్తపడ్డాడు.
వివరాళ్లోకివెళ్తే... 35 ఏళ్ల రాయ్ యాఫ్రాఖ్ అనే వ్యక్తి ఇజ్రాయెల్ సైన్యం నుంచి ఆయుధాలు ఎత్తుకెళ్తూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కు అడ్డంగా దొరికేశాడు. దీంతో అతడి గురించి ఆరాతీయగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ లోనే పనిచేస్తున్నట్లు ఫేక్ ఐడీ కార్డ్ సృష్టించుకున్న రాయ్ యాఫ్రాఖ్.. సైన్యంలో పనిచేస్తూనే తుపాకులు, మందుగుండు సామగ్రిని దొంగిలించి బ్లాక్ మార్కెట్ లో విక్రయించాలని పకడ్బందీ ప్లాన్ వేశాడు.
అనుకున్నట్ళుగానే అక్టోబరు 7వ తేదీన ఇజ్రాయెల్ పై హమాస్ దాడితో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఆయుధాగారం అయిన బెల్ ఆఫ్ ఆర్మ్స్ లోకి వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణమంత్రి యోవ్ గలాంట్ సైన్యాన్ని కలిసేందుకు వెళ్లగా.. వారి దగ్గరకు వెళ్లి ఫొటోలు కూడా తీసుకున్నాడు. దీంతో అతడిలో ఆత్మస్థైర్యం మరింత పెరిగినట్లుంది!
దీంతో సైన్యంలో ఏకంగా ఒక ఉన్నతాధికారి హోదాతో ఫేక్ ఐడీ కార్డును తయారు చేసుకున్నాడు. సైన్యంలో కీలకంగా వ్యవహరించాడు. గాజాలో చేపట్టిన ఆపరేషన్ లలోనూ పాల్గొన్నాడు. సైన్యంతో కలిసి గాజాలోని హమాస్ మిలిటెంట్ల స్థావరాలుగా చెప్పే సొరంగాల్లోనూ తిరిగాడు. ఇదే క్రమంలో... గాయాలైన ఇజ్రాయెల్ సైనికులకు ప్రథమ చికిత్సలు కూడా చేశాడు.
ఈ సమయంలో అవకాశం దొరికినప్పుడల్లా రైఫిళ్లు, పిస్టళ్లు, తూటాలు, మందు గుండు సామగ్రి మొదలైనవి ఎత్తుకెళ్లేవాడు. వీటితోపాటు హమాస్ ఉగ్రవాదులను చంపిన అనంతరం వారి వద్ద ఉండే తుపాకులు, తూటాలను ఎత్తుకొచ్చేవాడు. ఈ సమయంలో ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన ఆయుధాలు కూడా మాయమవడంతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మరింత శ్రద్ధ పెట్టింది. ఈ క్రమంలోనే ఆదివారం ఐడీఎఫ్ కు రాయ్ యాఫ్రాఖ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.
దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన అధికారులు... ఆతని ఇంట్లో భారీగా తుపాకులు, ఐఈడీలు, గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో అతడిపై చీటింగ్, దొంగతనం సహా ఐదు అభియోగాలు మోపినట్లు వెల్లడించారు. ఇవన్నీ రుజువైతే ఇతడికి గరిష్టంగా 36 ఏళ్ల జైలు శిక్షపడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. మరోపక్క ఇతగాడి నైపుణ్యం తెలుసుకున్నవారు మాత్రం ముక్కున వేలేసుకుంటూ.. అమ్మదొంగా అని అంటున్నారు!