Begin typing your search above and press return to search.

సర్వే చేస్తున్న అతడ్ని ఎమ్మెల్యే సైదిరెడ్డి కిడ్నాప్ చేశారా?

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి తనను తీవ్రంగా బెదిరింపులకుగురి చేశారని పేర్కొంటూ రామస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

By:  Tupaki Desk   |   23 Nov 2023 5:43 AM GMT
సర్వే చేస్తున్న అతడ్ని ఎమ్మెల్యే సైదిరెడ్డి కిడ్నాప్ చేశారా?
X

ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ సీట్ గా చెప్పుకునే నియోజకవర్గాల్లో హుజూర్ నగర్ ఒకటి. అందులో టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయనపై గులాబీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బరిలోకి దిగారు. ఇదిలా ఉంటే.. తాను సర్వే చేస్తుంటే సైదిరెడ్డి మనుషులు తనను కిడ్నాప్ చేశారని.. తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారంటూ చాణక్య పీవోటీ టీం లీడర్ రామస్వామి.. టెక్నికల్ హెడ్‌ సృజన చేసిన ఆరోపణలు కలకలాన్ని రేపాయి. అంతేకాదు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి తనను తీవ్రంగా బెదిరింపులకుగురి చేశారని పేర్కొంటూ రామస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇంతకూ ఆయనేం చెప్పారు? ఇంతకూ అసలు కిడ్నాప్ (?) వరకు విషయం ఎందుకు వెళ్లింది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.

నెల రోజుల క్రితం ఎమ్మెల్యే సైదిరెడ్డి తన పొలిటికల్ కన్సల్టెన్సీ ఏజెన్సీ ద్వారా నియోజకవర్గంలో సర్వే చేయించాలని తనను కోరినట్లుగా రామస్వామి చెబుతున్నారు. ఇందులో భాగంగా తాము 40 మందితో 30 రోజులు సర్వే చేశామని.. అయితే ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వలేదన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి తాము తమ ఏజెన్సీ గురించి చెప్పి.. రెండు రోజులుగా సర్వే చేస్తున్నట్లుగా చెప్పారు. దీంతో ఓర్వలేని సైదిరెడ్డి తనను కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగినట్లుగా ఆరోపించారు.

మంగళవారం రాత్రి సైదిరెడ్డి అతని అనుచరులు షఫీతో పాటు మరో నలుగురు వ్యక్తులు తమను కిడ్నాప్ చేశారన్నారు. అనంతరం తమను కోదాడ రోడ్డులోని ఒక విల్లా వద్దకు తీసుకెళ్లి.. ఉత్తమ్ కుమార్ రెడ్డికి అనుకూలంగా సర్వే చేస్తే చంపేస్తామని.. ఫ్యామిలీని లేపేస్తామని వార్నింగ్ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. అనంతరం తమను విడిచి పెట్టారన్న రామస్వామి.. దీంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

రామస్వామితో పాటు ఈ కన్సల్టెన్సీకి చెందిన టీం టెక్నికల్ హెడ్ సృజన సైతం ఎమ్మెల్యే సైదిరెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఆడపిల్లనైన తనను అర్థరాత్రి తన ఆఫీసుకు రావాలని బెదిరింపులకు దిగినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం తన గన్ మెన్ చేత బెదిరింపులకు దిగారన్నారు. దీనిపై తాను ఎన్నికల అధికారికి కంప్లైంట్ చేసినట్లు చెప్పారు. కీలక ఎన్నికల వేళ.. ఎమ్మెల్యే సైదిరెడ్డి పై పడిన కిడ్నాప్ మరక కలకలంగా మారింది.

ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ.. ఇదంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆడించిన నాటకంగా పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచే అవకాశం లేని ఉత్తమ్ ఇలాంటి కట్టుకథను అల్లారన్నారు. తనకు సంబంధించిన సమాచారాన్ని ఉత్తమ్ కు రామస్వామి ఇస్తున్నారని.. అందుకే అతనిపై చీటింగ్ కేసు పెట్టారన్నారు. మరోవైపు ఈ మొత్తం ఎపిసోడ్ పై ఉత్తమ్ రియాక్టు అయ్యారు. నియోజకవర్గంలో ప్రజలను భయభ్రాంత్రుల్ని చేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యే సైదిరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆటలో అరటిపండులా మారిన ఈ కిడ్నాప్ ఉదంతం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.