Begin typing your search above and press return to search.

కార్చిచ్చు టెన్షన్: మొన్న లహైనా... నిన్న మౌయి... నేడు వాషింగ్టన్‌?

గతవారం కార్చిచ్చు సృష్టించిన విలయానికి వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో ఇప్పుడు ఈ కార్చుచ్చు వాషింగ్టన్‌ వైపు కదులుతోంది!

By:  Tupaki Desk   |   19 Aug 2023 11:10 AM GMT
కార్చిచ్చు టెన్షన్: మొన్న  లహైనా... నిన్న  మౌయి... నేడు  వాషింగ్టన్‌?
X

హవాయి దీవుల సమూహంలోని మౌయి ద్వీపాన్ని కార్చిచ్చు దహించి వేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే... లహైనా రిసార్టు నగరంలో కార్చిచ్చు బూడిదను మిగిల్చింది. గతవారం కార్చిచ్చు సృష్టించిన విలయానికి వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో ఇప్పుడు ఈ కార్చుచ్చు వాషింగ్టన్‌ వైపు కదులుతోంది!

అవును... ఉత్తర అమెరికా దేశాలను వణికిస్తోన్న కార్చిచ్చు... బలమైన గాలుల కారణంగా వేగంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు అమెరికాలోని వాషింగ్టన్‌ రాష్ట్రం వైపు దూసుకొస్తోంది. దీంతో వెంటనే ఖాళీ చేయాలని పలు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

ఈ కార్చిచ్చు దూసుకొస్తుండటంతో మెడికల్‌ లేక్‌ లోని ఓ ఆసుపత్రిలో వైద్యులు, రోగులను తరలించేందుకు ప్రభుత్వం నేషనల్ గార్డ్ ట్రూప్స్‌ ను రంగంలోకి దింపింది. ఇదే సమయంలో ఫోర్‌ లేక్స్ పట్టణానికి కూడా "లెవెల్‌ త్రీ" ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే స్పోకాన్‌ కౌంటీలోని 13 వేలమంది ప్రజలున్న చెనెయ్‌ నగరానికి "లెవెల్‌ టు" అలర్ట్ ఇచ్చారు.

వాషింగ్టన్‌ లోని స్పోకాన్‌ కౌంటీ సమీపంలో మొదలైన ఈ కార్చిచ్చు.. కొన్ని గంటల వ్యవధిలోనే సుమారు 3 వేల ఎకరాలకు విస్తరించిందని తెలుస్తోంది. బలమైన గాలులే అందుకు కారణమయ్యాయని వాషింగ్టన్‌ స్టేట్ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్‌ వెల్లడించింది. దీనివల్ల ఇప్పటికే కొన్ని ఇళ్లు కాలిపోయి ఆస్తినష్టం కూడా సంభవించినట్లు తెలిపింది.

ఇదే సమయంలో కెనడా వైపు మరో కార్చిచ్చు వేగంగా దూసుకొస్తోంది. కెనడాలోని నార్త్ వెస్ట్ టెర్రిటరీస్ రాజధాని ఎల్లో నైఫ్ నగరం వైపు కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తూ వస్తోంది. దీంతో నార్త్‌ వెస్ట్ టెరిటరీస్‌ రాజధాని ఎల్లో నైఫ్‌ లోని 20 వేల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. దీంతో ఆ ప్రాంతం ఘోస్ట్ టౌన్‌ గా మారిపోయింది.

కాగా... ఇహలోకపు స్వర్గంలా పిలవబడే హవాయి ద్వీపంలోని మౌయి దీవి ఇప్పుడు కాలి బూడిదైపోయిన సంగతి తెలిసిందే. కార్చిచ్చు ఈ ప్రాంతంలో తీవ్రమైన విషాదాన్ని మిగిల్చింది. ఈ దీవిలో చెలరేగిన కార్చిచ్చు వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 100కు పైగా చేరిందని అంటున్నారు.

ఈ మంటల ధాటికి వెయ్యి డిగ్రీల ఫారెన్‌ హీట్ (538 డిగ్రీల సెల్సియస్) ను దాటి వేడి జ్వలించింది. ఈ మంటల ధాటికి ఏకంగా లోహాలు కూడా కరిగిపోవడం గమనార్హం. ఈ దారుణంలో సుమారు రెండు వేల మంది మరణించగా... 200లకు పైగా నిర్మాణాలు కాలి బూడిదయ్యాయి. వందలాది వాహనాలు నామరూపాల్లేకుండా పోయాయి!

కాగా... లెవెల్‌ 3 అలర్ట్ అంటే వెంటనే ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అర్ధం కాగా.. లెవెల్‌ 2 అలర్ట్ అంటే సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని అర్ధం!