ఏపీకి చుక్క నీరు ఇవ్వొద్దు: ముదురుతున్నజల జగడం!
ఏపీ-తెలంగాణల మధ్య జలాల వివాదం భారీ మలుపు తీసుకుంది. వేసవి వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది.
By: Tupaki Desk | 22 Feb 2025 3:45 AM GMTఏపీ-తెలంగాణల మధ్య జలాల వివాదం భారీ మలుపు తీసుకుంది. వేసవి వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఏపీకి చుక్కనీరు కూడా ఇవ్వరాదని పేర్కొంటూ.. కృష్ణారివర్ బోర్డు యాజమాన్యానికి(కేఆర్ ఎంబీ) తాజాగా తెలంగాణ అధికారులు రాహుల్ బొజ్జా, అనిల్ కుమార్, అజయ్ కుమార్‌లు లేఖ సమర్పించారు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌ల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .. తనకు కేటాయించిన నీటిని ఇప్పటికే వాడుకుందని.. ఇక నుంచి ఆ రాష్ట్రానికి చుక్కనీటిని కూడా విడుదల చేయడానికి వీల్లేదని ఒకింత కఠినమైన పదాలతోనే ఈ లేఖను రాయడం గమనార్హం.
ఏపీ వాదన ఇదీ..
కాగా.. తెలంగాణ వాదనను ఏపీ వ్యతిరేకిస్తోంది. పాత లెక్కలు తీస్తూ.. తాము ముందుగానేవాడుకున్నామని చెప్పడం ఏంటని.. ఏపీ జలవనరుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు కూడా.. తెలంగాణ చేస్తున్న వాదనను నిశి తంగా పరిశీలిస్తున్నారు. చర్చల ద్వారా పరిష్కరించుకునే విషయాలనురోడ్డున పడేయడం సరికాదని చంద్రబాబు చెబుతున్నా రు. ఇరురాష్ట్రాలకూ జలాలు ముఖ్యమేనని.. ఈ విషయంలో ఏపీ సహకరిస్తుందని కూడా చంద్రబాబు చెబుతున్నారు. కేంద్రానికి ఫిర్యాదులు చేసినంత మాత్రాన ..ఏమీ జరిగిపోదన్నది అందరూ తెలుసుకోవాలని కూడా చంద్రబాబు తెలిపారు.
మరోవైపు.. శుక్రవారం కేఆర్ ఎంబీ సమావేశం జరగాల్సి ఉంది. కానీ.. ఈ సమావేశానికి తాము హాజరు కాలేమని ఏపీ చెప్పడం తో అధికారులు దీనిని వాయిదా వేశారు. ఈ విషయాన్ని కూడా ప్రస్తావించిన తెలంగాణ ప్రభుత్వం దొడ్డిదారిలో నీటిని తరలించేం దుకే ఏపీ ప్రభుత్వం వాయిదాల పర్వాన్నితెరమీదకు తెచ్చిందన్న కొత్తవాదన వినిపించడం గమనార్హం. ఈ ఏడాది మే 31 వరకు 107 టీఎంసీల జలాలను తెలంగాణకు కేటాయించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. అయితే.. దీనిపై కేఆర్ ఎంబీ స్పష్టత ఇవ్వలేదు. ఏపీతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పడం గమనార్హం.
ఇదిలావుంటే.. సీఎం రేవంత్ రెడ్డి కూడా.. ఏపీకి చుక్కనీరు అదనంగా ఇచ్చేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేయడం.. నీటి విడుదల విషయంలో సంపూర్ణ అధికారాలను కలెక్టర్లకు కట్టబెట్టడంతో ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. వచ్చేది వేసవి కావడం.. ఖరీఫ్ పంటలకు రైతులు ఇప్పటికే సిద్ధం అయిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ జలాలకు సంబంధించిన సమస్యలు తెరమీదికి వస్తుండడం గమనార్హం.