Begin typing your search above and press return to search.

కర్ణాటక.. తమిళనాడు మధ్య మొదలైన జల జగడం!

వర్షాలు బాగా కురిసి.. నీటి సమస్య లేనంతవరకు ఓకే. ఏ మాత్రం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా.. కర్ణాటక.. తమిళనాడు మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంటుంది.

By:  Tupaki Desk   |   31 Aug 2023 7:20 AM GMT
కర్ణాటక.. తమిళనాడు మధ్య మొదలైన జల జగడం!
X

వర్షాలు బాగా కురిసి.. నీటి సమస్య లేనంతవరకు ఓకే. ఏ మాత్రం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా.. కర్ణాటక.. తమిళనాడు మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంటుంది. తాజాగా అలాంటి పరిస్థితే నెలకొంది. కావేరీ జలాలకు సంబంధించిన వివాదం రెండు రాష్ట్రాల (కర్ణాటక, తమిళనాడు) మధ్య ఉద్రిక్త పరిస్థితులకు కారణం కావటం తెలిసిందే. కావేరీ జలాల్ని కర్ణాటక రైతులు సాగు కోసం అత్యధికంగా వినియోగిస్తే.. తమిళ ప్రజలు తాగు నీటి కోసం వినియోగిస్తారు.

ఇటీవల కాలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల్లో కర్ణాటక రైతులకు సాగునీరు ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో తమకు రోజు 24 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని తమిళనాడు అభ్యర్థించగా.. అందుకు కావేరీ జలాల నియంత్రణ కమిటీ పాజిటివ్ గా రియాక్టు అయ్యింది. ఇందులో భాగంగా పదిహేను రోజుల పాటు రోజుకు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు.

నిజానికి తమిళనాడు అభ్యర్థనపై కర్ణాటక మొదట్లో అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. ఇరు రాష్ట్రాల అభ్యర్థనల నడుమ మధ్యే మార్గంగా తమిళనాడుకు తాగునీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే.. కర్ణాటక రైతుల మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తమిళనాడుకు నీటిని విడుదల చేస్తే.. తమకు కొరత పడుతుందని భావిస్తున్న వారు.. ఆ రాష్ట్రానికి నీటిని విడుదల చేయొద్దని కోరుతున్నారు. ఇందులో భాగంగా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతున్నారు.

అంతేకాదు.. పెద్ద ఎత్తున నిరసనలకు తెర తీస్తున్నారు. బుధవారం మొదలైన నిరసనలు.. రాత్రికి కూడా కొనసాగుతున్నాయి. కావేరీ జలాల అంశంపై చర్చలు జరిపేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ఢిల్లీకి వెళుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం సైతం సుప్రీంను ఆశ్రయించింది. ఇదిలా ఉంటే..తమిళనాడుకు నీటిని ఇస్తే రిజర్వాయర్లను ఖాళీ చేయటంతో పాటు తాగునీటికి కూడా సమస్య ఎదురవుతుందని సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యానించారు.

అయితే.. రోజుకు 25 టీఎంసీల చొప్పున నీటిని విడుదల చేయాలని తమిళనాడు కోరుతోంది. ఇందుకు కర్ణాటక ఒప్పుకుంటే సమస్యలు పెరుగుతాయని.. అందుకే తాము 3 వేల క్యూసెక్కులు మాత్రమే నీటిని విడుదల చేయగలమని మంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేస్తున్నారు. తమిళనాడుకు విడుదల చేసే నీటిలో ఎంత కుదిరితే అంత తగ్గించి విడుదల చేసేలా చర్చలు జరుపుతామని చెబుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్యనున్న వివాదం సుదీర్ఘంగా సాగుతోంది. ఎప్పుడైతే వర్షాలు తక్కువ పడతాయో.. ఆ ఏడాది సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. రెండు రాష్ట్రాల మధ్య కావేరీ జల వివాదం దశాబ్దాలుగా సాగుతోంది. అయితే.. 1990లో కేంద్రం కావేరీ జల వివాదలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు కావేరీ జల వివాదాల ట్రైబ్యునల్ ను ఏర్పాటు చేసినప్పటికీ.. వర్షాభావ పరిస్థితుల్లో మాత్రం ఎప్పటిలానే సమస్యలు ఎదురవుతున్నాయి.