Begin typing your search above and press return to search.

అమెరికాలో సంపన్న భారత ఫ్యామిలీ అనుమానాస్పద మృతి

అమెరికాలో ఒక సంపన్న భారతీయ కుటుంబం తమ విలాసవంతమైన బంగళాలో మృతదేహాల రూపంలో కనిపించటం సంచలనంగా మారింది

By:  Tupaki Desk   |   31 Dec 2023 5:03 AM GMT
అమెరికాలో సంపన్న భారత ఫ్యామిలీ అనుమానాస్పద మృతి
X

అమెరికాలో ఒక సంపన్న భారతీయ కుటుంబం తమ విలాసవంతమైన బంగళాలో మృతదేహాల రూపంలో కనిపించటం సంచలనంగా మారింది. అనుమానాస్పద మరణాలుగా పేర్కొంటున్న పోలీసులు.. ఈ వ్యవహారంపై ఇప్పుడు ప్రత్యేకంగా విచారణ జరుపుతున్నారు. అసలేం జరిగిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మసాచుసెట్స్ రాజధాని బోస్టన్ పట్టణానికి నైరుతి దిశగా 32 కిలోమీటర్ల దూరంలో ఉండే డోవర్ లో ఒక ఖరీదైన బంగళాలో ప్రవాస భారతీయులైన రాకేశ్ కమల్ (57), ఆయన సతీమణి టీనా (54), కుమార్తె అరియానా (18)ల మృతదేహాలను గుర్తించారు. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.

పదకొండు బెడ్రూంలు ఉన్న ఖరీదైన బంగళాలలో రాకేశ్ కమల్ డెడ్ బాడీ వద్ద ఒక పిస్టల్ కనిపించింది. దీంతో.. ఆయన తన భార్యను.. కుమార్తెను కాల్చేసి.. తర్వాత తనకు తాను ఆత్మహత్య చేసుకున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. లేదంటే.. ఇంకేదైనా కారణం ఉందా? అన్నది ప్రశ్నగా నిలుస్తోంది. ప్రాథమికంగా అయితే.. భార్య.. కుమార్తెను చంపేసి.. తాను ఆత్మహత్య చేసుకొని ఉంటారన్న వాదనకు తగ్గట్లే పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి.

వీరి అనుమానాస్పద మరణాల గురించి నార్ఫోక్ డిస్ట్రిక్ట్ అటార్నీ (డీఏ) మైఖేల్ మోరిస్సే వెల్లడిస్తూ.. ఒకట్రెండు రోజులుగా ఈ కుటుంబం నుంచ ఎలాంటి సమాచారం తమకు అందకపోవటంతో వారి ఇంటికి ఒక బంధువు వెళ్లగా.. వారంతా ప్రాణాలు పోయిన స్థితిలో ఉండటానని గుర్తించి.. వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. అమెరికాలోని సంపన్న భారతీయులగా పేరున్న రాకేశ్.. ఆయన భార్య టీనాలు ఎడ్యునోవా అనే ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కంపెనీని నిర్వహించారు. వీరిద్దరికి విద్యా రంగం మీద మంచి పట్టు ఉందని చెబుతారు. 2016లో ప్రారంభమైన ఈ కంపెనీ 2021 డిసెంబరులో మూతపడింది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో 2021లో దివాళా పిటిషన్ ను దాఖలు చేశారు.

ఈ కంపెనీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా టీనా వ్యవహరించారు. ఆమె ఢిల్లీ వర్సిటీ.. హార్వర్డ్ వర్సిటీల్లో చదువుకున్నారు. ఇక.. కమల్ విషయానికి వస్తే బోస్టన్ వర్సిటీ.. ఎంఐటీ స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్.. స్టాన్ ఫర్డ్ వర్సిటీలో చదువుకున్నారు. ఈ దంపతుల కుమార్తె టీనా .. ఆరియానా వెర్మాంట్ లోని ఒక ప్రైవేట్ లిబరల్ ఆర్ట్స్ స్కూల్లో చదువుతోంది. గడిచిన కాలంగా వారు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటునట్లుగా చెబుతున్నారు. 2019లో డోవల్ లో 5.45 మిలియన్ డాలర్ల విలువ చేసే అత్యంత ఖరీదైన ఇంట్లో వీరు నివసిస్తున్నారు. మన రూపాయిల్లో చెప్పాలంటే దగ్గర దగ్గర రూ.45 కోట్లుగా చెప్పాలి. 19వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ ఇంట్లో 11 బెడ్రూంలు ఉన్నాయి. అయితే.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ ఇంటిని తనకా పెట్టి లోన్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

అయితే.. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే విషయంలో ఫెయిల్ కావటంతో ఏడాది క్రితం మసాచుసెట్స్ కు చెందిన విల్సన్ డేల్ అసోసియేట్స్ సంస్థకు ఈ భవనాన్ని 3 మిలియన్ డాలర్లకు అమ్మేసినట్లుగా మీడియా సంస్థలు చెబుతున్నాయి. అయితే.. వీరి మరణాల వెనుక కుటుంబ కలహాలా? ఆర్థిక ఇబ్బందులా? అన్న విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అదే సమయంలో వీరి మరణాలకు బయట వ్యక్తులు ఎవరైనా కారణమా? అన్న కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.