Begin typing your search above and press return to search.

బీకేర్ ఫుల్: ఈ వారం మంట పుడుతుందంతే

ఐదు రోజుల పాటు దేశమంతా వడగాలులు వీస్తాయని.. ఈ హీట్ వేవ్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

By:  Tupaki Desk   |   24 April 2024 4:25 AM GMT
బీకేర్ ఫుల్: ఈ వారం మంట పుడుతుందంతే
X

సాధారణంగా వేసవి అంటే.. 'మే' గుర్తుకు వస్తుంది. అయితే.. ఈ ఏడాది మే రావటానికి మరో వారం టైం ఉంది. కానీ.. ఇప్పటికే మండే ఎండలతో మంటెక్కిపోతున్న పరిస్థితి. మార్చిలో మొదలైన ఎండల తీవ్రత అంతకంతకూ ఎక్కువ అవుతూ ఉండటం తెలిసిందే. ఈ సారి ఏప్రిల్ లోనే 'మే' ఫీలింగ్ పరిస్థితి. ఇప్పటికే గరిష్ఠ ఉష్ణోగ్రతలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు.

ఇదిలా ఉంటే.. నేటి నుంచి వచ్చే ఐదు రోజులు దేశ ప్రజలంతా జర జాగ్రత్తగా ఉండాలంటూ భారత వాతావరణ సంస్థ హెచ్చరిస్తోంది. ఐదు రోజుల పాటు దేశమంతా వడగాలులు వీస్తాయని.. ఈ హీట్ వేవ్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. గురువారం.. శుక్రవారాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచన చేస్తున్నారు.

పెద్ద వయస్కులు.. ఆరోగ్యం సరిగా లేని వారు ఎండ వేళలో బయటకు వెళ్లకుండా.. ఇంట్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. వడగాల్పుల నేపథ్యంలో గురు శుక్రవారాల్లో ఎల్లో అలెర్టును జారీ అయ్యింది. శనివారం మాత్రం అరెంజ్ అలెర్టు జారీ చేశారు. మంగళవారం నల్గొండ జిల్లాలోని టిక్యా తండాలో ఏకంగా 45.1 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రెండు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత మామూలుగా మారింది. దీంతో.. ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.

మరోవైపు ఎన్నికల సీజన్ కావటంతో.. భారీ ఎత్తున నిర్వహిస్తున్న సభలు.. సమావేశాలు.. ర్యాలీలు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వస్తున్నారు. ఇలా వస్తున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులకు గురవుతారని హెచ్చరిస్తున్నారు. మండే ఎండల కారణంగా ఎన్నికల పోలింగ్ మీద ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో విద్యుత్ వినియోగం భారీగా పెరగటంతో పాటు.. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. దీంతో.. పలు ప్రాంతాల్లో నీటి ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి.