డీప్ ఫేక్ ఫొటోలా.. అయితే.. ఇలా గుర్తించండి: కేంద్రం సమాచారం
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ.. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో...(పీఐబీ) ఇప్పుడు సరికొత్త సమాచారాన్ని ప్రజలతో పంచుకుంది.
By: Tupaki Desk | 22 May 2024 2:45 AM GMTఇటీవల కాలంలో డీప్ ఫేక్ ఫొటోలు.. వీడియో.. వాయిస్ వంటివి పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. సెలబ్రిటీల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు కూడా `డీప్ ఫేక్` బారిన పడిన వారే. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాల వరకు .. చాలా మంది నేతల ఆడియో.. వీడియోలను..డీప్ ఫేక్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన విషయాలు వివాదానికి కూడా దారి తీశాయి. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోలు కూడా.. డీప్ ఫేక్ తో హల్చల్ చేయడం తెలిసిందే. అప్పట్లో ప్రధాని మోడీ వాటిని ఖండించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ.. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో...(పీఐబీ) ఇప్పుడు సరికొత్త సమాచారాన్ని ప్రజలతో పంచుకుంది.
డీప్ ఫేక్ ఫొటోలను గుర్తించే విధానాన్ని తీసుకువచ్చింది. పీఐబీ వెల్లడించిన సమాచారంతో డీప్ ఫేక్ ఫొటోలను గుర్తించే వెసులు బాటు కలగనుంది. వాస్తవానికి ఈ డీప్ ఫేక్ ఆడియో.. వీడియో.. ఫొటోలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇలాంటి వాటిని గుర్తించేందుకు వీలుగా కేంద్రం ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. ఎలాంటి టెక్నాలజీ కూడా అవసరం లేకుండా చిన్న చిన్న అంశాల ఆధారంగా డీప్ ఫేక్ ఫోటోలను గుర్తించ వచ్చని పీఐబీ తెలిపింది.
ఏం చేయాలి.?
డీప్ ఫేక్ ఫొటోలుగా భావిస్తున్నవాటిని అత్యంత నిశితంగా పరిశీలించాలి. దీని పక్కనే ఒరిజినల్ ఫొటో పెట్టుకుని మరీ పరిశీలిస్తే ఇంకా మంచిది. తొందరగానే.. ఇది నకిలీనా.. అసలా? అనే విషయం స్పష్టమవుతుందని పీఐబీ తెలిపింది. డీప్ ఫేక్ ఫొటోలైతే.. వాటిలో వింత వింత లైటింగ్, నీడలు, చిత్రాల్లో అసమానతలు వంటివి స్పష్టంగా కనిపిస్తాయని పీఐబీ పేర్కొంది. ఈ సంస్థ ప్రస్తుతం షేర్ చేసిన వీడియోలో ఆయా తేడాలను ఎలా గుర్తించ వచ్చో పూస గుచ్చినట్టు వివరించింది.
ఇవి.. ప్రధానంగా కనిపిస్తాయి
+ డీప్ ఫేక్ ఫొటోల్లో నీడలు సరిగా కనిపించవు. కనిపించినా.. అతికించినట్టు కనిపిస్తాయి.
+ డీప్ ఫేక్ ఫొటోల్లో వ్యక్తుల వేళ్లు కూడా.. సరిగా ఉండవు. దీనిని ఒరిజినల్ ఫొటో పక్కన పెట్టుకుని గమనిస్తే.. స్పష్టంగా తేడా తెలుస్తుంది.
+ డీప్ ఫేక్ ఫోటోలో మనుషుల శరీర తీరు వాస్తవానికి విరుద్ధంగా ఉంటుంది. కాలి, చేతివేళ్లు అసహజంగా కనిపిస్తాయి.
+ ఎడిట్ చేసిన ఫోటోల్లో నీడలు తేడాగా ఉంటాయి. వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే డీప్ ఫేక్ అని అర్థమవుతుంది.
+ అదేవిధంగా ముఖంలోనూ తేడాలను గుర్తించవచ్చునని పీఐబీ తెలిపింది.
+ నవ్వు తీరు కూడా.. మారుతుందని.. దీనిని కూడా ఒరిజినల్‌తో గుర్తించవచ్చని పేర్కొంది. మొత్తానికి కొంత వరకు డీప్ ఫేక్ ఫొటోలను గుర్తించేందుకు అవకాశం ఉందని పీఐబీ వెల్లడించింది.