తెలుగు రాష్ట్రాల్లో మొదలైన పెళ్లి సందడి
ఆషాడం వెళ్లిపోయింది. శ్రావణం వచ్చేసింది. సందడి మొదలైనట్లే.
By: Tupaki Desk | 7 Aug 2024 5:16 AM GMTఆషాడం వెళ్లిపోయింది. శ్రావణం వచ్చేసింది. సందడి మొదలైనట్లే. వివాహాలతో పాటు పలు శుభకార్యాలకు మంచి ముహుర్తాలు లేని రోజులు అయిపోయి.. శుభలగ్నాల శ్రావణం వచ్చేసింది. దీంతో.. ఇంతకాలం పెళ్లిళ్లు మొదలుకొని శుభకార్యాలు చేసుకోవాలనుకున్న వారంతా ఎదురుచూస్తున్న మంచి రోజులు వచ్చేశాయి. దీంతో.. ఈ నెలలోని మంచి రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది.
ఈ నెలలో ఈ రోజు (ఆగస్టు 7) నుంచి శుభముహుర్తాలు మొదలయ్యాయి. పురోహితులు.. పండితుల లెక్క ప్రకారం ఈ నెలలో 7,8,9,10,11,15,17,18,22,23,24,28 తేదీలు పెళ్లిళ్లకు.. గ్రహ ప్రవేశాలకు మంచి ముహుర్తాలుగా చెబుతున్నారు. ఈ మొత్తం మంచిరోజుల్లో 17, 18 తేదీలు పెళ్లిళ్లకు అత్యంత మంచి ముహుర్తాలుగా పేర్కొంటున్నారు. దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బోలెడంత హడావుడి నెలకొంది.
పురోహితులు మొదలు కొని కల్యాణ మండపాలు.. పూల అలంకరణ.. షామియానాలు.. క్యాటరింగ్.. బ్యూటీషన్లు.. డీజేపీలతో పాటు.. వ్యాపారాలకు మంచి రోజులు వచ్చేసినట్లే. శ్రామికులకు సైతం చేతినిండా పని దొరికే పరిస్థితి. మొత్తంగా శ్రావణంలో వచ్చిన మంచిరోజులతో రెండు రాష్ట్రాల్లోనూ పండుగ వాతావరణం నెలకొన్నట్లేనని చెప్పాలి. దీనికి తోడు శ్రావణ శుక్రవారాలు.. వరలక్ష్మి వ్రతం షాపింగ్ ను మరింత పెంచటం ఖాయం.