రీల్ కు మించిన రియల్ ట్విస్టులు.. కారులోనే పెళ్లి ఆ తర్వాతేమైందంటే?
అచ్చం ఆ సినిమాలో మాదిరే రియల్ జీవితంలో శివప్రసాద్.. అమ్రత అనే ఇద్దరు ప్రేమికులు తమ వివాహాన్ని కారులో చేసుకున్నారు.
By: Tupaki Desk | 4 Jan 2024 4:56 AM GMTకర్ణాటకలో జరిగిన ఒక ప్రేమవివాహం ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకోవటమే కాదు.. ఆద్యంతం సినిమా స్టోరీ అన్నట్లు సాగింది. చివరకు కథ సుఖాంతమైనప్పటికీ.. రెండు రోజుల పాటు సాగిన ఈ లవ్ మ్యారేజ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగిందంటే.. నటుడు యాష్.. నటి ఓలియా నటించిన ‘కిరాతక’ అనే కన్నడ సినిమాలో ఒక ప్రేమ జంట కారు వెనుక సీటును పెళ్లి మండపంగా భావించి పెళ్లి చేసుకోవటం ఉంటుంది.
అచ్చం ఆ సినిమాలో మాదిరే రియల్ జీవితంలో శివప్రసాద్.. అమ్రత అనే ఇద్దరు ప్రేమికులు తమ వివాహాన్ని కారులో చేసుకున్నారు. ఫోన్ లోని ఆడియోలో పెళ్లి మంత్రాలు వస్తుంటే.. కారు వెనుక సీటులో దండలు మార్చుకోవటం.. నల్లపూసల దండ వధువు మెడలో కట్టటంతో వివాహాన్ని పూర్తి చేసుకున్నారు. దీనికి సంబంధించిన చిట్టి వీడియో కర్ణాటకలోని వాట్సాప్ గ్రూపుల్లో.. సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది. అయితే.. ఈ పెళ్లి ఇరువురు తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవటంతో ఆ వెంటనే సీన్ పోలీస్ స్టేషన్ కు మారింది. ఈ సందర్భంగా ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఈ మొత్తానికి తెక్కలకోట పోలీసు స్టేషన్ వేదికైంది.
డిప్లొమా చదువుతున్న శివప్రసాద్.. డిగ్రీ పూర్తి చేసిన అమ్రతలు ప్రేమించుకున్నారు. ఇద్దరిది వేర్వేరు ప్రాంతాలు.. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు. దీంతో.. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు నో చెప్పారు. దీంతో.. కిరాతక సినిమాలో మాదిరి.. కారు వెనుక సీట్లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అభ్యంతరాలు ఉండటంతో ప్రేమికులు ఇద్దరు.. వారి పెద్దలు పోలీసు స్టేషన్ కు వచ్చారు.
అయితే.. పెళ్లి చేసుకున్న ఇద్దరు మేజర్లు కావటంతో పోలీసులు చేసేదేమీ లేదన్న పరిస్థితి. సరిగ్గా ఆ సమయంలోనే అమ్మాయి తల్లిదండ్రులు కాసేపు మాట్లాడిన తర్వాత.. ఆమెలో ఊగిసలాట మొదలైంది. తొలుత భర్త కావాలన్న ఆమె.. ఆ తర్వాత మాత్రం తల్లిదండ్రులే కావాలని పేర్కొన్నారు. దీంతో.. పోలీసులకు ఏం చేయాలో తోచని పరిస్థితి. మరోవైపు అప్పటికే రాత్రి వేళ కావటంతో.. ఈ పంచాయితీని పక్కరోజున తేలుద్దామని నిర్ణయించారు.
స్టేషన్ లో అమ్మాయిని ఉంచడటం సరికాదని భావించి.. స్టేట్ హోంకు తరలించారు. అయితే.. దీన్ని శివప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తాము ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నామంటూ తన వద్ద వీడియోను పోలీసులకు చూపించాడు. పోలీసు వాహనంలో తీసుకెళుతున్న వాహనానికి అడ్డుగా కూర్చొని తనకు న్యాయం చేయాలని.. తన భార్యను తనతో పంపాలని కోరాడు. దీంతో.. తర్వాతి రోజు ఉదయం ఈ సంగతి తేలుస్తామన్న పోలీసులకు.. ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది.
అయితే.. తర్వాతి రోజు ఉదయం.. అమ్మాయి తాను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని.. తాను తన భర్తతో వెళతానని చెప్పటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో.. ఇరు వర్గాల నుంచి వీడియోలను రికార్డు చేసి.. కౌన్సెలింగ్ పూర్తి చేసి.. శివప్రసాద్ వెంట అమ్మాయిని పంపారు. సినిమాటిక్ ట్విస్టులతో ఒకటి తర్వాత ఒకటిగా చేసుకున్న ఘటనలు చివరకు ఒక కొలిక్కి వచ్చి.. సుఖాంతం కావటంతో పోలీసులు రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. ఈ ఉదంతం కర్ణాటకలో ఆసక్తికర చర్చగా మారింది.