వీకెండ్ రాత్రి హైదరాబాదీయులకు చుక్కలు చూపిన వాన
కానీ.. శనివారం సంగతి అందుకు భిన్నంగా సాగింది. రాత్రి ఏడున్నరకు మొదలైన వర్షం.. అంతకంతకూ పెరగటమే కానీ తగ్గని పరిసర్థితి.
By: Tupaki Desk | 22 Sep 2024 5:15 AM GMTపాడు వర్షం హైదరాబాదీయులకు చుక్కలు చూపించింది. వీకెండ్ రాత్రి వేళ హైదరాబాద్ వ్యాప్తంగా కురిసిన వర్షానికి నగర జీవులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు ముఖ్యంగా సెంట్రల్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. దీంతో.. వీధులన్ని జలమయం కావటంతో పాటు.. వర్షాల్లో భారీగా నిలిచిన నీళ్లతో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో తీవ్రమైన ట్రాఫిక్ జాంతో నగరవాసులకు నరకం కనిపించింది.
శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కుమ్మేసిన వాన కారణంగా పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదు. దీనికి కారణం.. రాత్రి 10 గంటల తర్వాతే వర్షం మొదలు కావటం. కానీ.. శనివారం సంగతి అందుకు భిన్నంగా సాగింది. రాత్రి ఏడున్నరకు మొదలైన వర్షం.. అంతకంతకూ పెరగటమే కానీ తగ్గని పరిసర్థితి. దీంతో.. కొండాపూర్.. బంజారాహిల్స్.. జూబ్లీహిల్స్.. బేగంపేట.. పంజాగుట్ట.. సికింద్రాబాద్.. చిక్కడపల్లి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్.. నల్లకుంట.. విద్యానగర్ .. ఉప్పల్.. బోడుప్పల్.. నాగోల్.. దిల్ షుక్ నగర్.. చైతన్యపురి.. కోఠి.. అబిడ్స్.. నాంపల్లి ప్రాంతాల్లో నాన్ స్టాప్ గా రెండు గంటల పాటు వాన దంచి కొట్టింది.
కుండపోతగా కురిసిన వానతో రోడ్లు మొత్తం చెరువుల్లా మారాయి. వీధుల్లో పెద్ద ఎత్తున వర్షపు నీరు ప్రవాహాలు కట్టాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. భారీ వర్షం కారణంగా రోడ్ల మీద పలు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోగా.. అంతలోనే మరోసారి వర్షం జాడించి కొట్టటంతో ఆగమాగం అయిన పరిస్థితి. వందలాది వాహనాలు వాననీళ్లలో మునగ్గా.. వేలాది వాహనాలు.. ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
అన్నింటికి మించి వీకెండ్ కావటంతో సరదాగా బయటకు వెళ్లి.. ఇంటికి తిరిగి వస్తున్న వేళలో కురిసిన వర్షంతో తీవ్ర ఇబ్బందులు గురయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో కిలోన్నర మీటర్ల దూరానికి టూవీలర్ మీద గంట నలభై నిమిషాలకు పైనే ప్రయాణ సమయం పట్టింది. భారీ వర్షాల నేపథ్యంలో వాహనదారులు పడుతున్న కష్టాలకు కారణాల్ని గుర్తించేందుకు హైడ్రా కమిషనర్ ఐపీఎస్ రంగనాథ్ పలు ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాల కారణంగా ప్రజలు పడుతున్న సమస్యల కారణాల్ని పలువురితో మాట్లాడారు. మొత్తంగా వీకెండ్ వర్షం హైదరాబాద్ మహానగర ప్రజలకు పెద్ద పీడకలగా మారిందని చెప్పక తప్పదు.