Begin typing your search above and press return to search.

మేము బ్రతకాలి సర్... 2 భార్యలు, 9 పిల్లలు, 6 ప్రియురాళ్లు

అయితే వీరిని పోషించడానికి ఎంచుకున్న మార్గమే ఇప్పుడు చిక్కులు తెచ్చిపెట్టింది.

By:  Tupaki Desk   |   1 Dec 2023 5:34 AM GMT
మేము బ్రతకాలి సర్... 2 భార్యలు, 9 పిల్లలు, 6 ప్రియురాళ్లు
X

గతంలో పెద్దలకు ఒక భావన ఉండేదని చెబుతారు. అదేమిటంటే... పిల్లలే ఆస్తులు అని! అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వ్యక్తి అదే భావించాడో ఏమో కానీ... ప్రియురాళ్లు కూడా ఆస్తులనుకున్నాడో ఏమో... ఏకంగా ఆరుగురు ప్రియురాళ్లను కలిగి ఉన్నాడు. అంతకంటే ముందు ఇద్దరు భార్యలు, 9 మంది పిల్లలు కూడా ఉండటం గమనార్హం. అయితే వీరిని పోషించడానికి ఎంచుకున్న మార్గమే ఇప్పుడు చిక్కులు తెచ్చిపెట్టింది.

అవును... లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిన ఒక వ్యక్తి ఇద్దరు భార్యలు, తొమ్మిది మంది పిల్లలతో పాటు ఆరుగురు ప్రియురాళ్లను కలిగి ఉన్నాడు. ఈ సమయంలో తన భార్యలతో కలిసి సముద్ర తీరంలో న్యూఇయర్ వేడుకలను జరుపుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సమయంలో పోలీసులు పట్టుకుని వెళ్లారు. ఆ తర్వాత అసలు విషయం ప్రపంచానికి తెలియడంతో షాక్ అవ్వడం సగటు మనిషి వంతైంది!

వివరాళ్లోకి వెళ్తే... యూపీలోని సరోజనీ నగర్ కు చెందిన సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ అజిత్ మౌర్యా అనే వ్యక్తి చీటింగ్ కేసులో అరెస్టయ్యాడు. సోషల్ మీడియా సైట్లలో రీల్స్ చే సే ఇతడు... ఎన్నో మోసాలు చేసి, సుమారు తొమ్మిది క్రిమినల్ కేసుల్లో నేరస్తుడు! స్కీంల పేరు చెప్పి మోసాలు చేయడం.. నకిలీ కరెన్సీ నోట్లను చెలామణి చేయడం, బీమా పథకాలతో ప్రజలను మోసం చేయడం సహా ఇతడిపై అనేక ఇతర కేసులు ఉన్నాయి.

ఇదే సమయంలో కొంత మంది వ్యక్తులకు డబ్బు రెట్టింపు పేరుతో రూ. 3 లక్షలు మోసం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ముంబై లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ తో ఫాల్స్‌ సీలింగ్‌ తయారుచేసే అజిత్ మౌర్యా... ఆ వ్యాపారం విఫలమవ్వడంతో ఇలా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.

ముంబైలో అతను 2000లో సంగీత (40)ని వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఈ దంపతులకు ఏడు మంది సంతానం కలిగారు. ఈ క్రమంలో 2010లో ఉద్యోగం పోగొట్టుకుని భార్య పిల్లలతో గోండాలోని తన గ్రామానికి తిరిగి వచ్చాడు. ఇక్కడ కూడా అతనికి మంచి ఉద్యోగం దొరకకపోవడంతో నేరాలు చేయడం మొదలు పెట్టాడని పోలీసులు చెబుతున్నారు.

ఈ సమయంలో సుశీల (30) అనే యువతితో పరిచయం ఏర్పడింది. 2019లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈమెతో కలిసి ఇద్దరు పిల్లలకు జన్మ నిచ్చాడు. ఈ సమయంలో భారీ మోసాలకు పాల్పడుతూ బాగనే డబ్బు సంపాదించాడు. ఈ క్రమంలో రెండు ఇళ్లను నిర్మించాడు. అందులో ఒక ఇంట్లో మొదటి భార్య సంగీతను, మరోక ఇంట్లో సుశీలను ఉంచాడు. అలా రెండిళ్లు ఉన్నప్పటికీ మరో ఇల్లు అద్దెకు తీసుకుని అజిత్ అక్కడే నివాసముంటున్నాడని పోలీసులు చెబుతున్నారు.

ఇదే సమయంలో పోలీసులు అతని కాల్ డేటా ఆధారంగా అతడికి ఆరుగురు ప్రియురాళ్లు ఉన్నారని.. వారిని లాంగ్ ట్రిప్పులకు తీసుకెళ్లేవాడని గుర్తించారు. ఈ సందర్భంగా అరెస్టైన ఆరవ తరగతి డ్రాపౌట్ అయిన అజీత్... తనకు ఇద్దరు భార్యలు, తొమ్మిది మంది పిల్లలతో పాటు ఆరుగురు ప్రియురాళ్లు ఉన్నారని.. వారందరినీ పోషించడం కోసం నేరాలు చేస్తున్నట్లు పోలీసులకు చెప్పి షాక్ ఇచ్చాడు. దీంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అయ్యింది!