'సంక్షేమానికి' అర్థం మారిపోతోంది.. యమ డేంజర్..!
ఏ ప్రభుత్వమైనా ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం సహజమే.
By: Tupaki Desk | 17 Aug 2024 3:00 AM GMTఏ ప్రభుత్వమైనా ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం సహజమే. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు తాయిలాలు ప్రకటించేవారు. ప్రస్తుతం కూడా ప్రకటిస్తున్నారు. దీనివల్ల ప్రజలను తమవైపు తిప్పుకొని అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఈ క్రమంలో ఇస్తున్న హామీలు.. ప్రభుత్వాలకు తలనొప్పిగా మారితే.. ప్రజలకు మరింత తలనొప్పిగా పరిణమిస్తున్నాయి. దీంతో సంక్షేమ పథకాలపై ఒక విధమైన చెడు భావన ప్రారంభమైంది.
నిజానికి సంక్షేమ పథకాలు మనకు.. ఈ దేశానికి కూడా కొత్తకాదు. ఇందిరమ్మ హయాం నుంచి కూడా సంక్షేమం తాలూకు పథకాలు.. అమలయ్యాయి. తర్వాత.. ఏపీలోనూ అనేక పథకాలు అమలు చేశారు. కానీ, ఏ నాడూ.. వాటిని ప్రభుత్వాలు భారంగా భావించలేదు. ప్రజలు కూడా వాటిని బరువుగా తలకె త్కుకున్నదీ లేదు. కానీ, ఇటీవల కాలంలో ప్రభుత్వాలు ప్రకటిస్తున్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. సర్కారుకు భారంగా మారుతున్నాయి. మరోవైపు ఓ వర్గం ప్రజలకు కూడా మరింత భారంగా మారుతున్నాయి.
ఈ నేపథ్యంలో అసలు సంక్షేమం అంటే ఏంటి? అనేది చర్చకు వస్తోంది. సంక్షేమం- అంటే.. అందరికీ మేలు చేసేది! అనే కదా! దీని కింద ప్రకటిస్తున్న పథకాలు.. అందరికీ మేలు చేయాలి. అంటే.. ఇటు ప్రజలకు-అటు ప్రభుత్వాలకు-మరోవైపు.. ఆయా రంగాలపై ఆదారపడిన వారికి కూడా మేలు చేయాలి. ఉదాహరణకు అన్నగారు రూ.2 కిలో బియ్యం ప్రవేశ పెట్టారు. దీనిని గమనిస్తే.. పేదలకు రూ.2కే బియ్యం అందాయి. తద్వారా.. రైతుల నుంచి ధాన్యం సేకరణ పెరిగింది. మరోవైపు.. అన్నగారు మరణించి దశాబ్దాలైనా.. ఆయన పేరు ఇప్పటికీ ఉండిపోయింది.
అంటే.. ఒక్క సంక్షేమ పథకంతో ఇటు ప్రజలు, అటు ఆయా రంగాలపై ఆధారపడిన వారు, మరోవైపు సర్కారు కూడా. లబ్ధి పొందింది. ఇక, గరీబీ హఠావో.. నినాదం ఇచ్చిన ఇందిరమ్మ విషయానికి వస్తే.. ఆమె పేదలకు భూములు పంచింది. తద్వారా.. భూవినిమయం పెరిగి.. ప్రభుత్వాలకు ట్యాక్సుల రూపంలో సొమ్ములు వస్తే.. పేదల జీవితాల్లో సర్కారు వెలుగు నింపిందన్న భావన ఉండిపోయింది. ఇదీ.. సంక్షేమం అంటే. కానీ, కొన్ని దశాబ్దాలుగా ఈ సంక్షేమానికి అర్ధం మార్చేస్తున్నారు.
+ ఉదాహరణకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయడం ద్వారా.. ఆర్టీసీపై భారం పడుతోంది. మరోవైపు ఆటో, ట్యాక్సీ రంగాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. పోనీ.. ప్రభుత్వానికి ఏమైనా మేలుందా? అంటే.. భారీ ఎత్తున భారాలు భరించాల్సి ఉంది.
+ రైతు రుణ మాఫీ. దీనివల్ల రైతులకు ప్రయోజనం జరుగుతున్నా.. ఇదేసమయంలో మితిమీరిన అప్పులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడో అప్పుడు సర్కారు మాఫీ చేస్తుందన్న ధీమాతో చాలా చోట్ల వ్యర్థంగా మారుతోంది. ఇదే సమయంలో వీరికి రుణ మాఫీ చేస్తున్న సొమ్మును మరో రూపంలో ప్రజల నుంచి పిండేస్తున్నారు. సో.. ఇలాంటిపథకాలు సమాజంపైనా భారంగా మారుతున్నాయి. అలా కాకుండా.. యూరియా, విత్తనాలు, ఇతర త్రా సరంజామాను ప్రభుత్వమే ఉచితంగా ఇస్తే.. అసలు రైతులు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు కదా! అనేది ప్రశ్న.