బెంగాల్.. మరో బంగ్లాదేశ్ అవుతుందా?
రెండోది.. పోలీసుల బారి నుంచి తప్పించుకుంటూనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా .. ఉవ్వెత్తున ఎగిసి పడిన విద్యార్థి లోకం.
By: Tupaki Desk | 28 Aug 2024 4:34 AM GMT+ రణరంగంగా కోల్ కతా వీధులు
+ పోలీసుల లాఠీచార్జీలు.. కాల్పులు..
+ పదుల సంఖ్యలో విద్యార్థులకు తీవ్ర గాయాలు
+ మమత రాజీనామాకు.. రాష్ట్ర విడిచి పోవాలని పట్టు
+ తెరవెనుక కుట్ర ఎవరిది?
పశ్చిమ బెంగాల్. తూర్పు-ఈశాన్య భారతంలో ఉన్న కీలకమైన రాష్ట్రం. అయితే.. కొన్నాళ్ల కిందట.. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో.. అచ్చం ఇప్పుడు బెంగాల్‌లోనూ అలాంటి పరిస్థితులే నెలకొన్నాయనడంలో సందేహం లేదు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఎవరో వెనుక ఉండి ప్రోత్సహిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని జాతీయ మీడియా కూడా చెబుతోంది. మంగళవారం.. రాష్ట్ర రాజధాని కోల్‌కతా వీధుల్లో రెండే రెండు అంశాలు కనిపించాయి. భీకరమైన బూట్ల చప్పుళ్లతో పరుగులు పెడుతూ.. లాఠీలకు, తుపాకులు పనిచెప్పిన పోలీసులు.
రెండోది.. పోలీసుల బారి నుంచి తప్పించుకుంటూనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా .. ఉవ్వెత్తున ఎగిసి పడిన విద్యార్థి లోకం. ఎటు చూసినా.. ఈ రెండే కనిపించాయి. ఒక్క కోల్ కతాలోనే కాదు.. కీలక పట్టణం హౌరా, సహా అనేక ప్రాతాల్లో `పశ్చిమబెంగా ఛాత్ర సమాజ్` ఇచ్చిన పిలుపులో భాగంగా విద్యార్థులు రోడ్డెక్కారు. మమతకు వ్యతిరేకంగా ర్యాలీలు తీశారు. తక్షణం ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని కొన్ని చోట్ల అయితే.. మమత రాష్ట్రం వీడిపోవాలంటూ.. ప్లకార్డులు కనిపించడం గమనార్హం. ఈ పరిణామాలు.. రాష్ట్రాన్ని మంగళవారం రోజు రోజంతా అట్టుడికించాయి.
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పోలీసుల లాఠీ చార్జీల్లో పదుల సంఖ్యలో విద్యార్థులకు రక్తాలు కారా యి. ఒకరిద్దరికి తలలు పగలగా.. చాలా మంది విద్యార్థులకు కాళ్ల ఎముకలు చిట్టిపోయాయి. కాగా.. ఈ ఘటన వెనుక.. బీజేపీ ఉందని.. ప్రతిపక్షాలు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు(నిన్నమొన్నటి వరకు మమతను తిట్టిపోసిన పార్టీలు ఇవి) ఆరోపించడం చూస్తే.. తెరవెనుక జరుగుతున్న కుట్ర ఏంటనేది.. ఇట్టే అర్థమవుతోందన్నది జాతీయ మీడియా చెబుతున్న మాట. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఇక్కడ పగ్గాలు చేపట్టాలన్న ఢిల్లీ పెద్దల వ్యూహానికి విద్యార్థులు పావులు గా మారుతున్నారన్నది నగ్న సత్యం అంటున్నారు.
ఎందుకీ రగడ?
కోల్‌కతాలోని ఆర్జీకర్ కళాశాలలో ఈ నెల 9న జూనియర్‌వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచారానికి సంబంధించి కొన్నాళ్ల కిందట రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. అయితే.. ఈ కేసులో అధికార పార్టీ కొందరిని కాపాడుతోందన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి. దీంతో కొన్ని శక్తుల చేతిలో విద్యార్థులు పావులుగా మారారు. తాజాగా రెండు రోజుల నుంచి సీఎం మమత రాజీనామా కు పట్టుబడుతున్న విద్యార్తులు(వీరిలో వైద్య విద్యార్థులు లేకపోవడం గమనార్హం) నిరసనకు దిగారు.
ఈ నిరసనే సంక్లిష్టతకు చేరుకుని,.. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి కూడా దారితీసింది. ఇదిలావుంటే.. బుధవారం రాష్ట్ర బంద్‌కు బీజేపీ పిలుపునివ్వడం గమనార్హం. కాగా, అందరి వేళ్లూ.. కమల నాథుల వైపే చూపిస్తున్నాయి. పరిస్థితిని చక్కదిద్దాల్సింది పోయి.. మరింత రెచ్చగొట్టడం గమనార్హం. బంగ్లాదేశ్‌లోనూ.. విద్యార్థుల రగడ.. పొరుగు దేశాల మద్దతుతోనే.. హసీనా..రాజీనామా చేయడం..దేశం వదిలి పారిపోవడం తెలిసిందే. అయితే.. మమత మొండి ఘటం కావడంతో ఇక్కడ పరిస్థితి ఏ నిముషానికి ఏం జరుగుతుందో అనే విధంగా మారిపోయింది.