జాబ్ పేరుతో ఆమెను ఏపీ డిప్యూటీ సీఎం మోసం చేశారట!
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో తన భర్తకు మేల్ నర్సింగ్ ఆర్డర్లీ జాబ్ ఇప్పిస్తానని చెప్పి మోసం చేసినట్లుగా ఆమె ఆరోపిస్తోంది.
By: Tupaki Desk | 14 April 2024 5:17 AM GMTఏపీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తమను మోసం చేసినట్లుగా ఒక మహిళ సీరియస్ ఆరోపణ చేసింది. తన భర్తకు ఉద్యోగం ఇస్తానని చెప్పిన ఆయన మాటలతో తాము డబ్బులు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. తాజాగా ఆమె చేసిన ఆరోపణ సంచలనంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో తన భర్తకు మేల్ నర్సింగ్ ఆర్డర్లీ జాబ్ ఇప్పిస్తానని చెప్పి మోసం చేసినట్లుగా ఆమె ఆరోపిస్తోంది.
గణపవరం ప్రాంతానికి చెందిన పరిమళ సుమన అనే మహిళ అదే ఊళ్లో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెకు మాధవరం గ్రామంలో లైన్ మెన్ గా పని చేస్తున్న సుదర్శన్, అతడి భార్య ఇద్దరు కలిసి తన భర్తకు ఎమ్ఎన్ వోగా జాబ్ ఇప్పిస్తానని చెప్పి నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. మంత్రికి రూ.4.5 లక్షలు ఇవ్వాలని చెప్పారని.. ఇందులో భాగంగా 2020 జనవరిలో మధ్యవర్తుల సాయంతో అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రిని కలిసి తాము డబ్బులు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు.
మాట ఇచ్చిన ప్రకారం ఎమ్ఎన్ వో ఉద్యోగం కాకుండా స్వీపర్ పోస్టు ఇచ్చినట్లుగా పేర్కొన్న మహిళ.. ఏడాది తర్వాత ఆ జాబ్ నుంచి కూడా తొలగించినట్లుగా పేర్కొన్నారు.
ఈ విషయాన్నిమధ్యవర్తులను ప్రశ్నించగా తమపై దాడికి పాల్పడినట్లుగా సదరు మహిళ ఆరోపించారు. ఎన్నికల వేళ ఉప ముఖ్యమంత్రి మీద దళిత మహిళ ఒకరు చేసిన ఆరోపణ హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను వివరణ అడగ్గా.. తాను ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదని.. ఎన్నికల వేళ ఇలాంటి ఆరోపణలతో తన ప్రతిష్ఠను దెబ్బ తీయాలని ప్లాన్ చేసినట్లుగా పేర్కొన్నారు.