Begin typing your search above and press return to search.

టికెట్ ఇస్తాం.. రండిబాబూ రండి.. !

ఇలా.. ప్ర‌ధాన పార్టీల్లో సీట్ల వ్య‌వ‌హారం ఇలా న‌డుస్తుంటే.. మ‌రోవైపు, ఏపీ కాంగ్రెస్ పార్టీ మాత్రం.. టికెట్ ఇస్తాం.. రండిబాబూ రండి! అంటూ కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది.

By:  Tupaki Desk   |   24 Jan 2024 3:45 AM GMT
టికెట్ ఇస్తాం.. రండిబాబూ రండి.. !
X

ఏపీలో ఎన్నిక‌ల మూడ్ వ‌చ్చేసింది. ప్ర‌ధాన పార్టీలు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసే ప‌నిలో బిజీబిజీగా ఉన్నాయి. అంతేకాదు.. వైసీపీ , టీడీపీల్లో ఒకే సీటుకు ఇద్ద‌రి నుంచి ముగ్గురు వ‌ర‌కు కూడా అభ్య‌ర్థులు పోటీ ప‌డుతున్నారు. దీంతో టికెట్ల విష‌యం ప్ర‌స్తుతా నికి వైసీపీని గంద‌ర‌గోళంలోకి నెట్టింది. ఇక‌, రాబోయే రోజుల్లో టీడీపీలోనూ ఇలాంటి వాతావ‌ర‌ణ‌మే ఉంటుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఇలా.. ప్ర‌ధాన పార్టీల్లో సీట్ల వ్య‌వ‌హారం ఇలా న‌డుస్తుంటే.. మ‌రోవైపు, ఏపీ కాంగ్రెస్ పార్టీ మాత్రం.. టికెట్ ఇస్తాం.. రండిబాబూ రండి! అంటూ కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది.

బుధ‌వారం నుంచి ఎన్నిక‌ల బీఫాం కోసం.. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌నున్న‌ట్టు ఏపీ పీసీసీ నేత‌లు ప్ర‌క‌టించారు. విజ‌య‌వాడ‌లోని ఆంధ్ర‌ర‌త్న భ‌వ‌న్‌(కాంగ్రెస్ స్టేట్ ఆఫీస్‌)లో ఈ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌నున్న‌ట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి.. గ‌తంలో ప‌ద‌వులు అనుభ‌వించి.. పార్టీకి దూర‌మైన వారు త‌క్ష‌ణం రావాల‌ని.. కూడా పిలుపునిచ్చారు. ఇక‌, ఇప్ప‌టికే ఉన్న నాయ‌కుల్లో అర్హులైన వారు.. ఆర్థికంగా ఖ‌ర్చు చేయ‌గ‌ల‌వారు కూడా అవ‌కాశం వినియోగించుకోవాల‌ని నాయ‌కులు చెబుతున్నారు.

ఆశాలు వారిపైనే

ఏపీ కాంగ్రెస్ విష‌యాన్ని లోతుగా ప‌రిశీలిస్తే.. ఇప్ప‌టికిప్పుడు వ‌చ్చి చేరే నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. పైగా పార్టీలోనే ఉన్నా.. సుప్త‌చేత‌నావ‌స్థ‌లో ఉన్న వారు ఎక్కువ‌గా ఉన్నారు. ముందు వీరిని లైన్‌లోపెట్టాల్సిన అవ‌స‌రం ఉంది. ఇప్ప‌టికే చాలా మంది పార్టీని వీడిపోయారు. ఇక‌, వీరు తిరిగి వ‌స్తార‌ని.. పార్టీని నిల‌బెడ‌తార‌ని కాంగ్రెస్ ఆశ‌లు పెట్టుకుంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి వారు పెద్ద‌గా బ‌య‌ట‌కు రాలేదు. బ‌ల‌మైన నాయ‌కులుగా ఉన్న‌వారు ఎవ‌రూ కూడా కాంగ్రెస్ వైపు చూడ‌లేదు. అయితే.. తెర‌చాటున కేవీపీ వంటి ఉద్ధండులు ఇలాంటి నాయ‌కుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారన్న విష‌యం హ‌ల్చ‌ల్ చేస్తోంది. వీరి ప్ర‌య‌త్నాలు స‌క్సెస్ అయితే.. పార్టీ పుంజుకుంటుంద‌ని ఆశ‌లు ఉన్నాయి.

గ‌త ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 స్థానాల‌కు గాను 102 స్థానాల్లోనే పోటీ చేసింది. అప్ప‌ట్లో ఏపీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న‌ ర‌ఘువీరా రెడ్డి కూడా అభ్య‌ర్థుల కోసం గాలింపు చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. టికెట్ ఇస్తామ‌న్న తీసుకునే వారు లేక‌.. మిగిలి 73 స్థానాల్లో అస‌లు కాంగ్రెస్ అభ్య‌ర్థులు లేకుండా.. డ‌మ్మీలు మిగిలారు. మ‌రి ఈ ప‌రిస్థితి నుంచి పార్టీ పుంజుకుంటుందా? అనేది చూడాలి.