రుషికొండ ప్యాలెస్ తాళాలు వారి చేతికి ?
దీని కోసం మూడేళ్ళ పాటు ఆ ప్రాంతం అంతా నిషేధం విధించి మరీ నిర్మించారు.
By: Tupaki Desk | 28 Aug 2024 2:39 AM GMTవిశాఖ నడిబొడ్డున ఎత్తైన కొండల మీద నిర్మించిన భవనాలు అవి. అత్యాధునికంగా నిర్మించారు. ఈ భవనాల నిర్మాణం కోసం ఏకంగా అయిదు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. రాష్ట్రంలో ఏ భవన నిర్మాణం ఇంతటి వివాదం కాలేదు. దీని కోసం మూడేళ్ళ పాటు ఆ ప్రాంతం అంతా నిషేధం విధించి మరీ నిర్మించారు.
వైసీపీ అధికారంలో ఉన్నపుడు సీఎం క్యాంప్ ఆఫీస్ కం నివాసం అన్నట్లుగా ప్రచారం సాగింది. సీఎం గా జగన్ అధికారంలో నుంచి దిగిపోగానే అవి టూరిజం కోసం నిర్మించిన భవనాలు అని వైసీపీ నేతలు చెప్పారు. అంతే కాదు విశాఖకు వచ్చే వీవీఐపీలు కోసం అతిథి భవనాలు అని కూడా చెప్పుకొచ్చారు.
అయితే ఎవరేమి చెప్పినా ఇంత ఖర్చు పెట్టి ఈ భవనాలను నిర్మించాలా అన్న చర్చ అయితే జనంలోకి వెళ్ళిపోయింది. ఆర్భాటానికే వీటిని నిర్మించారు అన్నది కూడా సగటు జనాలకు అర్థం అయ్యేలా చేయడంతో ఆనాటి విపక్షాలు సక్సెస్ అయ్యాయి. ఇక నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కూడా జగన్ మీద ఘాటు విమర్శలు చేశారు.
తాను ఎన్నో ఏళ్ల నుంచి సీఎం గా ఉన్నా కూడా ఇలాంటి విలాసాల గురించి ఆలోచించలేదని అన్నారు. జగన్ అయితే విశాఖలో ఎత్తైన రుషికొండలో అత్యాధునిక భవనాలు కట్టుకుని అక్కడ నుంచి సముద్రాన్ని చూస్తూ నివాసం ఉండాలని అనుకున్నారు అని ఎద్దేవా చేశారు.
ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. రెండున్నర నెలకు గడిచిపోయాయి. గత మూడేళ్ళుగా ప్రతీ రోజూ హైలెట్ అయిన రుషికొండ ప్యాలెస్ ల విషయంలో మాత్రం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఉత్కంఠంగా మారింది. దీని మీద మంత్రులు ఎమ్మెల్యేలు తలో రకంగా చెబుతూ వస్తున్నారు.
రుషికొండ భవనాలను తొందరలోనే ఏమి చేయాలన్న దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు అని మంత్రి నారాయణ చెప్పారు. అయితే ఇన్నర్ సర్కిల్స్ లో నుంచి వినిపిస్తున్న పుకార్లు బట్టి చూస్తే రుషికొండ ప్యాలేస్ తాళాలు ఒక ప్రముఖ హోటల్ యాజమాన్యం చేతికి అప్పగించాలని నిర్ణయించారు అని అంటున్నారు.
జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఆ హొటల్ యాజమాన్యం ఏపీలో కూడా టూరిజం స్పాట్స్ లో తన స్టార్ హొటళ్ల నిర్మాణం చేపడుతోంది. ఇపుడు ఆ సంస్థకే రుషికొండ ప్యాలెస్ కూడా అప్పగిస్తున్నారు అని అంటున్నారు. లీజ్ పద్ధతిలో అయిదు వందల కోట్ల విలువ చేసే ఈ ప్యాలెస్ ని తీసుకుని సదరు హొటల్ యాజమాన్యం నడపాలని చూస్తోంది అని అంటున్నారు.
అదే కనుక జరిగితే ఆ హొటల్స్ యాజమాన్యానికి ఉన్న రెప్యుటేషన్ తో కచ్చితంగా రుషికొండ ప్యాలెస్ దశ తిరుగుతుందని అంటున్నారు. విశాఖ అసలే టూరిజం స్పాట్. దాంతో అత్యంత ఖరీదు అయిన ఈ ప్యాలెస్ ని హొటెల్ గా మార్చితే వచ్చే టూరిస్టులతో కళకళలాడడం ఖాయం అంటున్నారు. మరి ఈ లీజు నుంచి ప్రభుత్వానికి ఎంత మొత్తం ఆదాయం కింద వస్తుంది అన్నదే ఇక్కడ ప్రధానం.