Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌లో ఏం జరగబోతోంది..? 144 సెక్షన్ అమలు అందుకేనా..?

రెండు రోజుల క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పెద్ద బాంబులు పేల్చాడు.

By:  Tupaki Desk   |   28 Oct 2024 6:50 AM GMT
హైదరాబాద్‌లో ఏం జరగబోతోంది..? 144 సెక్షన్ అమలు అందుకేనా..?
X

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హాట్‌హాట్‌గా మారిపోయాయి. ఎప్పుడు ఏం జరగబోతోందా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. చివరకు హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరగబోతోందన్న ఆసక్తి, ఉత్కంఠ ఇటు పార్టీల్లోనూ, అటు ప్రజల్లోనూ కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పెద్ద బాంబులు పేల్చాడు. రెండు మూడు రోజుల్లోనే కీలక నేతల అరెస్టులు ఉంటాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణలు జరుగుతూనే ఉన్నాయి. కొన్నింటిలో విచారణ చివరి దశకు చేరుకుంది. దాంతో ఆ కీలక నేతలు ఎవరు..? ఎవరికి అరెస్టు చేయబోతున్నారు..? ఎంతమందిని అరెస్టు చేయనున్నారు..? అన్న ఉత్కంఠ నడుస్తోంది.

ఇదిలా ఉంటే.. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిదికి చెందిన ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. దాడులు నిర్వహించి గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ ఫారిన్ లిక్కర్, క్యాసినో కాయిన్స్ తదితర నిషేధిత వస్తువులు పట్టుబడినట్లుగా సమాచారం. ఈ మేరకు ఈ కేసులో ఇద్దరిపై కేసు కూడా నమోదైంది. అయితే కేటీఆర్ కూడా అప్పటివరకు అక్కడే ఉండి.. పోలీసులు వస్తున్నారన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్లిపోయారన్న టాక్ కూడా నడిచింది.

ఇప్పుడు.. ఈ రెండు అంశాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఆదివారం నుంచి నగరంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ ప్రకటించరు. నవంబర్ 27 వరకు నెల రోజులపాటు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. దీంతో ఈ నిబంధనలు నిన్న రాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. అలాగే.. రాజకీయంగా ప్రేరేపిత అల్లర్లు, అనర్ధాలు అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని డీజీపీ తెలిపారు. ఈ సెక్షన్ ప్రకారం ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడడం నిషేధం ఉంటుంది. వచ్చేనెల వరకు హైదరాబాద్‌లో ధర్నాలు, నిరసనలు ఉండవని స్పష్టం చేశారు. డీజీపీ నిర్ణయంతో రాష్ట్రంలో హైప్రొఫైల్ వ్యక్తుల అరెస్టులు ఉండవచ్చన్న ప్రచారమూ జరుగుతోంది. అందలోభాగంగానే 144 సెక్షన్ విధించారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.