Begin typing your search above and press return to search.

రొమాంటిక్ సంబంధాలకే పరిమితం కాదు.. ఏమిటీ "లవ్ బాంబింగ్"?

... ప్రేమలో పడిన కొత్తలో పార్ట్ నర్ ని ఆకర్షించడానికి, వారి మెప్పు పొందడానికి వారికి బహుమతులు ఇవ్వడం, ప్రశంసించడం వంటివి సహజమే!!

By:  Tupaki Desk   |   19 Oct 2024 2:45 AM GMT
రొమాంటిక్  సంబంధాలకే పరిమితం కాదు.. ఏమిటీ లవ్  బాంబింగ్?
X

జీవితంలో ప్రేమను సంపాదించడం, అభిమానాన్ని పొందడం చాలా అధృష్టం అనే చెప్పాలి. అందుకే... మనం ప్రేమించేవాళ్ల కంటే మనల్ని ప్రేమించేవాళ్లు దొరకడం అదృష్టం అని అంటారు. అయితే... ఇలా ప్రేమించేవాళ్లలో కొంతమంది అతి చేసేవాళ్లు ఉంటుంటారు. పరిచయమైన కొన్ని రోజులకే సమయం సందర్భం లేకుండా పొగడ్తలతో ముంచెత్తించేస్తుంటారు.

మీ గురించి ఏమీ తెలియకుండానే అన్నీ తెలిసినట్లు పొగడ్తలతో ముంచెత్తించేస్తుంటారు. ఇక వాట్సప్ మెసేజ్ లు, ఫోన్ కాల్స్ గురించి చెప్పే పనేలేదు. గుడ్ మార్నింగ్ లు, గుడ్ నైట్ లు, తిన్నావారా... అబ్బో అంతా ఇంతా కాదు! మీ అభిప్రాయంతో ఏమాత్రం సంబంధం లేకుండా వార్ వన్ సైడ్ అన్నట్లుగా దూసుకుపోతుంటారు. దీన్నే “లవ్ బాంబింగ్” "అంటారు!

అవును... ప్రేమలో పడిన కొత్తలో పార్ట్ నర్ ని ఆకర్షించడానికి, వారి మెప్పు పొందడానికి వారికి బహుమతులు ఇవ్వడం, ప్రశంసించడం వంటివి సహజమే!! అయితే.. ఈ రూపంలో కొంతమంది నిజమైన ప్రేమను చూపిస్తే... మరికొంతమంది మాత్రం ఈ ప్రేమ మాటున భాగస్వామిని బానిసను చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు.

ఇలా ప్రేమను ప్రేమకోసం కాకుండా.. పార్ట్ నర్ ను మానసికంగా లొంగదీసుకోవడానికి.. బానిసలను చేసుకోవడానికి.. పూర్తిగా వారిపైనే ఆధారపడేలా చేసుకోవడానికి ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి వారినే “లవ్ బాంబర్స్” అని అంటున్నారు నిపుణులు. ఇలాంటి వారిని గుర్తించడం ఎంత సులువో అంత కష్టం అని కూడా చెబుతున్నారు.

అయితే... నిజమైన ప్రేమలో ఇలాంటి ప్రవర్తన ఉండదని అంటున్నారు నిపుణులు. భాగస్వామి అభిప్రాయానికి నిజమైన ప్రేమ విలువ ఇస్తుందని.. అవతలి వ్యక్తి ఆలోచనలను, అభిరుచులను నిజమైన ప్రేమ గౌరవిస్తుందని చెబుతున్నారు. అయితే... లవ్ బాంబర్స్ విషయంలో... తమ ఇష్టాయిష్టాలనే భాగస్వామి ఆచరించాలన్నట్లుగా వ్యహరించడం ఉంటుందని చెబుతున్నారు.

ప్రేమ అనేది పూర్తిగా ఇద్దరి ఉమ్మడి వ్యక్తిగత విషయం!.. భాగస్వామిపై ప్రేమను వ్యక్తపరిచే విషయాలు గరిష్టంగా నాలుగు గోడల మధ్య ఇంటిలోనే ఉండాలని.. అలా నాలుగు గోడల మధ్యనే రిలేషన్ షిప్ లో భాగస్వామిపై ప్రేమను చూపించడాన్ని పరిమితం చేయడం అనేది నిజమైన ప్రేమలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు!

అయితే లబ్ బాంబింగ్ రిలేషన్ షిప్ లో భాగస్వామిపై ప్రేమను నలుగురిలో ప్రదర్శించాలని అనుకుంటారు. దీన్నే పబ్లిక్ డిస్ ప్లే ఆఫ్ ఎఫెక్షన్ (పీడీఏ) అని అంటారు. అంటే... నలుగురిలోకి వెళ్లినప్పుడు భాగస్వామిని హత్తుకోవడం, ముద్దాడడం వంటివి చేస్తూ అతిప్రేమను ప్రదర్శించడాలు ఉంటాయన్నమాట!

అలా అని ఈ లవ్ బాంబింగ్ అనేది కేవలం రొమాంటిక్ సంబంధాలకే పరిమితం కాలేదు. పనిచేసే చోట కూడా చాలా మంది ఇలాంటి ప్రవర్తనను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఉద్యోగాలు భర్తీ చేసేటప్పుడు చాలా కంపెనీలు అభ్యర్థుల పట్ల ఇలాంటి పెర్ఫార్మెన్సే చేస్తుంటుందని చెబుతున్నారు.

ఉదాహరణకు... ఉద్యోగ బాధ్యతలు, చేయాల్సిన పని, విధి విధానాల గురించిన సమాచారాన్ని ఇవ్వడం కంటే ఎక్కువగా... అభ్యర్థుల గత అనుభవాన్ని ప్రశంసించడం, వారి సక్సెస్ ని కొనియాడటం, అడగకపోయినా ఆఫర్లు ఇస్తూ వారిని ఆకర్షించడానికి కంపెనీలు ప్రాధాన్యత ఇస్తాయని.. ఇది కూడా లవ్ బాంబింగే అని అంటున్నారు!

ఇలా... రొమాంటిక్ విషయాల్లో అయినా, ప్రొఫెషనల్ విషయాల్లో అయినా.. దైనందిన జీవితంలో అక్కడక్కడా ఇలాంటి లబ్ బాంబర్స్ ఎదురవుతూంటారు.. అలాంటి వాళ్లను గుర్తించి, వారి విషయంలో జాగ్రత్తగా ఉండటం మేలని చెబుతున్నారు నిపుణులు!