Begin typing your search above and press return to search.

అలా ప్ర‌క‌ట‌న‌.. ఇలా సొమ్ములు.. అల్లు అర్జున్ కేసులో రేవంత్ వ్యూహమేంటి?

పోలీసులు చెప్పినా.. హీరో వినిపించుకోకుండా.. వ్య‌వ‌హ‌రించారంటూ సాక్షాత్తూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదేస‌మ‌యంలో టాలీవుడ్‌పైనా నిప్పులు చెరిగారు.

By:  Tupaki Desk   |   21 Dec 2024 6:51 PM GMT
అలా ప్ర‌క‌ట‌న‌.. ఇలా సొమ్ములు.. అల్లు అర్జున్ కేసులో రేవంత్ వ్యూహమేంటి?
X

'పుష్ప‌-2' సినిమా ప్రీరిలీజ్ స‌మ‌యంలో హైద‌రాబాద్‌లోని సంధ్య సినిమా హాల్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట.. రేవ‌తి అనే మ‌హిళ మృతి చెంద‌డం.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌డం వంటి అంశాలు శ‌నివారం రోజు రోజం తా తెలంగాణ అసెంబ్లీలో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ప్ర‌తిప‌క్షం కూడా.. ఈ విష‌యంలో మౌనంగా ఉండిపోయింది. అధికార ప‌క్షం అల్లు అర్జున్ సెంట్రిక్‌గా.. విరుచుకుప‌డింది. పోలీసులు చెప్పినా.. హీరో వినిపించుకోకుండా.. వ్య‌వ‌హ‌రించారంటూ సాక్షాత్తూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదేస‌మ‌యంలో టాలీవుడ్‌పైనా నిప్పులు చెరిగారు.

ఇక‌, ఎంఐఎం స‌భ్యుడు అక్బ‌రుద్దీన్ ఒవైసీ అయితే.. ఇంత అమాన‌వీయంగా ఎవ‌రైనా ఉంటారా? అని ప్ర‌శ్నించారు. ''తొక్కిస‌లా ట జ‌రిగి.. ఓ మ‌హిళ చ‌నిపోయింద‌ని.. ఓ బాలుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని.. పోలీసులు హీరోకు చెప్పారు. దీనికి ఆయ‌న బ‌దులిస్తూ.. అయితే.. సినిమా సూప‌ర్ హిట్టే .. అని వ్యాఖ్యానించి.. చేతులు ఊపుకొంటూ.. బ‌య‌ట‌కు వెళ్లిపోయారు.. క‌నీసం మాన‌వ‌త్వం చూప‌లేదు'' అన్నారు. ఇక‌, మంత్రి కోమటిరెడ్డి వెంక‌ట రెడ్డి.. అసెంబ్లీలోనే మాట్లాడుతూ.. రేవ‌తి కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తామ‌ని, బాలుడు శ్రీతేజ ఆరోగ్యానికి ప్ర‌భుత్వం మెరుగైన వైద్యం అందిస్తుంద‌ని ప్ర‌క‌టించారు.

క‌ట్ చేస్తే.. కోమ‌టిరెడ్డి వెను వెంట‌నే .. స‌భ ముగియ‌గానే.. రేవ‌తి కుటుంబాన్నిక‌లుసుకుని, ఆమె భ‌ర్త‌కు 25 ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్కును అందించారు. అంతేకాదు.. శ్రీతేజ్ కోలుకునేందుకు ఎన్ని డబ్బులైన ప్రభుత్వం ఇస్తుందని, అవసరం అయితే అమెరికా నుంచి అత్యాధునిక మందులు తెప్పించైనా శ్రీతేజ్ ని బ్రతికించాల‌ని డాక్టర్స్ కు సూచించారు. మొత్తంగా ఈ ప‌రిణామాలు.. అనూహ్యంగా మారాయి. వాస్త‌వానికి.. గ‌త ఐదు రోజులుగా అసెంబ్లీ జ‌రుగుతోంది. ఇక‌, పుష్ప‌-2 ఘ‌ట‌న జ‌రిగి కూడా.. దాదాపు 18 రోజులు అయిపోయింది. మ‌రి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంత స‌డెన్‌గా దీనికి ఇంత ప్రాధాన్యం ఇవ్వ‌డం పై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది.

దీనివెనుక చాలా పెద్ద వ్యూహ‌మే ఉండి ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు. అది రాజ‌కీయంగా కావొచ్చు.. లేదా.. టాలీవుడ్ స‌మ‌ర్థిస్తున్న బీఆర్ ఎస్‌ను ఇరుకున పెట్ట‌డం అయినా.. కావొచ్చ‌న్న చ‌ర్చ సాగుతోంది. స‌భ‌లో అనేక స‌మ‌స్య‌లు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో బీఆర్ ఎస్ పైచేయి సాధిస్తోంద‌న్న చ‌ర్చ కూడా ఉంది. ఇలాంటి స‌మ‌యంలోనే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్‌.. చూచాయ‌గా అల్లు అర్జున్ వ్య‌వ‌హారాన్ని ప్ర‌స్తావించ‌డం.. అధికార ప‌క్షం దీనిపై ఓవ‌ర్‌గా స్పందించ‌డం.. ముఖ్య‌మంత్రే 30 నిమిషాల‌కు పైగా.. దీనిపై మాట్లాడ‌డం.. ఆవెంట‌నే సాయం చేయ‌డం వంటివి చూస్తే.. ఖ‌చ్చితంగా 'వ్యూహం' ఉంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.