Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఓకే.. కేటీఆర్ నాట్ ఓకే..

ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా అనే ఎదురుచూస్తనే ఉన్నారు ఇంకా ఆయన అభిమానులు.

By:  Tupaki Desk   |   10 Dec 2024 10:37 AM GMT
కేసీఆర్ ఓకే.. కేటీఆర్ నాట్ ఓకే..
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌజ్‌కే పరిమితం అయ్యారు. ఏడాది కాలంగా ఆయన ప్రజలకు దూరంగానే ఉంటున్నారు. కానీ.. ఆయన ఇమేజీ అయితే ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా అనే ఎదురుచూస్తనే ఉన్నారు ఇంకా ఆయన అభిమానులు. తెలంగాణ ప్రజలు సైతం ఆ మూమెంట్ కోసం చూస్తున్నారు.

ఎన్నికల్లో ఓటమి తరువాత గులాబీ బాస్ బాత్‌రూంలో జారి పడ్డారు. ఆ తరువాత తుంటి ఆపరేషన్ జరిగింది. ఆయన అనారోగ్యం నుంచి కోలుకోవడానికి సుమారు నెలన్నర సమయం పట్టింది. ముఖ్యంగా ఉద్యమ కాలం నుంచే కేసీఆర్‌కు అభిమానులు ఎక్కువ. స్పీచుల్లో ఆయన విసిరే చలోక్తులు, సామెతలు, ఆయన మాట తీరు అంటే ప్రజలకు ఎంతగానో ఇష్టం. ఆయన ప్రసంగం వస్తుందంటే జనాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇక ఇంటి బయట ఉన్నోళ్లు యూట్యూబ్‌లు ఓపెన్ చేసి మరీ కేసీఆర్ స్పీచ్ చూస్తుంటారు. ఎందుకంటే ఆయన పంచ్‌లు, చమత్కారం, కౌంటర్లు, విమర్శలు అలా ఆకట్టుకునేవి. కానీ.. వయసు మీద పడుతుండడం.. అనారోగ్యం కారణాల వల్ల కాస్త గ్యాప్ ఇస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా ప్రజలు ఇంకా ఆయన కోసం పరితపిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు ఆయన మీడియా సమావేశాలకు చానల్స్‌లలో వచ్చిన రేటింగ్స్ అంతా ఇంతా కావు.

కేసీఆర్ వారసత్వంతో కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ముందు నుంచి దూకుడుగా వ్యవహరిస్తారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. దాంతో ప్రజలు సైతం పెద్దగా ఆదరించాలని అనుకోవడం లేదు. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లో సత్తా చాటినప్పటికీ.. మంత్రిగా కొనసాగినన్ని రోజులు అందరికీ కలిసే పరిస్థితి ఉండేది కాదన్న వాదన ఉంది. అంతేకాకుండా.. కొంత మందిని మాత్రమే చేరదీశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే.. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నుంచి కేసీఆర్ బయటకు రావడం లేదు. అప్పటి నుంచి పార్టీని కేటీఆర్ ముందుకు నడిపిస్తున్నారు. అది కూడా ఫాంహౌజ్ నుంచి కేసీఆర్ ఇస్తున్న డైరెక్షన్లతోనే ఆయన ముందుకు సాగుతున్నారు.

అయితే.. రేవంత్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కేటీఆర్ ప్రభుత్వంపై ఏదో ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నిత్యం ఏదో ఒక సాకు చెబుతూ మోకాలడ్డుతున్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతీ పథకానికి అడ్డు తగులుతూనే ఉన్నారు. ఏదో ఒకటి అందులో లోపాలను వెతుకుతూ ప్రజల్లో మైలేజీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. అవి అన్నీ కూడా బోల్తాకొడుతున్నాయి. హైడ్రా విషయంలో కావచ్చు.. లగచర్ల భూముల విషయంలో కావచ్చు.. ఇలా ప్రతీ దాంట్లోనూ విమర్శలు చేస్తూ దొరికిపోతున్నారు. కేటీఆర్ చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలతో సహా బయటపెడుతున్నది. దీంతో కేటీఆర్ ఏదో చేయాలనుకుంటే అది ఏదో అయి కూర్చుంటున్నది. అందుకే.. బీఆర్ఎస్ పార్టీలోనూ కేటీఆర్ వైఖరిపై విమర్శలు వస్తున్నట్లు టాక్ నడుస్తున్నది. అనవసరంగా ఏదో ఒక అంశాన్ని తెరమీదకు వచ్చి.. బీఆర్ఎస్ పార్టీనే చివరకు ఇరుకున పడేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అందుకే.. పార్టీని నడిపించడం కేటీఆర్ వల్ల కాదంటూ బాహాటంగానే కార్యకర్తలు చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. పార్టీకి పూర్వ వైభవం కావాలంటే కేసీఆర్ మళ్లీ ప్రజల్లోకి రావాలని కోరుకుంటున్నారు. దీనికి సైతం ఉదాహరణలు చూపుతున్నారు. ఇటీవల చాలాకాలం తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. దీనిని మీడియాలో చాలా వరకు హైప్ వచ్చింది. అదే సమయంలో కేసీఆర్ మీడియా ముందుకు వస్తారేమోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ.. ఆయన రాలేదు. అయినప్పటికీ కేసీఆర్ సమావేశంపై వచ్చిన బ్రేకింగ్స్ చాలా వరకు అబ్జర్వ్ చేశారు. తిలకించారు కూడా. అయితే.. అదే సందర్భంలో ఈ మధ్య కేటీఆర్ ఓ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. కానీ.. ఆ ఇంటర్వ్యూని పెద్దగా ఎవరూ ఆదరించలేదు. పెద్దగా ఎవరూ తిలకించలేదు కూడా. అటు యూట్యూబ్‌లోనూ పెద్దగా ట్రెండ్ అవ్వలేదు. పెద్దగా వ్యూస్ కూడా రాలేదు. దానికి రేటింగ్ కూడా అంతగా కనిపించలేదు. అదే.. కేసీఆర్ వీడియో రిలీజ్ చేస్తే మాత్రం రెట్టింపు ఆదరణ లభిస్తోంది. అందుకే.. కేటీఆరే బయటకు రావాలని జనం కోరుకుంటున్నారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.