Begin typing your search above and press return to search.

స్మితా సబర్వాల్ తనకిష్టమైనది మాట్లాడితే మీకేంటి బాధ?

ఆమె వ్యాఖ్యలు వికలాంగులను అవమానపరిచే విధంగా ఉన్నాయంటూ నిరసనలు వెల్లువెత్తాయి.

By:  Tupaki Desk   |   3 Sep 2024 5:43 AM GMT
స్మితా సబర్వాల్ తనకిష్టమైనది మాట్లాడితే మీకేంటి బాధ?
X

గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు పెద్దపీట వేశారు. రాష్ట్రం ఏర్పాటై కొత్త ప్రభుత్వం కొలువుదీరాక సీఎంఓలోకి మొదటగా అపాయింట్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆమెనే. స్మితా సబర్వాల్ అటు తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తూ ఉంటారు. ఏదో ఒక అంశంపై పోస్టులు పెడుతూనే ఉంటారు. నిస్సంకోచంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటారు.

అయితే.. ఇటీవల దివ్యాంగుల మీద స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆమె వ్యాఖ్యలు వికలాంగులను అవమానపరిచే విధంగా ఉన్నాయంటూ నిరసనలు వెల్లువెత్తాయి. అంతేకాదు.. ఆమెపై హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది. దివ్యాంగులపై ఆమె చేసిన వ్యాఖ్యలు అభ్యంతకరంగా ఉన్నాయని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు.

ఆల్ ఇండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటా అవసరమా? అంటూ స్మితా చేసిన వ్యాఖ్యలే ఈ దుమారానికి కారణమయ్యాయి. ఐపీఎస్, డిఫెన్స్ సహా పలు సర్వీసుల్లో దివ్యాంగ కోటా ఎందుకు లేదని ప్రశ్నించారు. దీంతో కోచింగ్ అకాడమీల నిర్వాహకులు, వికలాంగుల హక్కుల పోరాట సమితి వారితోపాటు చాలా మంది ఫైర్ అయ్యారు. ఆమె వ్యాఖ్యలు వికలాంగులను ఎంతగానో బాధించాయని మండిపడ్డారు. గుర్తింపు కోసం సివిల్ సర్వెంట్ అయి ఉండి అలాంటి వ్యాఖ్యలు సరికాదని.. వెంటనే చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

ఆ పిల్‌కు సంబంధించిన తీర్పును ఈ రోజు హైకోర్టు వెల్లడించింది. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను సమర్థించింది. ఆమె పై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిల్‌ను కొట్టేసింది. అంతేకాదు.. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరి హక్కులకు భంగం వాటిల్లలేదని.. అలాంటి ఆధారాలు కూడా లేవని స్పష్టం చేసింది. ఆమె వ్యాఖ్యల ఆధారంగా దివ్యాంగుల రిజర్వేషన్లు కూడా ఏం తొలగించ లేదని పేర్కొంది. సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుందని.. ఆమెకు కూడా వర్తిస్తుందని వ్యాఖ్యానించింది.